పాపాల ఫీజుతో ‘పార్కింగ్’ ప్లాజా
- Prasad Satyam
- 3 days ago
- 2 min read
మడపాం టోల్‌ప్లాజా వద్ద వాహనాల అక్రమ పార్కింగ్
అనుమతుల్లేకుండానే సమీపంలో షాపులు, హోటళ్లు
వాటికి వచ్చే వారి వాహనాలతో నిండిపోతున్న పరిసరాలు
మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫొటోల సమాహారం శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్లే మార్గంలో మడపాం టోల్‌గేట్‌కు చెందినది. శ్రీకాకుళం నుంచి వెళ్లడానికి ఏడు ద్వారాలు, నరసన్నపేట వైపు నుంచి రావడానికి ఏడు ద్వారాలు.. మొత్తం 14 లైన్ల రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాయి. గేటు దాటడానికి చెల్లించాల్సిన టోల్ రుసుము లేక వీటిని పక్కన పెట్టారని భావిస్తే పొరపాటే అవుతుంది. ఎందుకంటే చాలా విశాలంగా ఉన్న ఈ రోడ్డుకు రెండు వైపులా భారీ వాహనాలను పార్కింగ్ చేసి వదిలేయడం నిత్యకృత్యంగా మారింది. ఇలా అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేయడం వల్ల టోల్‌గేట్ దాటి రాకపోకలు సాగించేవారికి రెండు ప్రవేశ మార్గాల నుంచి మాత్రమే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఫాస్ట్‌టాగ్ వేసుకున్న తర్వాత లిప్తపాటులో వాహనాన్ని స్కాన్ చేసి పంపాలి. కానీ టోల్‌ప్లాజాలోని మిగిలిన గేట్ల నుంచి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో రెండువైపులా వాహనాలతో నిండిపోతుంది. ఈ సమస్య గురించి టోల్‌ప్లాజా నిర్వహక సంస్థకు తెలుసు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకూ తెలుసు. ఎందుకంటే వారే ఈ సమస్యపై ఫిర్యాదు చేసిన వారి గురించి ఆరా తీసి, భయపెట్టిన ఉదంతం ఒకటి ఉంది. 14 లైన్ల ఈ రోడ్డు మీద లారీలు, ఇతర వాహనాలను ఎందుకు నిలిపేస్తున్నారంటే.. టోల్‌గేట్‌కు ఆనుకొని జాతీయ రహదారిపైనే సుమారు 30 దుకాణాలు ఉన్నాయి. వీటిలో హోటళ్లు, టీస్టాల్స్‌తో పాటు అనేక వ్యాపారాలు నడుస్తున్నాయి. ఈ షాపులకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డు మీదే నిలిపేస్తూ టోల్‌ప్లాజా పరిసరాలను పార్కింగ్ స్థలంగా మార్చేశారు.
షాపులతోనే పార్కింగ్ సమస్య
ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల మేరకు టోల్‌గేట్‌కు రెండువైపులా 500 మీటర్ల దూరం వరకు దుకాణాలు పెట్టి వ్యాపారాలు నిర్వహించాలంటే ఎన్‌హెచ్‌ఏఐ అనుమతులుండాలి. కానీ ఇక్కడ ఎవరికీ అవి లేవు. కొందరు అధికారులకు నెలకు రూ.2 లక్షల వరకు ముట్టజెబుతూ షాపులు నిర్వహిస్తున్నవారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. ఈ వ్యాపార సంస్థల వద్దకు వచ్చేవారు టోల్‌ప్లాజా ప్రాంతాన్ని పార్కింగ్ ప్లాజాగా మార్చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం`నరసన్నపేట హైవే మీద వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో అనేకమంది జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న తమ జిరాయితీ స్థలాలతోపాటు పాటు ఎన్‌హెచ్‌ఏఐ భూమిని కూడా ఆక్రమించి షాపులను రూ.లక్ష చొప్పున అద్దెకు ఇచ్చారని తెలిస్తే ఎన్‌హెచ్‌ఏఐ ఉద్యోగుల్లో కొందరు గుండెలు బాదుకుంటారేమో?! అసలు అత్యవసర వాహనాలకు ఎటువంటి అడ్డంకి లేకుండా నేరుగా టోల్‌గేట్‌లోకి ప్రవేశించే బూత్‌ల వద్దే పెద్దసంఖ్యలో వాహనాలు నిలిపివేసి ఉంటున్నాయి. దీర్ఘకాలిక పార్కింగ్ అవసరాలు తీర్చడానికి 500 మీటర్ల నో పార్కింగ్ జోన్ వెలుపల మల్టీ లెవల్ లేదా ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలి. ఇవి జాతీయ రహదారిలో కొన్నిచోట్ల కనిపిస్తాయి. అయితే మడపాం టోల్‌గేట్‌కు ఈ అవసరం లేదనుకోవడం వల్ల పార్కింగ్ సౌకర్యానికి ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేయలేదు. అత్యవసరమైతే గంట వరకు పార్కింగ్ ఫీజు చెల్లించి వాహనాలు పార్కింగ్ చేయొచ్చని కూడా నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు నిబంధనలకు విరుద్ధంగా ఎంతమంది పార్కింగ్ చేశారు, అందులో ఎంతమంది నుంచి ఫీజు వసూలు చేశారనే లెక్కలు చెప్పే డేటా కూడా ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వద్ద బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ అనధికార పార్కింగ్ మొత్తం అక్కడున్న వ్యాపారుల వెసులుబాటు కోసమేనని వేరేగా చెప్పనక్కర్లేదు.










Comments