top of page

31వ ‘సారీ’

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 6 hours ago
  • 2 min read
  • ప్రత్యేకాధికారి పాలన నిరంతరం

  • మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో

  • ఎన్నికలపై పూర్తి ఆశలు వదులుకున్న కేడర్‌

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సెప్టెంబరు 30 నాటికి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాలకవర్గం దిగిపోయి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సత్యం’ ‘ఎవరిది ఈ పాపం’ అనే శీర్షికతో కథనం ప్రచురించినప్పుడు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మెంటాడ పద్మావతి ఒక మాటన్నారు. 2005లో తాము పోటీ చేసినప్పుడు పుట్టినవారికి ఇప్పుడు ఓటుహక్కు వచ్చేసింది గాని, మున్సిపల్‌ ఎన్నికలైతే జరగడంలేదని. జాగ్రత్తగా గమనిస్తే 2005కు, 2025కి మధ్య 20 ఏళ్లు గడిచిపోయింది. కేవలం ఓటుహక్కు వచ్చినవారి కోసమే ఇంత చెప్పుకుంటే.. 2010 నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అన్ని పార్టీల నాయకుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఎందుకుంటుంది? గట్టిగా మాట్లాడితే వారి బాధ మరింత ఎక్కువ ఉంటుంది. ఈ 15 ఏళ్లలో పార్టీకోసమో, తమ నాయకుడి మెప్పు కోసమో లక్షలు తగలెట్టుకొని రోడ్డున పడిపోయిన నాయకులు నగర పరిధిలో చాలామంది మనకు కనిపిస్తారు. ఇంత కోల్పోయినా, వీరందరిలో ఎక్కడో గోరంత ఆశ మాత్రం ఉండేది. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు కాకపోతాయా? కార్పోరేటర్‌ కాలేకపోతామా? అన్న భావన చాలామందిలో కనిపించేది. అందుకే ఈ 15 ఏళ్ల కాలంలో మూడు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ జెండాను మోశారు, ఫ్లెక్సీలు కట్టారు, తమ నాయకుడు పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సొంతింటిలో వేడుకలా డబ్బులు ఖర్చుపెట్టి మరీ చేశారు. వీరందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ప్రభుత్వం సోమవారం రాత్రి జీవో నెం.220ను తీసుకువచ్చింది. దీని సారాంశం కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్‌ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడం, అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10 వరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంటుంది.

ఇంతవరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఇన్నాళ్లూ ఎన్నికలు జరగకపోయినా ఎవరికి వారు సర్దిచెప్పుకుంటూవచ్చారు. కానీ రాబోయేది స్థానిక ఎన్నికల సీజన్‌. ఈలోగా మున్సిపల్‌ ఎన్నికలు జరగడానికి అవరోధంగా ఉన్న అన్ని కేసులనూ తొలగిస్తే గాని ఎన్నికలకు వెళ్లలేరు. ఇవన్నీ ఓ పక్కనుంచి పూర్తవుతాయని, రాష్ట్రంలో మిగిలిన మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సమయంలోనే తమకూ జరుగుతాయని అందరూ భావించారు. కానీ ఆ వైపుగా ప్రయత్నాలు జరగకపోగా మరో ఆరు నెలల వరకు ప్రత్యేకాధికారి పాలనను పొడిగించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ ఉంటారు కాబట్టి.. ఇదే రోడ్ల మీద ప్రయాణిస్తుంటారు కాబట్టి.. అంతో ఇంతో ఏదో ఒక మూల తట్టెడు మన్ను పోస్తున్నారు. కానీ రాజాం, ఆమదాలవలస మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగడానికి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. అక్కడ నిధులు, విధులు లేక కమిషనర్లు కాలం వెల్లదీస్తున్నారు. మరో ఆరు నెలలు కాదు.. మరో ఆరేళ్లయినా శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం ఉత్తిమాట. ఎందుకంటే.. ఇందుకు సంబంధించి హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలపై ఇంతవరకు ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఒకవైపు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ నగరానికి ఎన్నికలు జరిపించాలని అమరావతి వెళ్లిన ప్రతీసారి కోరుతున్నారు. మరోవైపు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ కార్పొరేషన్‌లో కలిపిన తోటపాలెం, కుశాలపురం పంచాయతీలను విడదీయాలని అమరావతి వెళ్లిన ప్రతీసారి మున్సిపల్‌ మంత్రి నారాయణను కలుస్తున్నారు. ఆయన మాత్రం అమరావతి నిర్మాణాల్లో బిజీగా ఉండి ఇటువైపు కన్నెత్తి చూడటంలేదు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఎంత అవసరమో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం అంతే అవసరం. పంచాయతీల విలీనం మీద కొందరు, వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం మీద మరికొందరు, విలీనం నుంచి బయటకు వస్తామని కొందరు, కార్పొరేషన్‌లోనే కలిసుంటామని మరికొన్ని పంచాయతీలు.. ఇలా ఎంతమంది హైకోర్టులో వ్యాజ్యాలు వేశారో ప్రభుత్వం వద్ద వివరాలు లేవు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు ఇటువంటి వాటిపై అవగాహన లేదు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కొత్త పూజార్లు. ఈ విషయం చంద్రబాబు దృష్టిలో చిన్నది, మంత్రి నారాయణ దృష్టికి పెద్దది కావడం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదు. ఈ 15 ఏళ్లలో ఆరేసి నెలలు ఎక్స్‌టెన్షన్‌ చొప్పున ప్రభుత్వం ఎన్ని జవోలు విడుదల చేసిందో లెక్కపెట్టుకోవచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page