ప్రధానినే మార్గం మళ్లించిన అరెస్టు భయం!
- DV RAMANA

- Sep 27, 2025
- 3 min read
ఇజ్రాయెల్ నుంచి చుట్టూ తిరిగి అమెరికా చేరుకున్న నెతన్యాహు
యుద్ధనేరాలకు పాల్పడ్డారంటూ ఆయనపై అంతర్జాతీయ కోర్టు వారెంట్
ఆ నిబంధనలకు కట్టుబడిన దేశాల్లో అడుగుపెడితే అమలు ఖాయం
అందుకే దూరాభారమైనా కొత్త రూటులో ప్రయాణం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
దొరికినచోటల్లా అప్పులు చేసేసినవారు వాటిని తీర్చలేక.. అప్పులోళ్లు ఎదురుపడితే సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరగడం సహజం. ఆ క్రమంలో వారు అప్పులోళ్లు ఉండే ప్రాంతాలకు వెళ్లడాన్నే మానుకుంటారు. ఒకవేళ వాటికి అవతల ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. నేరుగా వెళ్లే మార్గంలో కాకుండా చుట్టూ తిరిగి వెళుతుంటారు. గొడవలు పడినవారు, దొంగతనం ఆరోపణలు ఉన్నవారు కూడా ఇలాగే చుట్టూతిరిగి దొంగచాటుగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇది సహజమే. కానీ సాక్షాత్తు ఒక దేశ ప్రధానమంత్రే రెగ్యులర్ రూట్‌లో కాకుండా ముక్కు ఎక్కడుందంటే తలచుట్టూ తిప్పి చూపించినట్లు చుట్టూతిరిగి వేరే మార్గంలో అది కూడా ఏకంగా 600 కిలోమీటర్ల అదనపు దూరాన్ని భరించి గమ్యస్థానం చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నాయకుడు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇంతకూ ఆయన ఎవరు?? అంటే.. ఆ నేత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు. అమెరికాకు వెళ్లేందుకు ఆయన రెగ్యులర్ రూటు కాకుండా చుట్టూతిరిగి ఆ దేశానికి చేరుకున్నారు. ఇలా ఎందుకు చేశారు? ఆయన భద్రతకు ఏమైనా ప్రమాదముందా?? అని ఆరా తీస్తే.. అవేవీ కాదని తేలింది. కేవలం అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఎప్పుడూ వెళ్లే మార్గం కాకుండా కొత్త రూటు ఎంచుకున్నారని తేటతెల్లమైంది. అదేంటి? ఒక దేశ ప్రధానిని అరెస్టు చేయడం ఏమిటి? ఆయన చేసిన నేరం ఏమిటంటే.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం, యుద్ధనేరాలకు పాల్పడటమేనట!
మిస్టర్ సెక్యూరిటీపై అరెస్టు వారెంట్
పాలస్తీనా`ఇజ్రాయెల్ ఘర్షణలు కొత్త కాదు. రెండేళ్లకుపై పైగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే 70 వేల మందికి పైగా పాలస్తీనియన్లను బలి తీసుకున్న ఈ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ క్రమంలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిరదని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు దాఖలైంది. విచారణ తర్వాత న్యాయస్థానం కూడా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలు చేసిందని నిర్థారిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేరానికి బాధ్యులని పేర్కొంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌లను అరెస్ట్ చేయాలని గత ఏడాది నవంబర్‌లోనే ఆదేశించింది. అయితే స్వదేశంలోని కోర్టుల తీర్పులు ఇచ్చిన వెంటనే అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ కోర్టులు తీర్పుల ప్రకారం తక్షణమే అరెస్టులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ కోర్టు నిబంధనలను అంగీకరించని దేశాల్లో దాని తీర్పులు, ఆదేశాలు చెల్లుబాటు కావు. ఇజ్రాయెల్ కూడా ఆ దేశాల జాబితాలో ఉంది. అందువల్ల ఆయన్ను అరెస్టు చేయాలంటూ అంతర్జాతీయ కోర్టు ఎప్పుడో 11 నెలల క్రితమే ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కాలేదు. అంతర్జాతీయ కోర్టు చట్టాలను అంగీకరించిన దేశాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే నెతన్యాహును అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ నుంచి అమెరికాకు వెళ్లే రెగ్యులర్ రూట్‌లో ఉన్న దేశాల్లో కొన్ని అంతర్జాతీయ కోర్టు నిబంధనల పరిధిలో ఉండటం వల్లే తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే మిస్టర్ సెక్యూరిటీగా తనను పిలిపించుకునే నెతన్యాహు వేరే మార్గంలో వెళ్లారని తెలిసింది.
