ప్రభుత్వ ‘చేపే’.. భరోసా బొక్కేసింది!
- Prasad Satyam
- 10 hours ago
- 3 min read
నియోజకవర్గంలో వందలాది అర్హుల పేర్లు గల్లంతు
వారి స్థానంలో ఇతరుల పేర్లు చేర్చి భృతి స్వాహా
టీడీపీ నేతల దన్నుతో వైకాపా నేతలు, అధికారుల దందా
మత్స్యశాఖ డీడీ ముసలయ్య ఆధ్వర్యంలోనే అక్రమాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ కథనంలో ఎడమవైపు కనిపిస్తున్నవారంతా శ్రీకాకుళం నియోజకవర్గంలోని ఒక పంచాయతీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు.. ముఖ్యంగా బోటు యజమానులు. తమ బోటులో కొందరికి మత్స్యకార భరోసా అందినా.. తాము మాత్రం అధికారుల నిర్వాకంతో అనర్హులన్న ముద్ర పడిన బాధితులు. భరోసా పథకానికి అన్ని విధాలా అర్హులైనప్పటికీ రూ.20వేల భరోసా అందుకోలేకపోయిన ఎంతోమంది అభాగ్యుల్లో వీరు కొందరు మాత్రమే.
ఇక కుడివైపు కనిపిస్తున్న వ్యక్తి ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి ముసలినాయుడు. చాలామంది అర్హులను అనర్హత సముద్రంలో ముంచేసి బాధితులుగా మార్చేసిన అధికారి ఇతనే. విచిత్రమేమిటంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైకాపా నాయకులు, ఫిషరీస్ అధికారులు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను ప్రసన్నం చేసుకొని మత్స్యకార భరోసాలో తిమ్మిని బమ్మిని చేసి లక్షలాది రూపాయలు తినేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం మండలానికి సంబంధించి ఈ బాగోతంలో కీలక సూత్రధారి ఎఫ్‌డీవో ముసలినాయుడే. ఇది పత్రికలో, సోషల్ మీడియానో, ప్రతిపక్షాలో చెబుతున్న మాట కాదు. టీడీపీ సర్పంచ్‌గా పని చేసి, స్వయంగా వేటకు వెళ్లే ఒక నాయకుడు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్న ప్రధానాంశమిదే. అంతేకాకుండా స్వయంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో వందలాది మంది అర్హులకు మత్స్యకార భరోసా అందకపోవడంపై విచారణ జరపాలని తనకు అందిన ఫిర్యాదుపై నేరుగా ఫిషరీస్ డీడీకి ఎండార్స్‌మెంట్ కూడా ఇచ్చారు.
జాబితాల్లో మతలబులు
మత్స్యకార భరోసా ద్వారా ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.20వేలు అందిస్తుంది. అంటే లబ్ధిదారుల జాబితాల్లో ఎంతమంది అనర్హులు చేరితే అన్ని 20 వేల రూపాయలు నొక్కేసి అందరూ కలిసి పంచుకోవచ్చు. ఇక్కడ జరిగింది కూడా అదే. పెద్దగనగళ్లపేట పంచాయతీ పరిధిలోని పుక్కళ్లపేట, చినగనగళ్లపేట, పెద్దగనగళ్లపేట, జాలారిపేట, గాంధీనగర్ కాలనీ, నర్సయ్యపేట గ్రామాల్లో అధిక శాతం మందికి సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టడమే వృత్తిగా జీవిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల జాబితాల్లోనే ఎఫ్‌డీవో ముసలయ్య మతలబులు చేసి బినామీలను చేర్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోటార్ బోటులో వేటకు వెళ్లే వారిలో ఆరుగురికి మత్స్యకార భరోసా లభిస్తుంది. ఒకవేళ బోటు యజమాని ప్రభుత్వం నుంచి పింఛను అందుకుంటే మాత్రం ఆయనకు మత్స్యకార భరోసా ఇవ్వరు. మిగిలిన ఐదుగురికీ వర్తిస్తుంది. మోటారు బోటు కాకపోతే మాత్రం ఒక బోటుకు ముగ్గురికి మత్స్యకార భరోసా ఇస్తారు. ఇక్కడే ఫిషరీస్ అధికారులు తమ చేతివాటాన్ని, తెలివితేటల్ని చూపిస్తున్నారు. నాన్ మోటార్‌బోట్‌ను మోటార్‌బోటుగా చూపించి ఆరుగురికి మత్స్యకార భరోసా అందేటట్టు చూస్తున్నారు. ఇందులో ముగ్గురు అర్హులు, మరో ముగ్గురు వీరు చొప్పించిన బినామీలు ఉంటారు. ఒక్క పెద్దగనగళ్లపేట పంచాయతీ పరిధిలోనే 134 మంది అర్హుల పేర్లు తొలగించి వారి స్థానంలో వేరేవారిని చేర్చి మత్స్యకార భరోసాగా ఇచ్చే రూ.20 వేలు సొమ్మును ఫిఫ్టీ ఫిఫ్టీ కింద సర్దుకున్నారని తెలిసింది. దీని మీదే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అచ్చెన్నాయుడుకు ఒక లేఖ రాశారు. అదే సమయంలో ఫిషరీస్ కమిషనర్‌కు కూడా ఆధారాలతో సహా ఒక లేఖ పంపారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఫలితం నిల్
ఈ దందా ఒక్క పెద్దగనగళ్లవానిపేట పంచాయతీకే పరిమితం కాలేదు. గార మండలం బందరువానిపేటలో కూడా అనేకమంది అర్హుల పేర్లు తొలగించి, వమరవల్లితో పాటు గార మండల పరిధిలోని కొందరు టీడీపీ నాయకులతో కుమ్మక్కై ఆ ప్రాంతానికి చెందిన వేరే సామాజికవర్గీయుల పేర్లు చేర్చేసి మత్స్యకార భరోసా సొమ్ము ఆరగించేశారు. నియోజకవర్గంలో బందరువానిపేటే పెద్ద తీరప్రాంతం. అక్కడ 1344 మంది మత్స్యకారులు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారిలో 82 మందిని జాబితా నుంచి తొలగించారని సాగర మత్స్యకార సహకార సంఘం తరఫున అధ్యక్షుడు పుక్కళ్ల సూర్యనారాయణ ఎమ్మెల్యే గొండు శంకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొదటి విడత మత్స్యకార భరోసా సందర్భంగా నాన్ మోటార్‌బోట్‌ను మోటార్‌బోటుగా చూపించి ముగ్గురికి అదనంగా ఇప్పించడానికి ప్రయత్నించినప్ప్పుడు అడ్డుకోవడంతో జాబితాను మార్చారని, అయితే రెండో విడత వచ్చేసరికి యథావిధిగా అనర్హుల పేర్లన్నీ చేర్చి తమకు అన్యాయం చేశారని ఎమ్మెల్యేకు వారు ఫిర్యాదు చేశారు. మోటార్ బోటు కానివాటికి మోటార్ బోటుగా ఎలా గుర్తించారో నిర్ధారించారంటూ ఎమ్మెల్యే మత్స్యశాఖ డీడీకి ఒక ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. కానీ దాని మీద అధికారులు ఇంతవరకు స్పందించలేదు. వందలాది మత్స్యకారులకు భరోసా అందకపోవడం వెనుక ఏం జరిగిందని మత్స్యశాఖ అధికారులను అడిగితే సిక్స్ స్టెప్ సర్వేలో హౌస్ హÃల్డ్ మ్యాపింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్ప్పుకొస్తున్నారు. కానీ మిగిలిన సామాజికవర్గాల వారు, ఆ ప్రాంతానికి చెందనివారు, అసలు మత్స్యకారులే కానివారు ఈ జాబితాలో ఎలా చేరారని అడిగితే మాత్రం సమాధానం లేదు. ఒకచోట 134 మందిని, మరోచోట 82 మందిని తొలగించి, వారి స్థానంలో వేరేవారిని చేర్చారంటే బందరువానిపేట, గనగళ్లవానిపేట ప్రాంతాల్లోనే సుమారు రూ.43.20 లక్షలు మింగేసినట్టు భావిస్తున్నారు. ఇదంతా ఒక్క రోజులో జరిగిన వ్యవహారం కాదు. మత్స్యకార భరోసా ఇస్తున్న ప్రతిసారీ జరుగుతున్న తతంగమే. వైకాపా హయాంలో ఎలా సొమ్ములు కొల్లగొట్టారో.. ఇప్పుడూ అదే పద్ధతిలో అందరూ కలిసి దోచేశారు. కాకపోతే అప్ప్పుడు భరోసా సొమ్ము రూ.10వేలు ఉంటే, ఇప్ప్పుడు అది రూ.20వేలకు పెరగడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఫిషరీస్ అధికారులు వారే కాబట్టి టీడీపీ నాయకులు చిన్న, రమేష్‌లతో పాటు ఎఫ్‌డీవో ముసలినాయుడు పథకం రచించి అర్హులను తప్పించారని ఆరోపణలు ఉన్నాయి.






Comments