పేలుతున్న కూరల బాంబ్!
- BAGADI NARAYANARAO

- Nov 17
- 2 min read
జిల్లాలో కూరగాయ పంటల సాగే తక్కువ
వాటిని కూడా ముంచేసిన మొంథా తుపాను
దీనికితోడు కార్తీకమాసం ప్రభావం
పెరిగిన దిగుమతులు.. ధరలు

(సత్యం న్యూస్,శ్రీకాకుళం)
అసలే వర్షాకాలం.. ఆపై మొంథా తుపాను కలిసి కూరగాయల దిగుబడులను భారీగా దెబ్బతీశాయి. దానికితోడు కార్తీకం ఎఫెక్ట్ వెరసి ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు కూర‘గాయాల’ పాలవుతున్నారు. జిల్లా కూరగాయల సాగు పెద్దగా లేకపోవడం వల్ల అధిక శాతం దిగుబడులపై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా కార్తీకమాసంలో మెజారిటీ ప్రజలు శాకాహారమే స్వీకరిస్తారు. దానివల్ల కూరగాయలకు సహజంగా డిమాండ్ పెరుగుతుంది. కానీ పెరిగిన డిమాండ్‌కు తగినట్లు దిగుమతులు ఉండటం లేదు. దీనికి కారణం.. వర్షాలు, తుపాను కారణంగా కూరగాయలు పండిరచే జిల్లాల్లో పంటలు దెబ్బతినడమేనని మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. చివరికి ఆకుకూరల ధరలు కూడా మండిపోతున్నాయి. బంగాళ దుంపలు, ఉల్లి మినహా అన్ని రకాల కూరగాయాల ధరలు కిలో రూ. 50 పైగానే ఉన్నాయి.
పెరిగిన దిగుమతులు
జిల్లాలో కూరగాయలు సాగు నామమాత్రంగా ఉంది. అందులోనూ కొన్ని రకాలను మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 18 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నట్లు అధికారులు లెక్క చూపుతున్నారు. అది కూడా టమాటా, కాలీఫ్లవర్, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, బీర, ఆనపకాయ, చిక్కుడుకాయ పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. వీటిలో టమాటా పంటకు ఇటీవలి తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక కాలీఫ్లవర్, బెండకాయ, దొండకాయ, వంకాయ, బీరకాయలకు సంబంధించి డిమాండ్‌కు తగినంత దిగుబడి లేదు. కూరగాయ పంటలు అందుబాటులోకి వస్తాయనుకుంటున్న సమయంలోనే మొంథా తుపాను సంభవించి చివరి దశలో ఉన్న పంటలను తుడిచిపెట్టుకుపోయింది. దాని ప్రభావం దిగుబడులపై పడిరది. దాంతో రైతులు అరకొర కూరగాయలనే రైతుబజార్‌కు తీసుకువస్తున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్న కూరగాయలదీ ఇదే పరిస్థితి. జిల్లా పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో బయట ప్రాంతాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లోనూ వర్షాలు, తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిని, దిగుబడులు తగ్గడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి.
పది రోజుల్లోనే భారీ పెరుగుదల
నగరంలోని పెద్దమార్కెట్, రైతుబజారు కూరగాయల ధరల మధ్య కూడా కేజీకి రూ.12 నుంచి రూ.20 వ్యత్యాసం కనిపిస్తోంది. టమాటాను బెంగళూరు, రాయపూర్ నుంచి, క్యాబేజీని హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మిరప మహారాష్ట్ర నుంచి , క్యారెట్, బీట్‌రూట్ సికింద్రాబాద్, అరకు నుంచి, గోల్కొండ చిక్కుడును రాజాం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో సాగు చేస్తున్న టమాటా పంట మరో 20 రోజులకుగానీ అందుబాటులోకి రాదని, ఇతర పంటలదీ అదే పరిస్థితి అని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో ప్రజలకు ధరల భారం తప్పడంలేదు. వారం వ్యవధిలోనే ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నెల 10న రైతుబజార్‌లో టమాటా కిలో రూ.26 ఉండగా సోమవారం రూ.44కు పెరిగింది. వంకాయలు కేజీ రూ.46 నుంచి 60కి, బెండకాయలు రూ.56 నుంచి రూ.60కి, బీరకాయలు రూ.50 నుంచి రూ.56కు, క్యారెట్ రూ.50 నుంచి రూ.54కు, దొండకాయలు రూ.44 నుంచి రూ.50కి, మునగకాయలు రూ.60 నుంచి రూ.70కి, గోల్కొండ చిక్కుడు రూ.42 నుంచి రూ.50కి ఎగబాకాయి. వీటితో పాటు ఫ్రెంచ్ బీన్స్, బీట్‌రూట్, క్యాప్సికమ్ తదితర చాలా రకాల కూరగాయాలు కేజీకి సగటున రూ.10 పెరిగాయి. ఇవి కేవలం రైతుబజార్‌లో ధరలు మాత్రమే. బహిరంగ మార్కెట్‌లో ఈ ధరలు ఇంకా అధికంగా ఉన్నాయి.










Comments