భయపెట్టిన న్యాయస్థానం ఆదేశాలు
సాధారణ మార్గంలో వెళ్తే సైప్రస్, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ల మీదుగా వెళ్లాలి. ఇజ్రాయెల్, అమెరికా మధ్య విమాన మార్గ దూరం 9,165 కి.మీ. నెతన్యాహు ఉపయోగించే బోయింగ్ 767-300ఈఆర్ రకం విమానం ఈ దూరాన్ని 12.45 గంటల్లో చేరుకుంటుంది. కానీ ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాకు బయల్దేరిన నెతన్యాహు విమానం గమ్యస్థానం చేరడానికి 15 గంటలు పట్టింది. దీనికి కారణం ఆయన ప్రయాణిస్తున్న విమానం సాధారణ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడమే. మధ్యప్రాచ్యంలో ఉన్న ఇజ్రాయెల్ నుంచి అమెరికాకు వెళ్లే అన్ని విమానాలు ‘గ్రేట్-సర్కిల్’ అనే మార్గాన్ని ఉపయోగిస్తాయి. ఇజ్రాయెల్ నుంచి బయలుదేరి సైప్రస్, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, అట్లాంటిక్ మహాసముద్రం, కెనడా మీదుగా అమెరికాకు చేరుకుంటాయి. కానీ నెతన్యాహు విమానం గ్రీస్, ఇటలీలను దాటిన తర్వాత అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని జిబ్రాల్టర్ జలసంధి మీదుగా అట్లాంటిక్ మహాసముద్రం వైపు వెళ్లి అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకుంది. దీనివల్ల 600 కిలోమీటర్ల దూరం, సుమారు రెండుగంటల అదనపు ప్రయాణం తప్పలేదు. ఈ విషయం తెలుసుకుని ‘ఏమిటిది? తీవ్రవాదులను అంతం చేయడానికి వచ్చిన ‘మిస్టర్ సెక్యూరిటీ’కి ఈ పరీక్ష ఏమిటి?’ అని ఆయన మద్దతుదారులు గందరగోళంలో పడ్డారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అకస్మాత్తుగా విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపాలు తలెత్తినా, వాతావరణం అనుకూలించకపోయినా అత్యవసరంగా ఏదో ఒక దేశంలో ల్యాండ్ కావాల్సి ఉంటుంది. కానీ మార్గమధ్యంలో ఉన్న దేశాలన్నీ అంతర్జాతీయ న్యాయస్థానం నిబంధనలను అంగీకరించినవే. అందువల్ల ఆ దేశాల్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేయడం ఖాయం. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఆ దేశంలో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదముంది.
యూరప్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు
ఎందుకంటే ఇటలీలో పాలస్తీనాకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు 24 గంటల నిరంతర ఆందోళనతో దేశాన్ని స్తంభింపజేశారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో నెతన్యాహు ల్యాండ్ అయినా అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానం విచారణకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపాయి. అందువల్ల ఈ దేశాల్లో దిగినా అరెస్ట్ ఖాయం. ఈ కారణాల వల్లే ప్రధాని హోదాలో ఉన్న నెతన్యాహు 600 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లారు. ఈ విషయం తెలిసి ‘మిస్టర్ సెక్యూరిటీకి భద్రత లేనట్లుంది’ అని సోషల్ మీడియాలో పలువురు ఎగతాళి చేస్తున్నారు.










Comments