top of page

రసకందాయంలో ‘రాజకీయ క్రికెట్ లీగ్’!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 9 hours ago
  • 2 min read
  • జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై ఏసీఏ కినుక

  • పాత కమిటీ ఉండగానే బాధ్యతలు స్వీకరణ

  • అవకతవకలపై శ్రీవర్థన్, ఎన్నికపై శాస్త్రి ఫిర్యాదు

  • విచారణకు త్రిసభ్య జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా క్రికెట్ సంఘంపై ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు, నిధుల వినియోగంతో పాటు ఇటీవల నిర్వహించిన ఎన్నిక తతంగంపై విచారణకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఓ కమిటీని నియమించింది. జస్టిస్ డాక్టర్ వీఆర్‌కే కృపాసాగర్ (రిటైర్డ్ జడ్జి, ఏపీ హైకోర్టు) చైర్మన్‌గా, రిటైర్డ్ జిల్లా జడ్జి వినయ్‌కుమార్ బొనిగె, హైకోర్టు అడ్వకేట్ ఎన్.అశ్విన్‌కుమార్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులకు చేరినా వారు ఇంతవరకు బయటపెట్టలేదు. జిల్లా క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహానాడు కార్యక్రమంలో ఉన్నందున ఆయనతో చర్చించిన తర్వాత ఈ విషయం బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరిణామంపై రాజకీయంగా చర్చ సాగుతున్నది. ఎమ్మెల్యే కూన రవికుమార్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఏసీఏ జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించడం వెనుక పెద్ద కథే ఉంది. కొద్ది రోజుల క్రితమే ‘జిల్లాలో పొలిటికల్ క్రికెట్ లీగ్’ పేరుతో ‘సత్యం’ కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ఇప్ప్పుడు అదే కోణంలో ఈ కథ టర్న్ తీసుకోవడం కొసమెరుపు.

సమాచారం లేకుండానే..

జిల్లా క్రికెట్ సంఘంపై మాజీ క్రికెటర్ బి.శ్రీవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కమిషన్ ఏర్పాటైంది. జిల్లా క్రికెట్ సంఘం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న అవినీతి, ఇతర అభియోగాలపై సమగ్రంగా విచారణ చేయాలని కమిషన్‌ను కోరింది. దీంతో పాటు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుల్లెల శాస్త్రి ప్రమేయం లేకుండా ఇటీవల జిల్లా సంఘానికి నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ప్రకటించడంపై ఏసీఏకు ఫిర్యాదు చేశారు. జూన్ 3 వరకు సంఘానికి కాలపరిమితి ఉన్నప్పటికీ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎన్నికలు జరిపి నూతన కమిటీని ప్రకటించడం సంఘం బైలా ప్రకారం చెల్లదని ఏసీఏకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికకు ముందు సన్నాహాక సమావేశాన్ని కూడా నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని శాస్త్రి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సంఘమైన ఏసీసీకు సైతం సమాచారం ఇవ్వకుండా జిల్లా సంఘానికి హడావుడిగా ఎన్నికలు నిర్వహించి కార్యవర్గాన్ని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాల పరిమితి ప్రకారం జూన్ 3 వరకు తానే సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతానని స్పష్టం చేసిన శాస్త్రి.. ఆ తర్వాత కొత్త కమిటీని ఎన్నుకుని ఉంటే తాను అభ్యంతరం చెప్పేవాడిని కాదన్నారు. అలాగే తనకు చెప్పకుండానే సంఘం గౌరవాధ్యక్షుడిగా తన పేరు ప్రకటించడాన్ని శాస్త్రి ఆక్షేపించారు. సంఘం బైలాలో గౌరవాధ్యక్షుడు అన్న పోస్టే లేదని పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికలు నిర్వహించాలంటే ముందు ఏసీఏ అనుమతి తీసుకుని, నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ల తేదీలు ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారిని నియమించి, ఏసీఏ నుంచి ఒక పరిశీలకుడిని పంపించి, వారి సమక్షంలోనే ఎన్నిక నిర్వహించాలి. అయితే ఇలాంటివేవీ లేకుండానే ఇటీవల జిల్లా క్రికెట్ సంఘానికి ఎన్నిక తంతు నిర్వహించేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నూతన కమిటీకి ఏసీఏ గుర్తింపు ఇవ్వలేదని తెలిసింది. ఆ మేరకు పాత కమిటీ సమక్షంలోనే జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరగనుందని తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లా క్రికెట్ సంఘం బైలాస్ ప్రకారం ఎన్నికల అధికారిగా సాగర్‌ను నియమించామని, ఆయన పర్యవేక్షణలోనే ఎన్నికలు జరిపామని కొత్త కార్యవర్గం చెబుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page