ప్రభుత్వమా.. పారా హుషార్!
- NVS PRASAD

- Jul 21
- 4 min read


ఏడాది కాలంలోనే ప్రజల్లో తరిగిన పరపతి
సగానికిపైగా కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదా అసంతృప్తి
డేంజర్ జోన్‌లో 13 మంది మంత్రులు
సూపర్ సిక్స్ హామీల అమల్లో ఫెయిల్
పవన్‌కల్యాణ్ తీరుపై జనసైనికుల నిస్పృహ
హైదరాబాద్ ఐఐటియన్స్ గ్రూప్ సర్వేలో వెల్లడి

రాష్ట్రంలో ఏడాది క్రితం కొలువుదీరిన ఎన్డీయే కూటమి సర్కార్ అప్పుడే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూ విజయవంతంగా పనిచేస్తోందన్న భావనను కూటమి పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ఏడాది పాలనలో చేసిన పనులు, హామీలు అమలు చేసిన తీరును ప్రజలకు వివరిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన తీరుపై ప్రజల మనోగతం తెలుసుకునేందుకు అనేక సర్వేలు జరుగుతున్నాయి. కూటమి పాలనపై క్రమంగా వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. మిగతా సర్వేల సంగతెలా ఉన్నా ప్రముఖ సెఫాలజిస్టుల నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన ఐఐటీయన్ల గ్రూప్ ప్రకటించిన సర్వే అంచనాలు ఒక విధంగా డేంజర్ అలారమ్స్ మోగించినట్లే చెప్పాలి.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో దాని పనితీరు, ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహారశైలిపై ఐఐటీయన్ల గ్రూప్ పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు కూటమి సర్కారుకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు రెండు దశల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 294 నియోజకవర్గాలకు గాను 172 నియోజకవర్గాల నుంచి ఒక్కో దాంట్లో 425 చొప్పున మొత్తం 72,900 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అన్నివర్గాల ప్రజల నుంచి సూపర్ సిక్స్ హామీలతో సహా మొత్తం 65 అంశాలతో ప్రశ్నావళి ఇచ్చి సమాధానాలు రాబట్టారు. వాటన్నింటినీ సమగ్రంగా విశ్లేషించి ఫలితాలను అంచనా వేశారు. దాని ప్రకారం.. మొత్తం 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో ఏకంగా 72 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటుంటే.. మరో 26 మందిపై అసంతృప్తి ఉన్నట్లు ఈ సర్వే వెల్లడిరచింది. కేబినెట్‌లో సీఎం చంద్రబాబు సహా 25 మంది ఉంటే పదిమంది మంత్రులు వ్యతిరేకత, ముగ్గురు మంత్రులు అసంతృప్తి ఎదుర్కొంటున్నట్లు ఐఐటీయన్ల గ్రూప్ అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాలవారీగా అంచనాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు(టీడీపీ`2, జనసేన`1, బీజేపీ`1) వ్యతిరేకత ఎదుర్కొంటుండగా, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. విజయనగరం జిల్లాలో నలుగురు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యేపై వ్యతిరేకత, ఒక టీడీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి కనిపించింది. విశాఖ జిల్లాలో ఒక టీడీపీ, ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండగా, ఇద్దరు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేనలకు చెందిన నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు వ్యతిరేకత, ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యే అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో చెరో ముగ్గురు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్యెల్యేలు వ్యతిరేకత, మరో ఇద్దరు అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో ఒక జనసేన, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. ప్రకాశం జిల్లాలో టీడీపీకి చెందిన నలుగురిపై వ్యతిరేకత, ఇద్దరిపై అసంతప్తి ఉన్నట్లు తేలింది. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన నలుగురిపై వ్యతిరేకత, ఇద్దరిపై అసంతృప్తి కనిపించింది. కడప జిల్లాలో ముగ్గురు టీడీపీతోపాటు చెరో జనసేన, బీజేపీలపై వ్యతిరేకత ఉండగా, ఒక టీడీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉంది. కర్నూలు జిల్లా ఐదుగురు టీడీపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లు తేలింది. అనంతపురం జిల్లాలో ఆరుగురు టీడీపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ఒక టీడీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉంది. చిత్తూరు జిల్లాలో ఐదుగురు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యేపై వ్యతిరేకత, మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లు అంచనా వేశారు.
సగానికిపైగా డేంజర్ జోన్‌లోనే..
