top of page

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

  • Writer: DUPPALA RAVIKUMAR
    DUPPALA RAVIKUMAR
  • Oct 17, 2024
  • 3 min read

భారతదేశ ఎన్నికల కమిషన్‌ రోజురోజుకూ నిస్సిగ్గుతో ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇవిఎంలకు పెట్టిన ఛార్జింగ్‌ పోలింగ్‌ తర్వాత కొన్నిచోట్ల వంద శాతంగా కనిపించడంతో అందరిలోనూ అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. పోలింగ్‌ ముగిసేనాటికి ప్రకటించిన ఓటు శాతం తెల్లవారేసరికి సవరించి ప్రకటించిన ఓటు శాతం ప్రజాస్వామికవాదులను బెంబేలెత్తిస్తోంది. సగటు ఓటరుకు ఉన్న అనుమానాలను తీర్చవలసిన ఎన్నికల కమిషన్‌ మరిన్ని అనుమానాలకు తావిచ్చేటట్టు ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని దుప్పల రవికుమార్‌ అంటున్నారు.

నెల రోజుల కిందట జరగవలసిన మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను చాలా ముందుచూపుతో ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. ఈ దేశంలో పండగలకు కరువన్నట్టు, పండగ వల్లనే ఎన్నికలను వాయిదా వేసినట్టు ప్రకటించడం సిగ్గుచేటు. అసలు కిందటి నెలలో హర్యానాలో, జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరిపించిన తీరుతోనే అనేక అనుమానాలు అందరిలోనూ కలిగిన మాట వాస్తవం. ఎన్నికల పొత్తులు పరిశీలించినా, వరుసగా రెండుసార్లు పాలించిన భారతీయ జనతా పార్టీపైన యాంటీ ఇన్‌కంబెన్సీని దృష్టిలో పెట్టుకున్నా, ఎగ్జిట్‌ పోల్స్‌ సరళిని పరిశీలించినా కాంగ్రెస్‌ గెలుపు, బీజేపీ ఓటమి తథ్యమని ఈ దేశంలోని ప్రతి సెఫాలజిస్టు నమ్మాడు. పైగా వివిధ పత్రికలలో, టివి చానెళ్లలో ఇదే అభిప్రాయం కనిపించింది. ఆఖరికి మోడీ అనుకూల మీడియా సైతం బీజేపీ గెలుపు పట్ల సందేహాలు వ్యక్తపరిచింది. ఫలితాలు వెలువడిన తర్వాత అర్ణబ్‌ గోస్వామి సైతం బీజేపీ ఆకస్మిక విజయం పట్ల తన విస్మయాన్ని దాచుకోలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల పట్ల ఇదే తరహా అనుమానాలు పలు పార్టీలు వ్యక్తపరిచినప్పటికీ, దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా ప్రతిస్పందించ లేదు. హర్యానాలో వెలువడిన ఫలితాలతో కాంగ్రెస్‌ పార్టీ ఖంగుతిన్నది. వెంటనే ఎన్నికలు ఇవిఎంల ద్వారా జరిగిన తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ తమ గళం వినిపించారు.

సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశం

ఇలా రేగిన దుమ్ము ఇంకా సద్దుమణగక ముందే మంగళవారం దేశ రాజధానిలో భారత ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలతో ఈ అగ్నికి మరింత అజ్యం పోసారు. మహారాష్ట్రలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, జార్ఖండ్‌లో రెండు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 20న ఒకే దశలో జరుగుతాయని, 82 స్థానాలున్న జార్ఘండ్‌ శాసనసభ ఎన్నికలు మాత్రం రెండు దశలలో (మొదటి దశ నవంబర్‌ 13వ తేదీన, రెండవ దశ ఎన్నికలు నవంబర్‌ 20వ తేదీన) జరుగుతాయని, రెండిరటి ఫలితాలు మాత్రం నవంబర్‌ 23న వెలువరిస్తామని ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌లో పలు దశల ఎన్నికలు జరపడానికి ఆయన చెప్పిన కారణాలు విని సరేననుకున్న సగటు ఓటరు మాత్రం ఈసారి చెప్పిన కుంటిసాకులు విని పెదవి చప్పరించాడు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో ఓటరు టర్నవుట్‌ చాలా తక్కువస్థాయిలో ఉందని, పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు ఆయన అనడం ఆశ్చర్యం కలిగించింది. మహారాష్ట్రలో కళ్యాణ్‌, పూణె, థానె, ఉత్తర ముంబయి, దక్షిణ మధ్య ముంబయి, దక్షిణ ముంబయి శాసనసభ నియోజక వర్గాలలో భారీగా పడిపోతున్న ఓటింగ్‌ను పెంచడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఈ నియోజక వర్గాలలో గ్రామీణ ఓటర్లు ముందుకొచ్చినంత స్థాయిలో పట్టణ ఓటర్లు ముందుకు రావడం లేదని ఆయన వాపోయారు.

