ప్రాణాల వెల ఇంతేనా స్వామీ!?
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 3 min read
వ్యక్తిగత కక్షలతో చంపుకున్నవారికి ఇచ్చిన పరిహారం కంటే తక్కువ
తిరుపతి, సింహాచలంలో మరణించివారికి రూ.25 లక్షలు చొప్పున పంపిణీ
ప్రైవేటు వ్యక్తుల ఆలయమంటూ రూ.15 లక్షలతో సరి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఏడాది జనవరి మొదటి వారంలో వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు పరిహారం టీటీడీ ద్వారా చెల్లించారు. జాతీయ విపత్తు నిధి నుంచి కేంద్రం ఇచ్చిన పరిహారం అదనం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో చందనోత్సవం సందర్భంగా సింహాచలం కొండపై గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించారు. జాతీయ విపత్తు నిధి నుంచి కేంద్రం ఇచ్చిన పరిహారం అదనం.
ఇటీవల కర్నూల్‌లో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన 19 మంది కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు, బస్సు యాజమాన్యం రూ.2 లక్షలు ప్రకటించాయి.
కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి కార్తీక ఏకదశి దర్శనం క్యూలైన్‌లో తొక్కిసలాట కారణంగా రెండు రోజుల క్రితం 9 మంది మృతిచెందారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించి చెక్కులను పంపిణీ చేశారు. వైకాపా అధినేత 9 బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించారు.
ఈ ఏడాదిలో వరుసగా జిల్లాలో జరిగిన రెండు గ్రానైట్ క్వారీల ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఒక ప్రమాదంలో మృతి చెందిన మూడు కుటుంబాలకు యాజమాన్యం రూ.17 లక్షలు చొప్పున చెల్లించింది. పిడుగుపాటు కారణంగా మృతిచెందిన మరో ముగ్గురికి కార్మిక సంఘాల ఆందోనతో రూ.8లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.4లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.
రాష్ట్రంలో అత్యాచార ఘటనల్లో, రాజకీయ కారణాలతో ప్రత్యర్ధులు చేసిన దాడిలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున, పార్టీల తరఫున పరిహారం అందించడం పరిపాటిగా మారింది.
ప్రమాదం ఎలా జరిగినా, ఏ సందర్భాల్లో జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉందని చెప్పడానికి పరిహారం చెల్లించడం ధర్మం. విశాఖలోని హిందూస్థాన్ పాలిమార్స్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించి చెల్లించింది. అయితే ప్రమాదాలు ఒకసారి జరిగి ఆగిపోవని, ఇదొక నిరంతర ప్రక్రియ అని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఆలస్యంగా అర్థమైంది. ఆ తర్వాత బ్రాండిక్స్ కర్మాగారంతో పాటు అనేక ప్రమాదాల్లో ప్రభుత్వ పరిహారం తగ్గుతూవచ్చింది.
సింహాచలం, తిరుపతి దేవస్థానాల్లో జరిగిన ప్రమాదాలకు రూ.25 లక్షలు చెల్లిస్తే, కాశీబుగ్గలోని ధర్మకర్త నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట మృతులకు రూ.15 లక్షలు చెల్లించారు. ఇలా ఎందుకు వ్యత్యాసం చూపించారని ప్రశ్నిస్తే.. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయంలో జరిగిన ప్రమాదం, ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించిన దేవాలయంను ఒక్కటిగా చూడలేమని అధికారులు చెబుతున్నారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న దేవాలయం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని, అందులో ఏ పొరపాటు జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన దేవాలయంలో ప్రభుత్వానికి ఏమిటి సంబంధమన్న వాదన వినిపిస్తుంది.
