top of page

ప్లాన్‌`బి లేదా బాబూ..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Sep 10
  • 3 min read
  • మన ‘ప్రసాద’ం తీసుకుపోనున్న పవన్‌కళ్యాణ్‌

  • ఇప్పటికే ఆ నిధులతో అన్నవరం అభివృద్ధి

  • చేసినవి చెప్పుకోలేకపోయిన వైకాపా

  • చెప్పినా చేయలేకపోతున్న కూటమి

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

యుద్ధంలో గాని, వ్యూహంలో గాని, వ్యాపారంలో గాని ప్లాన్‌`బి అంటూ ఒకటుండాలి. ఈ ‘బి’ ఏంటనుకుంటున్నారా..? మన సినిమా హాల్‌లో ఎంట్రీ వైపు ఫైర్‌ యాక్సిడెంట్‌ అయితే ఎగ్జిట్‌ వైపు మరో ద్వారం తెరిచేటట్టు ఉండటం. ఇది మొదట్లో యుద్ధవ్యూహంలో భాగంగా ఉన్నా, సాధారణ జీవితానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్వయించుకోవాలని చెబుతుంటారు. సరిగ్గా ఈ ప్లాన్‌`బి మన పాలకుల మదిలో ఉందా, లేదా అనేదే తలెత్తుతున్న ప్రశ్న. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రసాద్‌ అనే స్కీమ్‌ ఒకటి నడుస్తోంది. పిలిగ్రిమేజ్‌ రెజువనేషన్‌ అండ్‌ స్పిరిట్యువాలిటీ ఎగ్మెంటేషన్‌ డ్రైవ్‌ (ప్రసాద్‌) కింద గుర్తించిన ఆలయానికి విడతల వారీగా రూ.100 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. జిల్లా నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి అయ్యారు కాబట్టి చాలా సులువుగా ప్రసాద్‌ నిధులు వస్తాయని, దీంతో ఒక్క అరసవల్లే కాకుండా శ్రీకూర్మం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని, ఈ రెండిరటినీ కలిపి స్పిరిట్యువల్‌ కారిడార్‌గా నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ భావించారు. అందులో భాగంగానే అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం మీద అందరి దృష్టీ పడాలని మొన్నటి రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించారు. అందులో భాగంగా ఆక్రమణల తొలగింపు, హెలికాఫ్ట్‌ర్‌ టూరిజం, కోనేరు పునర్నిర్మాణం, కాటేజీల పునరుద్ధరణ వంటివి చేశారు. అరసవల్లి దేశంలో ఒకే ఒక్క సూర్యభగవానుడి విగ్రహం ఉన్న ఆలయమని, ఆ మేరకు అభివృద్ధి చేస్తామంటూ అక్కడున్న షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు తొలగించారు. తీరా చూస్తే ఇప్పుడా ప్రసాద్‌ నిధులు మన జిల్లాకు వచ్చే సూచనలు కనిపించడంలేదు. అందరూ ఈ నిధులు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి తరలిపోయాయని చెబుతున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. ఇప్పటికే అన్నవరం ఆలయాన్ని ప్రసాద్‌ ప్రాజెక్టు ద్వారా విడత విడతలుగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిని, సింహాచలాన్ని కూడా ఇదే ప్రాజెక్టు కింద బాగా డెవలప్‌ చేశారు. అయితే గత ప్రభుత్వం దీని మీద ప్రచారం చేసుకోలేకపోయింది. గోపాలపట్నం బంకు దగ్గర్నుంచి సింహాచలం ఆలయం వరకు వేసిన 100 అడుగుల రోడ్డు ఈ ప్రాజెక్టులో భాగమే. అలాగే ఆలయ అభివృద్ధి, కొండ దిగువున ముడసరలోవ మెయిన్‌ రోడ్డుకు కలిపే ప్రధాన మార్గం కూడా ఈ విధంగానే అభివృద్ధి చేశారు. శ్రీకాళహస్తిలో కూడా సేమ్‌ టు సేమ్‌. ఇక్కడ కూలిపోతున్న రాజగోపురాలను నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ సీఎస్సార్‌ యాక్టివిటీలో భాగంగా నిర్మించింది గానీ, మిగిలిన కాళహస్తి డెవలప్‌మెంట్‌ అంతా ప్రసాద్‌ ప్రాజెక్ట్‌ ద్వారానే జరిగింది. అయితే ఇప్పుడు మన అరసవల్లికి రావాల్సిన నిధులు కేంద్రమంత్రి రాము ఢల్లీిలో ఉన్నా కూడా ఎందుకు రావడంలేదన్నది ప్రధాన ప్రశ్న. రథసప్తమి అయిన దగ్గర్నుంచి అరసవల్లి అభివృద్ధి ఎప్పుడా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. అయినా ఈ ఫైల్‌ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఈ విషయం కూటమి నేతలకు తెలుసు. కేంద్ర పర్యాటక శాఖ నిధులిస్తే తమ ప్రాంతాల్లో ఆలయాలు అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్రంలో పవర్‌ఫుల్‌ లీడర్లు ఎదురుచూస్తున్నారు. ఇందులో ముందువరుసలో మంత్రి నారా లోకేష్‌ ఉన్నారు. తన నియోజకవర్గం మంగళగిరిలో పానకాలస్వామి ఆలయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రానికి మరో ప్రాజెక్టు ఇచ్చే అవకాశం ఉండటంతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అందుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు భోగట్టా. పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం (పుర్హూతికా అమ్మవారు) ఆలయం, దానికి ఆనుకొనే వైష్ణవ దేవాలయం (శ్రీకూర్మం, గయ మాదిరిగానే ఇక్కడ కూడా పిండప్రదానం చేస్తారు) ఉండటంతో దీన్ని డెవలప్‌ చేయాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రానికి రెండు ప్రాజెక్టులు ఇస్తే గొప్ప. కానీ కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో మూడో ప్రాజెక్టు కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ ఇస్తే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సొంతవూరు నెల్లూరులో వేణుగోపాలస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గుర్నీ కాదని అరసవల్లికి నిధులు తీసుకురావడం అంత సులువు కాదు. అయితే రాజకీయాలు పూర్తిగా వంటబట్టని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అరసవల్లిని ఎక్కడికో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ నిధులొచ్చే సూచనలు కనిపించడంలేదు. రథసప్తమి నాటికే దాతల సహకారంతో నిర్మించినవాటిని తొలగించడమేమిటని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అరసవల్లి అభివృద్ధి చెందితే అంతే చాలని చాలామంది సర్దిచెప్పుకున్నారు. ఇప్పుడు ప్రసాద్‌ నిధులు రావని తెలిస్తే, ఇప్పటికే పెనం మీదున్న ఎమ్మెల్యే పరిస్థితి పొయ్యిలో పడ్డట్టవుతుంది. స్టేడియం నిర్మాణం పూర్తికాలేదని ఆయన మీద రుసరుసలాడుతున్న ప్రజానీకం ఇప్పుడు అరసవల్లి రూపురేఖలు మారవంటే లైట్‌గా తీసుకోరు. అయితే ఇలాంటప్పుడే ప్లాన్‌`బి ఉండాలి. ఎప్పుడైతే ప్రసాదం నుంచి నిధులు రావని తేలుతుందో అప్పటికి మరో ప్లాన్‌తో మన నాయకులు సిద్ధంగా ఉండాలి. కేంద్రమంత్రిగా రాము ప్రమాణస్వీకారం చేసిన దగ్గర్నుంచి స్థానికులు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేశమంతా అప్పులే కాబట్టి కొత్తగా చేయడానికేమీ ఉండదన్న వాతావరణంలో ఇటువంటి నిధులు తెచ్చుకోగలిగే సత్తా ఉండాలి. కానీ ఇక్కడ పోటీలో ఉన్నది పార్టీలో తనకన్నా ముందువరుసలో ఉన్నవారు కాబట్టి బహుశా ఇది సాధ్యం కాకపోవచ్చు.

