ప్రాణం ఖరీదు రూ.4 లక్షలు?!
- BAGADI NARAYANARAO

- Jul 9
- 2 min read
బుడితి సామాజిక ఆస్పత్రిలో వికటించిన సిజేరియన్
రిమ్స్‌కు తరలించి చికిత్స అందించినా ఫలితం శూన్యం
ఇద్దరు బాలింతలు మృతి.. బంధువుల ఆందోళన
ఆ తల్లుల ప్రాణాలకు రేటు కట్టిన పోలీసులు, పెద్దలు
ఇద్దరి కుటంబాలకు రూ.8 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం
ఆందోళన విరమించి మృతదేహాలను తీసుకెళ్లిన బంధువులు
(సత్యంన్యూస్, నరసన్నపేట)
ఇప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన పసిగుడ్డుల ప్రాణాలకు పెద్దలనే షరాబులు ఖరీదు కట్టారు. ఇంకా కళ్లు తెరవకముందే తమ తల్లులను కోల్పోయిన ఆ అభాగ్యులను.. తల్లిలేని బిడ్డలుగా మిగిల్చిన వైద్యుల నిర్లక్ష్యాన్ని కరెన్సీ నోట్లతో మాఫీ చేసేశారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని.. వారి చేత అమ్మా.. అనిపించుకోవాలన్న కోటి ఆశలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు గర్భిణులు బిడ్డలకు జన్మనివ్వగలిగినా.. వారి ముద్దు మురిపాలు అనుభవించకుండానే ప్రసవ సమయంలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని సారవకోట మండలం బుడితి సామాజిక ఆస్పత్రి వైద్యురాలు శోభారాణి నిర్లక్ష్యం కారణంగానే సిజేరియన్ వికటించి ఇద్దరు బాలింతలు మృతి చెందారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సారవకోట పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో వివాదాన్ని బేరసారాలతో కేసు లేకుండా మాఫీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ జరిగింది
జలుమూరు మండలం యలమంచిలి పరిధిలోని కామేశ్వరరావు పేటకు చెందిన పట్ట అరుణ(21)కు విశాఖపట్నం పైడిమాంబ కాలనీకి చెందిన గోవిందరావుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. నెలలు నిండిన ఈమె ప్రసవం కోసం కన్నవారింటికి వచ్చింది. అలాగే పాగోడు గ్రామానికి చెందిన కొర్లాపు ధనలక్ష్మి(22)కి ఆమదాలవలస మండలం మెట్టక్కివలసకు చెందిన ఢల్లీిశ్వరరావుతో వివాహమైంది. గర్భం దాల్చిన ఆమె కూడా కన్నవారింటికి వచ్చింది. ధనలక్ష్మికి ఈ నెల 23, అరుణకు ఆ నెల 28న డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే పురిటినొప్పలు రావడంతో ముందుగానే వారిని బుడితి సీహెచ్‌సీలో చేర్పించారు. ఈ నెల ఏడో తేదీ(సోమవారం)న మధ్యాహ్నం సిజేరియన్ చేయగా వారిద్దరూ మగశిశువులకు జన్మనిచ్చారు. శిశువులు ఆరోగ్యంగానే ఉన్నా.. వారి తల్లులు మాత్రం ఆపరేషన్ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిస్థితి విషమించడంతో సిబ్బంది వైద్యురాలికి సమాచారం ఇచ్చారు. పరీక్షించిన డాక్టర్ శోభారాణి యూరిన్ బ్లాడర్‌లో సమస్య ఉందంటూ ఇద్దరినీ శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఆ విషయం బాలింతల బంధువులకు చెప్పి సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు అంబులెన్స్‌లో శ్రీకాకుళానికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు వారికి అంతర్గతంగా బ్లీడిరగ్ అవుతోందని, యూరిన్ బ్లాడర్ బ్లాక్ అయిందని గుర్తించి ఇద్దరు బాలింతలకు మంగళవారం గర్భసంచులు తొలగించారు. అనంతరం ఇద్దరిని వెంటిలేటర్స్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే అప్పటికే వారిలో ఒకరి శరీరంలో కిడ్నీలు, ఇతర అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. మరో మహిళకు కార్డియాక్ అరెస్టు కావడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఇద్దరూ మృతి చెందినట్టు ప్రకటించిన రిమ్స్ వైద్యులు మృతదేహాలను అంబులెన్స్‌లో బుడితి సీహెచ్‌సీకి బుధవారం తెల్లవారుజామున పంపించేశారు.
రాయ‘బేరం’
ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు, వారి బంధువులు, గ్రామస్తులు సారవకోట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే తమవారిని కోల్పోయామని ఆరోపిస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. రిమ్స్ నుంచి అంబులెన్స్‌లో వచ్చిన మృతదేహాలను ఇళ్లకు తీసుకువెళ్లడానికి నిరాకరించి పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించారు. వివాదం తీవ్రమవుతున్న తరుణంలో పోలీసులు, గ్రామపెద్దలు కలిసి బాధిత కుటుంబ సభ్యులను నచ్చజెప్పి వైద్యులతో మాట్లాడి తలా రూ.4 లక్షలు పరిహారం ఇప్పించేలా రాజీ కుదిర్చారని ప్రచారం జరుగుతోంది. వివాదం పెద్దది కాకుండా పోలీసులే మధ్యవర్తిత్వం వహించి వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. పరిహారం ఇవ్వడానికి వైద్యురాలి బంధువులు అంగీకరించడంతో బాధితులు ఆందోళన విరమించి మృతదేహాలను తీసుకెళ్లారంటున్నారు.
కొత్త డాక్టర్ వచ్చిన కొద్దిరోజులకే..
బుడితి సీహెచ్‌సీలో రెండువారాల క్రితం వరకు సృజన వైద్యురాలిగా పనిచేశారు. ఆమె హయాంలో ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా ఉండటంతో.. చుట్టుపక్కల గ్రామాల నుంచి గుర్భిణులను ప్రసవాలకు ఇక్కడికే తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో డాక్టర్ సృజన స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నుంచి డాక్టర్ శోభారాణి ఇక్కడికి వచ్చారు. కొద్దిరోజులకే ఈ దారుణం జరిగింది. ఇప్పటి వరకు ఈ సీహెచ్‌సీ పరిధిలో మాతృ మరణాలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. కొత్త డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటనపై కలెక్టర్ స్పందించారు. విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో అనితను ఆదేశించడంతో ఆమె బుడితి సీహెచ్‌సీని సందర్శించి వైద్యులు, సిబ్బందిని విచారించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.














Comments