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 135 మంది టీడీపీ, 21 మంది జనసేన, ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన 54 మంది రెడ్ జోన్‌లో ఉండగా, 22 మంది ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు. జనసేన నుంచి ఏకంగా 14 మంది రెడ్‌జోన్‌లో ఉంటే.. ముగ్గురు ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు. బీజేపీ నుంచి నలుగురు రెడ్‌జోన్‌లో, ఒకరు ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు. మొత్తం మీద చూస్తే 72 మంది రెడ్‌జోన్‌లో, 26 మంది ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు. కేవలం 66 మంది కూటమి ఎమ్మెల్యేలపైనే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రితో సహా మొత్తం 25 మంది మంత్రులు ఉండగా.. తొమ్మిదిమంది టీడీపీ, ఏకైక బీజేపీ మంత్రి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇద్దరు టీడీపీ, ఒక జనసేన మంత్రిపై అసంతృప్తి ఉంది. మొత్తం మీద 13 మంది మంత్రులు ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నారని ఈ సర్వే తేల్చింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, పార్థసారధి, గుమ్మడి సంధ్యారాణి, టి.జి.భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ రెడ్ జోన్‌లో ఉండగా.. హోంమంత్రి వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, ఎస్.సవిత అసంతృప్తిని ఎదుర్కొంటూ ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు.
హామీల అమల్లో ఫెయిల్
సాధారణంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు అదనంగా గ్యారెంటీ పథకాలు అంటూ ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. ప్రజలు ప్రధానంగా వీటికే ఆకర్షితులై కూటమి వైపు మొగ్గుచూపి గెలిపించారు. కానీ ఏడాది గడిచినా సూపర్ సిక్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న అసంతృప్తి ప్రజల్లో బాగా కనిపించింది.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఊ.3వేల నెలవారీ భృతి హామీ అమలు కాలేదంటూ 56 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం పది శాతం మందే సంతృప్తి చెందారు.
తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇచ్చే పథకంపై 43 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా 40 శాతం మంది అసంతృప్తితో కనిపించారు.
19-59 ఏళ్ల మధ్య మహిళలకు నెలక రూ.1500 ఇస్తామన్న ష్యూరిటీ పథకం అమలు చేయనుందుక 49 శాతం మంది అసంతప్తితో ఉన్నారు. 20 శాతం మంది మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు.
రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయంపై ఏకంగా 57 శాతం మంది అసంతృప్తితో ఉండగా 21 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తామన్న హామీపై 47 శాతం మంది అసంతృప్తి చెందగా 40 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై 52 శాతం మంది అసంతప్తి వ్యక్తం చేయగా 18 శాతం మంది సంతృప్తితో ఉన్నట్లు తేలింది.
మొత్తం మీద సూపర్ సిక్స్ హామీల్లో ఒక్క తల్లికి వందనం పథకం తప్ప మిగతా గ్యారెంటీ హామీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది.
వ్యతిరేకత పెంచుతున్న ఇతర అంశాలు
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అసంతృప్తి పెరగడానికి అనేక ఇతర అంశాలు కూడా దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా మద్యం, ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల దందాలు ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తున్నాయి. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సిండికేట్లుగా ఏర్పడి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, చీప్ లిక్కర్ అమ్మకాలకు పాల్పడటం విమర్శలపాలవుతోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నా లోకల్ నాయకులు పలు రూపాల్లో వసూళ్లకు పాల్పడుతూ ఆ విధానం ప్రజలకు అందకుండా చేస్తున్నారన్న విమర్శలు అధికంగా ఉన్నాయి. మైనింగ్ వ్యవహారాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు, అధికార కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా అధికారం పంచుకుంటున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సొంత పార్టీ క్యాడరే అసంతృప్తితో ఉంది. మరికొన్ని దశాబ్దాలపాటు చంద్రబాబే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని పలు సందర్భాల్లో పవన్‌కల్యాణ్ చెప్పడం జనసైనికులకు మింగుడు పడటంలేదు. ఎప్పుడూ చంద్రబాబు, తెలుగుదేశమే అధికారంలో ఉంటే.. ఇక జనసేన ఎప్పుడు పూర్తిస్థాయిలో అధికారం చేపడుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికీ తెలుగుదేశం వెనుక ఉంటే దానికి ఊడిగం చేయడమేనా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ భావన క్షేత్రస్థాయిలో పాకిపోతే కూటమి మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐఐటీయన్ల గ్రూప్ సర్వే హెచ్చరించింది.










Comments