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం పరిహారం ఎంత చెల్లించిందన్నది ఎవరూ పెద్దగా చర్చించడం లేదు. దేవాలయం దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం తరఫున కనీస సౌకర్యాలు కల్పించలేదని అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ ప్రమాదం తర్వాత ఇలాంటి ఘటన జరగదన్న భరోసా ప్రభుత్వం ఇవ్వగలదా అని సగటు భక్తుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు భక్తుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం భక్తుల రద్దీ ఉంటుంది. స్థానిక పోలీసులకు ఈ విషయం తెలుసు. అయినా దేవాలయం ప్రైవేట్ వ్యక్తిది కాబట్టి మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో రెండుకు తగ్గకుండా దేవాలయాలు ఉంటాయి. ఆలయం నిర్మించిన విధానం, ఉన్న ప్రాంతం, అందులో ఆరాధించే దేవతామూర్తిని బట్టి ఆలయం ప్రాచుర్యం పొందుతుంది. ప్రాచుర్యాన్ని బట్టి భక్తుల రద్దీ పెరుగుతుంది. దేవాలయాల్లో బంగారం భద్రత కోసం సీసీ కెమెరాలను అమర్చుకోవాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ భక్తుల రద్దీని ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. ఈమధ్య కాలంలో మళ్లీ భక్తి ఒక ఉద్యమంగా మారింది. ప్రచనకారులూ పెరిగారు. వారి ప్రసంగాలకు సామాజిక మాధ్యమాలు ఇచ్చే ప్రాధాన్యతా పెరిగింది. ఒకప్పుడు ఎవరికీ పట్టని రోజులు ఇప్పుడు అత్యంత పుణ్యదినాలైపోయాయి. గోదావరి పుష్కరాల్లో మొదటి ఘడియల్లోనే స్నానం చేయాలన్న ఆరాటమే అనేకమంది ప్రాణాలు తీసింది. ఇందులో నగరానికి చెందిన బలగవాసులూ ఉన్నారు. ఈమధ్య ఆధ్యాత్మిక టూరిజానికి మంచి గిరాకీ వచ్చింది. ఎక్కడపడితే అక్కడికి జనాలు పొలోమని వెళ్తున్నారు. ఈ సందర్భంలో బస్సు ప్రమాదాలూ జరుగుతున్నాయి. గతంలో చనిపోయే లోపు ఒకసారి కాశీలో అడుగుపెడితే చాలనుకునేవారు. ఇప్పుడు కాశీలో తొమ్మిది రాత్రులు గడిపి వచ్చామని చెప్పినవారి సంఖ్య పెరిగిపోయింది. గోదావరికి మాత్రమే పుష్కరాలు మనకు తెలుసు. ఇది ఒక టూరిజం అంశం కావడంతో ఆ తర్వాత కృష్ణాకూ చేశారు. అంతర్వాహిని అని కొందరు, అసలు భూమి మీద ప్రవహించడంలేదని చెప్పే సరస్వతీ నదికి కూడా ఆమధ్య పుష్కరాలు జరిగాయి. ఇవన్నీ ఆధ్యాత్మికవేత్తలు కల్పించిన ప్రాచుర్యంలో భాగమే. ఇప్పుడు సగటు మనిషి బాగోగులు చూడాల్సింది ప్రభుత్వాలే. ఎందుకంటే తమది సంక్షేమ రాజ్యమని, రామరాజ్యమని చెప్పుకుంటున్నాయి కాబట్టి ఎక్కడ చనిపోయినా, ఎలా చనిపోయినా పరిహారం ఇవ్వాల్సిందే. చివరకు కమ్మ, కాపు వ్యక్తుల మధ్య వ్యక్తిగత కక్షలతో హత్యలు జరిగితే కోట్లాది రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ ప్రాణం అంటే ఓటే. చనిపోయినవాడి కులం ఎంత బలమైనదైతే అంత రేటు పలుకుతుంది. ఆమధ్య ముఖ్యమంత్రిగారి కులం, ఉపముఖ్యమంత్రి గారి కులం చిన్నబుచ్చుకోకుండా డబ్బులు సర్దారు. కాబట్టి కాశీబుగ్గలోనివి కూడా ప్రాణాలే. వాటికి కూడా విలువుంటుంది. అయితే ఆ ప్రాణాలకు అంత తక్కువ వెల కట్టడమే ఇక్కడ వచ్చిన చిక్కు.










Comments