స్వామే సంపన్నుడు..

వాస్తవానికి అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో నిధులు అవసరంలేదు. స్వతహాగా స్వామి సంపన్నుడు. ఆయనకు భక్తులు చేయూతనిస్తే అరసవల్లిలో అద్భుతంగా డెవలప్‌ చేయొచ్చు. దాని మీద ప్రభుత్వం, కేంద్రమంత్రి తలా ఓ చేయి వేస్తే, అరసవల్లి ఓ రేంజ్‌కు వెళ్తుంది. ఇదేదో కట్టుకథ కాదు. తుని దగ్గరున్న తలుపులమ్మ ఆలయానికి వెళ్తే తెలుస్తుంది. ఈవో విశ్వనాథ రాజు లాంటి వారు చిత్తశుద్ధితో చేసిన పనిని ప్రేరణగా తీసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ 10 నుంచి 15 కోట్ల మధ్యలో అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పబ్లిక్‌ను, ప్రభుత్వాన్ని అనుసంధానించారు. తలుపులమ్మ పేరు చెబితే వచ్చిన విరాళాలను పారదర్శకంగా ఖర్చు చేశారు. ఇంకా రూ.5 కోట్లతో పనులు చేయండి, విరాళాలిస్తామని ముందుకొచ్చే భక్తులున్నారు. ఊరికొక అమ్మవారు ఉన్నచోట తలుపులమ్మ కోవెలను అభివృద్ధి చేసినప్పుడు దేశంలో ఒకే కోవెలున్న సూర్యనారాయణమూర్తి ప్రాంగణాన్ని ఎందుకు బాగుచేయలేం? కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు చెబితే సీఎస్సార్‌ యాక్టివిటీ కింద ఏ సంస్థ దీన్ని దత్తత తీసుకోకుండా ఉంటుంది? భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్న జీఎంఆర్‌ లాంటి సంస్థకు అరసవల్లి పుస్కరిణి నిర్మించమంటే కాదనగలదా? పోలవరం కడుతున్న ఇంజినీరింగ్‌ సంస్థలకు రోడ్లు అప్పజెబితే వేయకుండా ఉంటుందా? అయితే ఇక్కడ కావాల్సిందంతా అరసవల్లిని అభివృద్ధి చేయాలి అన్న సంకల్పం చెద పట్టినంతగా మనల్ని తినేయాలి. ఈవో ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి తమకు పేరు రాదని అర్చకులు బదిలీ కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం, అరసవల్లి అభివృద్ధి పేరు చెప్పి ఒక్కొక్కరు ఒక్కో పళ్లెం పట్టుకొని తిరగకుండా సంఘటితంగా పని చేయగలగాలి. ఈ కార్యాచరణ కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రుల నేతృత్వంలో జిల్లాలో ఒక సమావేశం జరగాలి. ఇందులో ఒక కార్యాచరణ రూపొందించాలి. అప్పుడే అరసవల్లికి ప్లాన్‌`బి ఉందని తేలుతుంది. ప్రసాద్‌ నిధులు రాకపోయినా, మా ఆలయాన్ని మేము పునర్నిర్మించుకున్నామని కాలరెగరేసుకొనే అవకాశం దొరుకుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page