ప్రశ్నించడం.. ఆరోపించడం.. ఒకటేనా!
- DV RAMANA

- Aug 6, 2025
- 2 min read

ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి విధి అని.. దాన్ని కోర్టు తప్పుపట్టడం ఏమిటంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. న్యాయ, పార్ల మెంటరీ వ్యవస్థల అధికారాలు, హక్కుల దిశగా ఆమె వ్యాఖ్యలు దారిమళ్లుతున్నాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కేసు విచారణ సందర్భంగా మొన్న సోమవారం రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ ప్రియాంక వ్యక్తం చేసిన అభిప్రాయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు 2022లో భారత్ జోడో యాత్ర చేశారు. ఆ యాత్రలో భాగంగా పలు చోట్ల ప్రసంగిస్తూ మన దేశానికి చెందిన రెండువేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించినా.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని. పైగా చైనా ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదని మోదీ సర్కార్ అబద్ధాలు చెబుతోందని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఆరోపణల ద్వారా మనదేశ సైన్యాన్ని రాహుల్ అవమానించినందున, ఆయనపై చర్యలు తీసుకోవా లని కోరుతూ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ జరగకుండా స్టే విధించాలని కోరుతూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిప్‌ాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ వ్యాఖ్యలను తప్పు బట్టింది. చైనా రెండువేల కిలోమీటర్లు ఆక్రమించిందనడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణను నిలిపేయడంతో పాటు తిరిగి ఆయనకే నోటీసులు జారీ చేసింది. సమస్యల ప్రస్తావనకు, ప్రశ్నలు వేయడానికి పార్లమెంటు ఉంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ పార్లమెంటులో ప్రస్తావించకుండా సోషల్ మీడియాలోనో, బహిరంగ వేదికల పైనో ఆధారాలు లేని ఆరోపణలు చేయడమేమిటని మందలించింది. ఇలాంటి సమస్యలపై పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడరని నిలదీసింది. నిజమైన భారతీయులెవరూ ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు చేయరని కూడా వ్యాఖ్యానించింది. సుప్రీం ధర్మాసనం చేసిన ఈ మందలింపులపై అటు కాంగ్రెస్.. ఇటు ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వాస్తవాలే మాట్లాడారని, ‘తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు’ అనే కేంద్ర సర్కారు విధానంలో భాగంగానే ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు. అయితే పాలక బీజేపీ దీన్ని కౌంటర్ చేసింది. విదేశీ శక్తులు రాహుల్‌గాంధీని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తున్నారని ఆరోపించింది. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేసినందుకు సుప్రీంకోర్టు మందలించిన తర్వా తైనా రాహుల్ తీరు మార్చుకుంటారని ఆశిస్తున్నామని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి ప్రకటనలు చేయడం దేశానికి హానికరం, మన సైన్యానికి నిరుత్సాహకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంపీ ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్‌ను సమర్థించే క్రమంలో పార్లమెంటు ఆవరణలో మాట్లాడుతూ ప్రశ్నలు వేయడం, ప్రభుత్వాన్ని సమస్య లపై నిలదీయడం ప్రతిపక్ష నేత విధి అని పేర్కొన్నారు. చైనా ఆక్రమణకు పాల్పడిరదన్న ఆరోపణలను పార్లమెంటులో కాకుండా బయట ప్రస్తావించడాన్ని ధర్మాసనం తప్పుపట్టడంపై స్పందిస్తూ ఈ ప్రభు త్వం పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడమే లేదని, ఒకవేళ ప్రశ్నలు వేయగలిగినా వాటిని దాటవేస్తోందని ఆమె విమర్శించారు. అయితే ధర్మాసనం వ్యాఖ్యలను ప్రియాంక వ్యతిరేకించడం న్యాయస్థానాలను వ్యతిరేకించడమే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆధారాలు లేకుండా సున్నితమైన అంశాలపై బహిరంగ ఆరోపణలు చేయడం తగదని కోర్టు భావించడం సమంజసమేనని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటువంటి అంశాలను పార్లమెంటులోనే ప్రస్తావించవచ్చు కదా.. అని కోర్టు ప్రశ్నించింది. కానీ చిత్రంగా సరిహద్దు సమస్య, విదేశీ ఆక్రమణగా చెబుతున్న రాహుల్ ఇంత వరకు దాన్ని పార్లమెంటులో ప్రస్తావించలేదు. కాగా నిజమైన భారతీయులెవరూ ఇలా చేయరని సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా.. నిజమైన భారతీయులెవరో తేల్చేది జడ్జీలు కాదు’.. అని వ్యాఖ్యానించిన ప్రియాంక అదే సమయంలో కోర్టులు, న్యాయమూర్తులపై తనకు గౌరవం ఉందని చెప్పడం విశేషం.










Comments