top of page

ప్రైవేటు తాకట్టు.. రుణాల కనికట్టు.. అంతా ఆయన చెప్పినట్టు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Nov 8, 2025
  • 3 min read
  • గార, నరసన్నపేట కేసుల్లో నిర్థారణకు వచ్చిన డీఎస్పీ, సీఐడీ?

  • డాక్యుమెంటరీ ఆధారాల కోసం రంగంలోకి సీసీఎస్‌

  • త్వరలోనే బద్దలుకానున్న సూత్రధారుల పాపాల పుట్ట

  • తోటి అధికారులు, ఆడిటర్ల పాత్రపై ఆరా

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళం రీజియన్‌లో ఏళ్ల తరబడి పెరిగిపోయిన పాపాల పుట్ట బద్దలు కానుంది. ఈ రీజియన్‌లో పని చేస్తున్న బీఎంలు, ఆర్‌ఎంలు తామే సర్వాధికారులమన్నట్టు, తమ రాజ్యాంగమే సెపరేట్‌ అన్నట్లు కస్టమర్లను పురుగుల్లా చూసి తాము చెప్పిందే వేదమన్నట్టు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంకుల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాల కథనాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వచ్చినా ఇన్నాళ్లూ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తాము ఏం చేస్తే అదే చెల్లుతుందని విర్రవీగినవారు ఇప్పుడు శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం, సీఐడీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘సత్యం’ మొదట్నుంచీ చెబుతున్నట్టు గార ఎస్‌బీఐ బ్రాంచిలో తాకట్టు బంగారం మాయం కేసు, నరసన్నపేట బజారు బ్రాంచిలో ఎంఎస్‌ఎంఈ రుణాలను బినామీల పేరుతో బ్యాంకు అధికారులే తినేసిన కేసుల దర్యాప్తు ఒకేసారి క్లైమాక్స్‌కు చేరాయి.

రెండు కేసుల్లోనూ ఆయనపైనే అనుమానాలు

నరసన్నపేట బజారు బ్రాంచిలో దాదాపు రూ.3 కోట్లు విలువైన ప్రజాధనాన్ని అప్పటి బ్యాంకు అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎస్‌ఎంఈ రుణాల పేరుతో తమ సొంతానికి వాడుకున్నారు. ఈ విషయాన్ని ‘సత్యం’ పత్రిక బట్టబయలు చేయడంతో అప్పటి ఆమదాలవలస ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ బీఏఎన్‌ మూర్తిని రికార్డుల పరిశీలనకు పంపించారు. అక్కడికి వెళ్లిన ఆయన ఎందులో వేలు పెట్టినా అక్రమాలు వెలుగు చూడటంతో తోచినంత మేర ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. తర్వాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఈ దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్‌కు వచ్చినట్లు తెలిసింది. గతంలో రెండుసార్లు బజారు బ్రాంచ్‌లో రికార్డులు పరిశీలించిన సీఐడీ అధికారులు నకిలీల పేరుతో బ్యాంకు అధికారులే రుణాలు వాడుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. వాటికి సంబంధించి కొన్ని రికార్డులను తీసుకువెళ్లారు. దీనికి సమాధానం చెప్పాలంటూ రీజనల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్లకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ప్రజల పేరుతో సిబ్బంది సొమ్ము తినేశారని ఖరారు కావడంతో అప్పటి బ్యాంకు మేనేజర్‌ శ్రీకర్‌ను టెర్మినేట్‌ చేశారు. ఆయన బ్యాంకు ఉన్నతాధికారులకు రాసిన లేఖలోనే ఆయన పై అధికారుల పాత్ర బట్టబయలైంది. తాను బ్రాంచి మేనేజర్‌ హోదాలో మంజూరు చేసిన ప్రతి రుణానికి అప్పటి రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజు అనుమతులు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందే గార బ్రాంచిలో తాకట్టులో ఉండాల్సిన నగలు ప్రైవేటు ఫైనాన్స్‌ బ్యాంకుల్లో దర్శనమిచ్చిన కేసులో కూడా టీఆర్‌ఎం రాజు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు లాకర్‌లో ఉండాల్సిన నగలు ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల వద్ద ఉండటం వెనుక నేరుగా ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే రీజనల్‌ మేనేజర్‌ హోదాలో ఆయన నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది.

రెండు కేసులు ఒకేసారి క్లైమాక్స్‌కు

గార కేసులో కేవలం ఒక ఉద్యోగిపైన, ఆమె కుటుంబ సభ్యులపైన మాత్రమే రీజనల్‌ మేనేజర్‌ హోదాలో టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తే కుట్రకోణం కనిపిస్తోంది. ఆ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోగా, ఆమె సోదరుడిని పోలీసు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో పోలీసులు వదిలేసిన అనేక కోణాలను ‘సత్యం’ వెలుగులోకి తేవడంతో స్వప్నప్రియ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంమంత్రి అనితలను కలిసి కేసును పునర్విచారించాలని కోరుతూ పలు ఆధారాలు సమర్పించారు. ఆ మేరకు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఈ కేసును తవ్వి తీస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం అప్పటి రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజును శ్రీకాకుళం రప్పించి రహస్యంగా విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. డీఎస్పీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత తగిన ఆధారాల సేకరణ కోసం సీసీఎస్‌కు కేసును రిఫర్‌ చేశారు. ఎందుకంటే.. టీఆర్‌ఎం రాజు, ప్రైవేటు ఫైనాన్స్‌ల వద్ద బ్యాంకు బంగారం, స్వప్నప్రియ ఆత్మహత్య ఉదంతం.. చూడ్డానికి వేర్వేరుగా కనిపిస్తున్నా వీటి మధ్య కచ్చితంగా ఒక కనెక్షన్‌ ఉంది. ఈ చుక్కలను కలిపితేగాని స్పష్టమైన బొమ్మ కనిపించదు. ఆ బాధ్యతనే సీసీఎస్‌కు అప్పగించినట్లు తెలిసింది.

