పిల్లలకు తల్లి కులం వర్తించవచ్చు!
- DV RAMANA

- Dec 16, 2025
- 3 min read

కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు పుట్టే బిడ్డలకు తల్లి కులం వంశ పారంపర్యంగా దఖలు పడుతుందా? ఆ ప్రకారం ఆమె వారసులకు కుల సర్టిఫికెట్లు ఇవ్వవచ్చా?? ఇవే ప్రశ్నలు లేవనెత్తతూ.. ఒక బాలికకు తల్లి కులం ఆధారంగా సర్టిఫికెట్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తద్వారా తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ తల్లి కులం ఆధారంగా ఆమె కుమార్తెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతించిందన్నమాట. పుదుచ్చేరికి చెందిన బాలికకు ఆమె తల్లి కులం ఆధారంగా ఎస్సీ ధృవీకరణ పత్రం జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇటీవల ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. తండ్రి ఎస్సీ కాకపోయినప్పటికీ ఆమె తల్లికి చెందిన ‘ఆది ద్రవిడ’ కులం ఆధారంగా ఈ అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తుందని సీజేఐ బెంచ్ అంగీకరించింది. తండ్రి కులాన్ని వారసత్వంగా పొందే పిల్లల హక్కును సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు చెప్పాల్సి ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను మాత్రం సమర్థించింది. ‘మేం చట్టం సంధించిన ప్రశ్నను ఇంకా పరిశీలనలోనే ఉంచాం అంటూ.. మారుతున్న కాలంతో పాటు తల్లి కులం ఆధారంగా కుల ధృవీకరణ పత్రం ఎందుకు జారీ చేయకూడదు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత కేసులో ఆదిద్రావిడ వర్గానికి చెందిన తల్లి తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని అక్కడి తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంది. తన భర్త ఎస్సీ వర్గానికి చెందకపోయినప్పటికీ ఎస్సీ కేటగిరీలో ఉన్న ఆదిద్రావిడ వర్గానికి చెందిన తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడని, అందువల్ల తమ పిల్లలకు ఎస్సీ సర్టిఫికెట్ పొందే హక్కు ఉందని ఆమె దరఖాస్తులో పేర్కొంది. ఆది ద్రావిడ కులాన్ని మార్చి 5, 1964 అలాగే.. ఫిబ్రవరి 17, 2002 తేదీల్లో ఎస్సీ కేటగిరీలో చేరుస్తూ రాష్ట్రపతి ఆమోదంతో భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఆమె వెల్లడిరచారు. అయితే ఈ నోటిఫికేషన్లు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం పొందేందుకు ఒక వ్యక్తి లేదా మహిళ అర్హులా కాదా అన్నిది ప్రధానంగా తండ్రి కులం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అధికార పరిధిలో నివాస స్థితిపై ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా మనది ప్రధానంగా పితృస్వామ్య వ్యవస్థ. కుటుంబపరంగా, ప్రభుత్వపరంగా కూడా తండ్రి వారసత్వాన్నే మన ప్రభుత్వాలు, సమాజం అంగీకరిస్తాయి. ఆ ప్రకారం సాధారణ వివాహాలతోపాటు కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు జన్మించే పిల్లలకు తండ్రి కులమే వారసత్వంగా వస్తుందని మన చట్టాలు, సంప్రదాయాలు చెబుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల్లో ఇదే రకమైన తీర్పులు ఇచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి కాకుండా తల్లి కులాన్ని పిల్లలకు వారసత్వంగా ఇవ్వవచ్చని గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా ఢల్లీి హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విన్నవించింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా, తల్లి అవివాహితురాలైనా, ఆమె తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్న సందర్భాల్లో పిల్లలకు తల్లి కులం పేరుతో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చని వివరించింది. అయితే పుదుచ్చేరి కేసులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం స్థానిక అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. దాంతో ఆ మహిళ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బాలికకు ఎస్సీ సర్టిఫికెట్ నిరాకరించడం వల్ల ఆమెకు విద్యాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ పిటిషనర్ కుమార్తెకు ప్రత్యేకంగా ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. చివరికి ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తల్లి కులం ఆధారంగా ఎస్సీ మహిళ కుమార్తెకు ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు తన గత తీర్పులకు భిన్నంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. కుల ధృవీకరణ పత్రం జారీ ప్రమాణాలపై సుప్రీంకోర్టు తన మునుపటి తీర్పులను తానే వ్యతిరేకించినట్లు అయ్యింది. తండ్రి కులమే పిల్లల కులాన్ని నిర్దేశించే ప్రామాణికమని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. 2003 నాటి పునీత్‌రాయ్ వర్సెస్ దినేష్‌చౌదరి కేసులో హిందూ చట్టం ప్రకారం పిల్లల కులం తండ్రి నుంచి వారసత్వంగా వస్తుందని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు ఇచ్చింది. కుల ప్రయోజనాలకు తండ్రి వంశ పారంపర్యత అనుసరిస్తారని కోర్టు అభిప్రాయపడిరది. అయితే 2012లో నమోదైన రమేష్‌భాయ్ దభాయ్ నాయకా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో ఇదే సుప్రీంకోర్టు చాలా సరళమైన వైఖరి తీసుకుంది. కులాంతర లేదా గిరిజన, గిరిజనేతర వివాహాల ద్వారా దంపతులయ్యేవారికి జన్మించిన పిల్లల కులాన్ని వారి తండ్రి కులం ఆధారంగా మాత్రమే నిర్ణయించలేమని పేర్కొంది. న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం, రంజనా ప్రకాష్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం పిల్లవాడు తండ్రి కులానికి చెందినవాడని భావించవచ్చు, కానీ అది నిశ్చయాత్మకమైనది లేదా తిరస్కరించలేనిది కాదని తీర్పు చెప్పింది. తిరిగి ఇప్పుడు తల్లి కులం ఆధారంగా పుదుచ్చేరి బాలికకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇలా భిన్నతీర్పుల వల్ల నెలకొంటున్న గందరగోళాన్ని పరిష్కరించేలా సుప్రీంకోర్టు విస్తృత తీర్పు ఇస్తే బాగుంటుంది.










Comments