మహారాష్ట్రలో కట్కారి, కోలం, మారియా గోండులైన మూడు గిరిజన తెగలకు చెందిన సుమారు 2.77 లక్షల ఓటర్లు ముందుకు వచ్చి ఓటు వేసేవిధంగా, జార్ఖండ్‌కు చెందిన ఆసుర్‌, బిర్హోర్‌, మల్ఫాదియా, పహాదియా, సౌర్య పహాదియా, బిరాజియా, కోర్వా, సర్వాలైన ఏడు గిరిజన తెగలకు చెందిన సుమారు 1.78 లక్షల ఓటర్లను ఓటింగుకు సన్నద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతోపాటు జిల్లా ఎన్నికల అధికారులను పనిలో పనిగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో మాదిరిగా ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాలను సమర్ధంగా అరికట్టాలని తెలిపారు. ఇవన్నీ వందల సందేహాలకు తావిచ్చే విధంగా ఉండడం విషాదం. ఎన్నికల కమిషన్‌ వ్యవహార సరళిపై ఇప్పటికే రాజకీయ పార్టీలతో పాటు చాలా సంస్థలు, వ్యక్తులు విడివిడిగా కేసులు దాఖలు చేసాయి. కోర్టుల గడపలకు ఎక్కుతున్నాయి. వీటిని అసలు కేసులుగానే ఎన్నికల కమిషన్‌ పరిగణించడం లేదు. ఇప్పటిదాకా తమకు కేవలం 20 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని, వాటిని ఆమూలాగ్రం పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఫిర్యాదులను పట్టించుకోని కమిషన్‌

ఇవిఎంల విశ్వసనీయత గురించి పాత్రికేయులు ప్రశ్నించినపుడు అవి చాలా సురక్షితమని, అద్భుతమని రాజీవ్‌కుమార్‌ కితాబిచ్చుకున్నారు. అసలు ఇవిఎంలకు ప్రత్యామ్నాయం అన్న ఆలోచనకే తావులేదని, ఇవిఎం అక్రమాలు జరిగే వీలులేదని కొట్టిపారేస్తున్నారు. మరి పోలింగ్‌కు పదిరోజుల ముందు పెట్టిన ఛార్జింగ్‌, కౌంటింగ్‌ తర్వాత కూడా ఇవిఎం, వివి పాట్‌లకు వందశాతం ఉండడం ఎలా సాధ్యమన్న ప్రశ్నను ఆయన పట్టించుకోవడం లేదు. వివి ప్యాట్‌ స్లిప్పులు పోలింగ్‌ కేంద్రాలలో కనిపించడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం లేదు. సాంప్లింగ్‌ కాకుండా అన్ని వివి పాట్లను లెక్కించవలసిందే అంటే మౌనమే సమాధానం. ఈ దేశ పౌరులకు వచ్చిన సందేహాలను తీర్చవలసింది పోయి, వాటిని కొట్టిపారేయడం ప్రజాస్వామిక వాదులను విస్తు గొలుపుతోంది. వివిధ రాజకీయ పక్షాల, స్వతంత్ర సంస్థల వ్యతిరేకతను పట్టించుకోకుండా, ఒకవైపు నరేంద్రమోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుండడం, అదే సమయంలో ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తోన్న ఇవిఎంలపై ముసురుకుంటున్న సందేహాలను నివృత్తి చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. న్యాయవ్యవస్థపై ఇప్పటికే ప్రజలలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా గుర్తించే జర్నలిజంలో ఇప్పటికే మోదీ ప్రభావం చాలా లోతుగా ఉండడం మనకు తెలిసిందే. ఈ సమయంలో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించకుండా, ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడం ఆందోళన కలిగిస్తోంది.

పైకి పెద్దగా కనిపించనప్పటికీ ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టే ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎన్నికల గుర్తుల కేటాయింపులు. గత పార్లమెంటు ఎన్నికలలో శరద్‌పవార్‌ ఎన్సీపీ పార్టీలో చీలిక వచ్చింది. శరద్‌పవార్‌ వర్గానికి చివరి నిమిషంలో ‘బూరా ఊదుతున్న మనిషి’ బొమ్మను కేటాయించారు. ఆ పార్టీ తమ కొత్త గుర్తును సమర్ధంగా ప్రజల వద్దకు తీసుకు వెళ్లలేకపోయింది. దీనికి తోడు చాలామంది స్వతంత్ర అభ్యర్థులకు ‘బూరా’ బొమ్మను కేటాయించారు. దానితో గ్రామీణ ప్రాంత ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు ఎన్నికల కమిషనర్‌ ఆ రెండూ విడివిడి గుర్తులని, గందరగోళం ఏమీ లేదని చాలా సులువుగా కొట్టి పారేసారు. విచిత్రం ఏమంటే ఎన్నికల కమిషన్‌ ఒంటెత్తు పోకడలపై పోరాటం చేయవలసిన రాజకీయ పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. డబ్బు, మద్యం, ప్రజాకర్షక పథకాలు తమను గట్టెక్కిస్తాయని ఎవరికి వారే ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పేజర్లను బాంబులుగా వాడటం సాధ్యం అయినపుడు ఇవిఎం హ్యాకింగ్‌ ఎందుకు సాధ్యం కాదని కోర్టులను ప్రశ్నించలేకపోతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలేవీ ఇవిఎంలను నమ్మకుండా బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు జరుపుకొంటున్నాయి. వాటికి లేని ఆడంబరం మనకు మాత్రం ఎందుకని మన రాజకీయ పార్టీలు ప్రశ్నించకుండా ఉండడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page