top of page

పీపీపీపై మోజు.. వైద్యవిద్యకు బూజు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 22
  • 2 min read

ree

వైద్య కళాశాలల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనూహ్య షాక్‌ తగిలింది. ఇటీవలి కేంద్ర ప్రభుత్వ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పస లేదని చెప్పకనే చెప్పాయి. గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. వాటిలో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తి అయ్యి తరగతులు ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో మరో రెండు కళాశాలలు కూడా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ`జనసేన`బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం గత ప్రభుత్వానికి పూర్తి విరుద్ధమైన వైఖరి తీసుకుంది. ప్రభుత్వరంగంలో చేపడితే నిర్మాణాలు పూర్తి అయ్యి అవి అందుబాటులోకి వచ్చేసరికి పదేళ్లకుపైగానే పడుతుందన్న వాదనను తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలల నిర్మాణాలను ప్రారంభించినప్పటికీ అవన్నీ ముందుకు సాగడం లేదని, ఒక్కటి కూడా నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తి చేసుకున్నట్లు వైకాపా ప్రభుత్వం ప్రకటించుకుందని విమర్శించింది. వీటి నిర్మాణాలు పూర్తి చేయాలంటే రూ.4వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి ఉంటుందని.. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అన్ని నిధులు ఇప్పటికిప్పుడు కేటాయించే పరిస్థితి లేదని చంద్రబాబు`పవన్‌ సర్కారు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలో కాకుండా పబ్లిక్‌`ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానంలో చేపడతామని ప్రకటించి, ఆ మేరకు కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకుంది. అదే ఊపులో పది మెడికల్‌ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పగించే దిశగా వడివడిగా సాగుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ప్రారంభించింది. పీపీపీ అంటే ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడమేనని ప్రజలకు వివరిస్తూ వరుసగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి నిర్మాణంలో ఉన్న నర్సీపట్నం మెడికల్‌ కళాశాలను సైతం సందర్శించారు. ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని వ్యతిరేకించాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీశ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. కోటి సంతకాల ద్వారా మెడికల్‌ కళాశాలల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర గవర్నర్‌ దృష్టి తీసుకెళ్లాలన్నది వైకాపా ఆలోచన. వైద్య కళాశాలలపై రాజకీయ రగడ జరుగుతున్న తరుణంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు ఇరకాట పరిస్థితి సృష్టించింది. దేశవ్యాప్తంగా మెడికల్‌ కళాశాలల్లోని స్పెషాలిటీ కోర్సుల్లో(పీజీ) సీట్లు పెంచుతూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా మన రాష్ట్రానికి కూడా వివిధ విభాగాల్లో 106 అదనపు సీట్లు మంజూరు చేసినట్లు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. ఈ సీట్ల భర్తీకి అవసరమైన ప్రతిపాదనలను కూడా ఆమోదించింది. కాగా పెంచిన 106 సీట్లలో ఏకం 60 సీట్లు వైకాపా హయాంలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త మెడికల్‌ కళశాలలకే మంజూరు కావడం విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో ఇంతవరకు 1763 బ్రాడ్‌ స్పెషాలిటీ సీట్లు ఉండేవి. తాజా పెంపుతో వాటి సంఖ్య 1869కి పెరిగింది. పెంచిన సీట్లలో నంద్యాల మెడికల్‌ కాలేజీకి 16, ఏలూరు కాలేజీకి 4, మచిలీపట్నం కాలేజీకి 12, రాజమండ్రికి 16, విజయనగరం వైద్య కళాశాలకు 12 కేటాయించారు. ఇక పాత కళాశాలల్లో గుంటూరు కళాశాలకు 4, విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు రెండు విభాగాల్లో 8, అనంతపురానికి 15, శ్రీకాకుళానికి 8, కడపకు 7, కర్నూలుకు 4 చొప్పున కేటాయించారు. వైద్య కళాశాలలను పీపీపీకి అప్పగించే క్రమంలో వైకాపా హయాంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని, ఎప్పటికి పూర్తి అవుతాయో చెప్పలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ వాటిలోనే ఐదు కళాశాలలకు ఇప్పుడు ఎన్‌ఎంసీ 60 సీట్లు కేటాయించింది. నిర్మాణాలు పూర్తి కాకుండా, తరగతులు ప్రారంభం కాకుండా సీట్లు కేటాయించే పరిస్థితి ఉండదన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంటే ఆ ఐదు కొత్త కళాశాలలు నిర్మాణాలు పూర్తి చేసుకుని, పని చేస్తున్నాయన్నమాట. ఆ లెక్కన వైకాపా హయాంలో చేపట్టిన 17 కళాశాలల నిర్మాణాలు పూర్తి కాలేదని, ఇప్పట్లో ఆ అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన అవాస్తవమని తేటతెల్లమవుతోంది. వైకాపా హయాంలో సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కడం తప్ప అభివృద్ధి లేదని ఆరోపణలు గుప్పిస్తున్న ఎన్డీయే కూటమి పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.. అదే వైకాపా హయాంలో ఒకేసారి చేపట్టిన 17 వైద్య కళాశాలలకు నిధుల కొరత పేరుతో మోకాలడ్డటం, పీపీపీ అంటే ప్రైవేట్‌పరం చేయడం కాదని వితండవాదం చేస్తున్నాయి. పూర్తిగా ప్రభుత్వరంగంలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలకు, పీపీపీ విధానంలో ప్రారంభించే కళాశాలలకు మధ్య చాలా తేడా ఉంటుందని వైద్యరంగంలో ఉన్నవారు చెబుతున్నమాట. వైద్య కళాశాలలు ఏర్పాటైతే.. వాటికి అనుబంధంగా బోధన ఆస్పత్రులు కూడా పనిచేస్తాయి. ప్రభుత్వ వైద్య కళాశాల్లో మెజారిటీ సీట్లు ప్రభుత్వ కోటాలోనే ఉంటాయి. ఫీజులు తక్కువగా ఉండి పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. అదే పీపీపీ లేదా ప్రైవేట్‌ అయితే పరిస్థితి దీనికి పూర్తి రివర్స్‌లో ఉంటుంది. వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో చికిత్సల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంటుంది. కానీ రాష్ట్ర సర్కారు ఎందుకో పీపీపీ మోడ్‌పైనే మోజు చూపుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page