top of page

ప్రగతి సరే.. మానవీయత ఎక్కడ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 8, 2025
  • 2 min read

మనది ప్రధానంగా సంక్షేమ రాజ్యం. రాజ్యాంగ మూలసూత్రాల్లోనే దీన్ని పొందుపరిచారు. అందు వల్ల అటు జాతీయస్థాయిలోనైనా.. ఇటు రాష్ట్రాలస్థాయిలోనైనా.. అభివృద్ధితోపాటు సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండిరటితో జోడుగుర్రాల మీద స్వారీలా నడిపించాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వాలపై ఉంటుంది. ఏ ఒక్కటి లోపించినా సమతుల్యత దెబ్బతింటుంది. పరిస్థితి గాడి తప్పుతుంది. సంక్షేమంలో మానవీయ కోణం ఉన్నట్లే.. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనుల్లోనూ మానవీయ కోణం ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజలకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఆలోచించి అటువంటి అభివృద్ధి పనులు చేపట్టడమే మానవీయ కోణంగా చెప్పాలి. ప్రజలకు పెద్దగా ఉపయోగపడని అభివృద్ధి అడవిగాచిన వెన్నెలగా మారిపోతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరు గుతోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. గత వైకాపా సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేసి.. అభివృద్ధిని అటకెక్కించిందన్న విమర్శలు ఉన్నాయి. ఆ సర్కారు గద్దె దిగిపోవడానికి ఇది కూడా ఒక కారణమేనని చెప్పాలి. అయితే సంక్షేమం, అభివృద్ధిని సమానంగా సాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు అభివృద్ధి పనుల విషయంలో దూకుడుగా ముందుకెళుతోంది. అందులో మానవీయ కోణాన్ని విస్మరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. విశాఖ, విజయవాడ నగరాల్లో అత్యంత విలువైన స్థలాలను షాపింగ్‌మాల్స్‌ ఏర్పాటుకోసం దుబాయ్‌కి చెందిన లులూ ఇంటర్నేషనల్‌ షాపింగ్‌మాల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించింది. విశాఖలో బీచ్‌రోడ్డు సమీపంలోని హార్బర్‌ పార్క్‌ వద్ద ఉన్న ఏపీఐఐసీకి 13.43 ఎకరాలను 99 ఏళ్లకు, అలాగే విజయవాడలో రద్దీ ప్రాంతంలో ఉన్న ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలను 33ఏళ్లకు కారుచౌక లీజు రేటుకు కేటాయించారు. అంతేకాకుండా ఈ షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభమయ్యే వరకు లేదా మూడేళ్ల వరకు అద్దె చెల్లింపు నుంచి అతి ఉదారం గా మినహాయింపు కూడా ఇచ్చారు. ఈ షాపింగ్‌ మాల్స్‌ ద్వారా చాలామందికి ఉపాధి లభిస్తుందని, ఆధునిక షాపింగ్‌, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా చంద్రబాబు పదే పదే ఉవాచించే సంపద సృష్టి కూడా జరుగుతుందని ప్రభుత్వవర్గాలు చెప్పుకొస్తు న్నాయి. కానీ వాస్తవ దృష్టితో చూస్తే ఇవి జరిగేవి కావన్నది అర్థమవుతుంది. దీనివల్ల యజమానులకు తప్ప ప్రభుత్వం, ప్రజలకు ఉపకరించే సంపద సృష్టి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే లులూ గ్రూప్‌ విదేశానికి చెందిన ప్రైవేట్‌ సంస్థ. ఆస్తులు కూడబెట్టుకోవడం, లాభాలను తమ దేశానికి తర లించుకుపోవడమే దాని ధ్యేయం అని చెప్పక తప్పదు. ఇక షాపింగ్‌ మాల్స్‌ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నది కూడా పాక్షిక నిజమే. సాంకేతికత, ఆటోమేషన్‌ కారణంగా పరిశ్రమలతో పాటు వాణిజ్య సంస్థల్లోనూ మానవ వనరులు వినియోగం క్రమంగా తగ్గిపోతోంది. ఐకియా వంటి భారీ మాల్స్‌ తక్కువ స్టాఫ్‌తోనే అమ్మకాలు చేస్తున్నాయి. బిల్లింగ్‌ కౌంటర్లతో పాటు చాలా విభాగాల్లో యంత్రాలతోనే పనులు జరిపిస్తున్నారు. భారీ మాల్స్‌లో వ్యాపారాలు జరిగినంతగా ఉపాధి దొరకదు. ఉద్యోగాలు, సంపద సృష్టి సంగతి పక్కనపెట్టినా.. భారీమాల్స్‌ వల్ల రిటైల్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బ తింటోంది. గ్రామాలు, చిన్న పట్టణాలు ఎక్కువగా కలిగిన మనదేశంలో వేలు, లక్షల సంఖ్యలో ప్రజ లు వీధి చివర బళ్లు, చిన్న చిన్న షాపులు పెట్టుకుని చిల్లర వ్యాపారం చేస్తూ స్వయం ఉపాధి పొందు తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వీరే ఊతంగా నిలుస్తున్నారు. అలాగే కిరాణ కొట్టు నుంచి, ఫర్ని చర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, రెడీమేడ్‌ వస్త్రాలు, హస్తకళలు.. ఇలా ఎన్నో రంగాలకు చెందిన చిన్న, మధ్య తరగతి వ్యాపారులు ఈ షాపింగ్‌మాల్స్‌ వల్ల నష్టపోతారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు షాపింగ్‌ మాల్స్‌ అనే తిమింగలాలు మొత్తం అన్ని రంగాల వ్యాపారాన్ని తామే మింగేసి చిన్న చేపల కడుపుకొట్టినట్లవుతుంది. ఇప్పటికే రిలయన్స్‌, డిమార్ట్‌ వంటి ఓ మోస్తరు సైజులో ఉండే సూపర్‌ మార్కెట్ల వల్ల వేలాది చిన్న షాపులు మూతపడ్డాయి. అభివృద్ధి గురించి మానవీయ కోణం నుంచి ఆలోచించి సంప్రదాయ చిరు వ్యాపారరంగాన్ని ఆదుకోవాల్సింది పోయి.. వినోదం, షాపింగ్‌ అనుభూతి.. అన్నీ ఒకే చోట అని ఊరిస్తూ.. దానికే అభివృద్ధి పూత పూసి.. ఆ ముసుగులో వందల కోట్ల విలువైన భూములను బడాబాబులకు కారుచౌకగా కట్టబెట్టడం.. వాటికి అద్దె మినహాయింపులు కూడా ఇవ్వడాన్ని అనుత్పాదక పెట్టుబడిగానే పరిగణించాల్సి ఉంటుంది. కాకుల్ని కొట్టి గద్దలకేయడం ఏ రకమైన అభివృద్ధో పాలకులే చెప్పాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page