ఆడిటర్లను మేనేజ్‌ చేశారా?

గార బ్రాంచి లాకర్‌లో ఉండాల్సిన తాకట్టు నగలు ప్రైవేటు సంస్థల్లో ఎప్పట్నుంచో పద్దులో ఉన్నట్టు అక్కడి రికార్డులు చెబుతున్నాయి. కానీ కిందిస్థాయి నుంచి రీజనల్‌ మేనేజర్‌ స్థాయి వరకు జరిపిన అనేక అంతర్గత ఆడిట్లలో తాకట్టు బంగారం లాకర్లలోనే ఉన్నట్టు రిపోర్టులు ఇచ్చారు. తప్పుడు రికార్డులు ఇవ్వడానికి నిర్లక్ష్యమే కారణమా లేక లేదూ కుట్రలో భాగంగా ఆ తప్పు చేశారా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అంశం. స్వప్నప్రియ బంగారాన్ని మాయం చేసి సెలవులో వెళ్లిపోయారని అప్పట్లో బ్యాంకు, పోలీసు అధికారులు సెలవిచ్చారు. కానీ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల వద్ద ఉన్న రిజిస్టర్‌ చూస్తే ఎప్పట్నుంచో ఎస్‌బీఐలో ఉండాల్సిన బంగారం వీరి వద్ద తాకట్టులో ఉందని, విడిపించడం, మళ్లీ పద్దు పెట్టడం రొటీన్‌గా బినామీ పేర్లతో జరుగుతున్నాయని తేలింది. అటువంటప్పుడు ఒక్క స్వప్నప్రియే బంగారాన్ని మాయం చేశారని టీఆర్‌ఎం రాజు ఎలా ఫిర్యాదు చేశారు? స్వప్నప్రియ అంతకు ముందు సెలవు పెట్టినప్పుడు వేరే వారికి లాకర్‌ తాళాలు తీసే బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో కూడా ప్రైవేటు బ్యాంకుల వద్ద బంగారం తాకట్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు భోగట్టా. అటువంటప్పుడు వారి పేర్లు ఎందుకు ఫిర్యాదులో లేవనేది ఇప్పుడు ప్రశ్న. ఈ రెండు ఎపిసోడ్లలో బ్యాంకు ఆడిట్‌ మొత్తం ఫేక్‌ అని తేలిపోయింది. రీజనల్‌ మేనేజర్‌గా రాజు తనకు అనుకూలంగా ఆడిట్‌ రిపోర్టులను మార్చుకున్నారా లేక ఆడిటర్లను మేనేజ్‌ చేశారా? అనేది తేలాల్సి ఉంది. అన్నిటికంటే ముందు తన పరిధిలోని గార బ్రాంచిలో బంగారం నగలు మాయం కావడంపై పోలీసులకు ఫిర్యాదిచ్చిన తర్వాత ఆర్‌ఎం హోదాలో బ్యాంకు ఉన్నతాధికారులకు ఒక ఫ్లాష్‌ రిపోర్టు పంపాలి. కానీ రాజు ఆ రిపోర్టు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. బ్యాంకు అధికారులందరూ ఒకటేనని భావించి పాత డేట్‌ వేసి ఒక ఫ్లాష్‌ రిపోర్టు సృష్టిస్తే చెప్పలేం గానీ, నిజంగా బ్యాంకులో బంగారం మాయమైందని రిపోర్టు చేసుంటే అందుకు బాధ్యులైన చాలామందికి బదిలీలో, పదోన్నతులో వచ్చి ఉండేవి కావు.

రెండో కస్టోడియన్‌ ఎక్కడ?

స్వప్నప్రియే బంగారం సంచులు తీసుకుపోయిందని ఫిర్యాదు ఇచ్చిన టీఆర్‌ఎం రాజు మొదట్లో 89 బ్యాగులు పోయాయని చెప్పారు. ఆ తర్వాత 84 అన్నారు. మధ్యలో ఈ బ్యాగులను ఎవరు తెచ్చారో చెప్పలేదు. ఆ సమయంలో స్వప్నప్రియ సెలవులో ఉన్నారు. 2023 నవంబరు 18న స్వప్నప్రియ లీవు పెట్టినప్పుడు కస్టోడియన్‌ తాళాలు అప్పటి బ్రాంచి మేనేజర్‌ మరొకరికి అప్పగించారు. ఆ సమయంలో అన్ని సంచులూ ఉన్నట్టు బ్రాంచి మేనేజర్‌, కొత్త కస్టోడియన్‌ సంతకాలు చేశారు. ఆ తర్వాతే బంగారం సంచులు మాయమయ్యాని ప్రకటించారు. ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతోంది. ఒక లాకర్‌ తెరవాలంటే ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉన్న రెండు తాళం చెవులు వాడాలి. కానీ ఒక్క స్వప్నప్రియే లాకర్‌ తెరిచి బంగారం తీసుకుపోయిందని టీఆర్‌ఎం రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండో వ్యక్తి కోసం ఆయన పేర్కొనలేదు. అప్పటి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో కూడా ప్రస్తావనకు రాలేదు. ఇప్పుడు ఆ రెండో కస్టోడియన్‌పై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం విచారణ చివరి దశలో ఉన్నట్టు తెలిసింది. నరసన్నపేట బజారు బ్రాంచి వ్యవహారంలో బాధ్యులు ముందు అరెస్టవుతారా? గార బ్రాంచి వ్యవహారంలో ముందు లోపలికి వెళ్తారా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page