top of page

ప్రాంతీయ పార్టీల్లోనే ఇంటిపోరు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 3, 2025
  • 2 min read

తెలంగాణ బీఆర్‌ఎస్‌లో ఇంటిపోరు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. పార్టీ అధినేత కే.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సోదరుడు కేటీఆర్‌, మరో కీలకనేత అయిన అదే కుటుంబ సభ్యుడు హరీష్‌రావుతో ఉన్న విభేదాల నేపథ్యంలో కొన్నాళ్లుగా కవిత పార్టీపై బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఆమె తీరు పార్టీ పరువును గంగలో కలిపేస్తుండటంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. కేసీఆర్‌ తన సొంత కూతురినే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల్లో ఇంటిపోరు గురించి చర్చ జరుగుతోంది. గతంలో సొంత కుటుంబ సభ్యులనే పార్టీ నుంచి అధినేతలు గెంటేసిన అనేక ఉదంతాలను పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. అయితే దేశంలో అతి పురాతన పార్టీగా పేరొందిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌లోనూ ఒకే ఒక సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పెత్తనం అధికం. అధినేత మాటే శిరోధార్యం. వారి కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీల్లో వివిధ హోదాల్లో తిష్ట వేసి అధికారం చెలాయిస్తుంటారు. ఈ పెత్తనం విషయంలోనే వారి మధ్య విభేదాలు రేగడం, కొందరిని పార్టీల నుంచి గెంటేయడం జరుగుతూ వస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో యువరాజుగా చెలామణీ అయిన దివంగత ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ సతీమణి మేనకాగాంధీని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత ఆమె సంజయ్‌ విచార్‌మంచ్‌ పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన ఆమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనూ కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. పార్టీని చంద్రబాబు చేజిక్కించుకున్న తర్వాత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సాక్షాత్తు ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణ, అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. తమిళనాడులో ప్రధాన పార్టీ అయిన డీఎంకేలో కూడా కుటుంబ పోరు నడిచింది. అధినేత కరుణానిధి తన కుమారుడు ఎంకే అళగిరిని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ వేటు వేశారు. అక్కడ మరో ప్రధాన పార్టీ అన్నాడీఎం పార్టీలో జయలలిత హయాంలో పార్టీలో నెంబర్‌ 2గా చెలామణీ అయిన శశికళను.. జయలలిత తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్‌ను పాలించిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను అవే ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అదే రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అయిన అప్నాదళ్‌ వ్యవస్థాపకుడు సోన్‌లాల్‌ పటేల్‌ పార్టీలో చీలిక కు ప్రయత్నించిన తన కుమార్తె, ప్రస్తుత కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. దాంతో ఆమె వేరు కుంపటి పెట్టుకున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) వ్యవస్థాపకుడు, బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కర్ణాటకలో జేడీఎస్‌ పేరుతో ప్రాంతీయ పార్టీ నడుపుతున్న మాజీ ప్రధాని దేవెగౌడ సెక్స్‌ కుంభకోణంలో దోషిగా తేలిన తన మనువడు, మాజీ ఎంపీ రేవణ్ణను బహిష్కరించారు. హర్యానాలో ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ సీఎం ఓం ప్రకాష్‌ చౌతాలా తన మనవడు దుష్యంత్‌ చౌతాలాను పార్టీ వ్యతిరేక చర్యల ఆరోపణలతోనే సస్పెండ్‌ చేశారు. మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే ఉన్నప్పుడు పార్టీ లైన్‌ క్రాస్‌ చేశారంటూ తన సొంత తమ్ముడి కుమారుడైన రాజ్‌ థాకరేను పార్టీ నుంచి బయటకు పంపించారు. దాంతో ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సమితి పేరుతో సొంత పార్టీ పెట్టారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)ని స్థాపించిన మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌పవార్‌కూ వెన్నుపోటు తప్పలేదు. స్వయంగా ఆయన అల్లుడైన అజిత్‌ పవార్‌ పార్టీని చీల్చి.. చీలిక వర్గంతో సొంత కుంపటి పెట్టుకుని బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరారు. ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె తన సోదరుడు వైఎస్‌ జగన్‌తో విభేదించి వైకాపాను వీడి వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. కొన్నాళ్లకే కాంగ్రెస్‌తో కలిసిపోయి ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతూ అన్నపైనే కత్తులు దూస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page