పులివెందుల కోట అన్‌బీటబుల్ కాదు!
- DV RAMANA
- Aug 15
- 3 min read
వైఎస్ కుటుంబానికి అడ్డగోలుగా అండనివ్వలేదు
వారిని ఓడిరచిన సందర్భాలు కూడా ఉన్నాయి
పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి రాజారెడ్డి దంపతుల ఓటమి
1996 లోక్‌సభ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన వైఎస్‌ఆర్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి పరాజయం
తాజాగా జెడ్పీటీసీ స్థానం పరాధీనం

డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి
పులివెందులకు ముప్పయ్యేళ్ల తర్వాత స్వాతంత్య్రం వచ్చిందని తెలుగుదేశం శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
అధికార బలంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో గెలిచామని జబ్బలు చరుచుకుంటున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక రాజకీయ విశ్లేషకులు.. రాజకీయ అవగాహన ఉన్న ప్రజలైతే.. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి అధికార పార్టీ వైకాపా హయాంలో కుప్పంలో ఎదురైన పరాజయానికి పులివెందులలో ఆ పార్టీని దెబ్బకొట్టడం ద్వారా తెలుగుదేశం బదులు తీర్చుకుందంటున్నారు. అన్నింటికీ మించి వైఎస్ కుటుంబానికి పెట్టని కోట.. అక్కడ వారి విజయం అన్‌బీటబుల్ అన్న వాదనను బ్రేక్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కుప్పం మాదిరిగానే పులివెందుల వైఎస్ కుటుంబానికి రాజకీయంగా అండగా నిలుస్తుండటం వాస్తవమే అయినా అక్కడ ఆ కుటుంబం ఎప్పుడూ ఓడిపోలేదనడంలో మాత్రం వాస్తవం లేదని చరిత్ర చెబుతోంది. అయితే గతంలో వైఎస్, చంద్రబాబు రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థులుగా వ్యవహరించినా ఎప్పుడూ పరస్పరం తలపడలేదు. ప్రత్యర్థి కోటను జయించాలని పట్టదలతో ప్రయత్నించలేదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ జోలికి పీసీసీ అధ్యక్షుడిగా, సీఎం ఉన్నప్పుడు కూడా వైఎస్‌రాజశేఖరరెడ్డి వెళ్లలేదు. అలాగే పులివెందులలో పాగా వేయాలని చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. దాంతో ఎవరి కోటలో వారు అన్‌బీటబుల్ అన్న అభిప్రాయం జనాల్లో నాటుకుపోయింది. కానీ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ విషయంలో నేరుగా జగనే టార్గెట్ చేసినట్లు.. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ విషయంలో చంద్రబాబు టార్గెట్ చేసి విజయం సాధించారు. విజయం ఏ ఒక్కరి సొంతం కాదని నిరూపించారు. వైఎస్ కోట అని చెప్పుకొంటున్న పులివెందులలో ఆ కుటుంబ సభ్యులు ఓడిపోయిన పలు సందర్భాలు కూడా ఉన్నాయి.
ఓటమితోనే ప్రస్థానం మొదలు

పులివెందులలో ప్రతి గడపా.. ప్రతి ఓటూ వైఎస్ కుటుంబానికే అంకితమని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటారు. అయితే ఆ కుటుంబం అక్కడ అన్‌స్టాపబుల్ గానీ.. అన్‌బీటబుల్ గానీ కాదన్నది వాస్తవం. కాకపోతే ఎక్కువ సంఖ్యలో విజయాలు అందుకున్న ఘనత ఆ కుటుంబానిదే. కానీ ఓటమి చరిత్ర కూడా ఉంది. ఆ కుటుంబానికి ఆద్యుడైన వైఎస్ రాజారెడ్డే స్వయంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాజారెడ్డి అంటే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి తండ్రి, వైఎస్ జగన్‌కు స్వయానా తాత. ఆయన బతికున్నప్పుడు పులివెందులలో ఆయన రాజ్యాంగమే నడిచిందని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటుంది. అటువంటి రాజారెడ్డి 1970లో పులివెందుల పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనొక్కరే కాదు.. ఆయన సతీమణి సైతం పరాజయాన్ని చవిచూశారు. ఆ ఎన్నికల్లో రాజారెడ్డి, ఆయన సతీమణి చెరో వార్డు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. రాజకీయాల్లో తమ తొలి ప్రయత్నాన్ని గెలిపించాలని ఆ దంపతులు ప్రచారం చేసినా.. ప్రజలు తిరస్కరించి, ఇద్దరినీ ఓడిరచారు.
ఘనంగా ఎగిరిన పసుపు జెండా :
రాజారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి గెలిచారు. అయితే 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కడప ఎంపీ సీటును తెలుగుదేశం గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎన్ రెడ్డి 51.3 శాతం అంటే 332,915 ఓట్లతో అంటే సగానికంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబుల్‌రెడ్డి సుమారు 54 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానంలో భాగంగా ఉన్న పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా టీడీపీకే మెజారిటీ రావడం విశేషం. అలా అప్పట్లోనే టీడీపీ వైఎస్ కోటను ఢీ కొట్టింది.
వైఎస్ గెలిచినా ఓడినంత పనైంది!
పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ స్థానాలు వైఎస్ కుటుంబానికి తద్వారా కాంగ్రెస్‌కు అప్పట్లో అడ్డాగా పేర్కొనేవారు. కానీ 1996 లోక్‌సభ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు ఓడినంత పనైంది. చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గతంలోని లక్షల మెజారిటీలు పోయి.. కేవలం 5,435 ఓట్ల తేడాతో గెలిచి బయటపడ్డారు. అప్పట్లో కడప ఎస్పీగా ఉన్న ఉమేష్‌చంద్ర, కలెక్టర్‌గా ఉన్న వీణా ఈష్‌కు కడప లోక్‌సభ ఎన్నికను ప్రత్యక్షంగా పర్యవేక్షించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే కౌంటింగ్ సందర్భంగా తీవ్ర వివాదాల చోటు చేసుకున్నాయి. రౌండు రౌండుకూ ఆధిక్యతలు మారిపోతుండటం, దానిపై ప్రత్యర్థుల అభ్యంతరాలతో మళ్లీ లెక్కించాల్సి రావడం వంటి అవాంతరాలతో ఆ లోక్‌సభ ఓట్ల లెక్కింపు మారథాన్ పోటీలా సుమారు రెండు రోజులపాటు సాగి.. ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించింది. చివరికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ేవైఎస్సార్‌కు 368,611 ఓట్లు రాగా టీడీపీ తరఫున పోటీ చేసిన కందుల రాజమోహన్‌రెడ్డికి 363,166 ఓట్లు వచ్చాయి. ఒక దశలో వైఎస్సార్ ఓటమి ఖాయమని అనుకున్నా.. ఆయన స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లోనూ పులివెందులలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు ధీటుగా ఓట్లు లభించాయి.
వివేకా ఓటమి

వైకాపా ఆవిర్భావం తర్వాత 2017లో జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జగన్ బాబాయి, వైఎస్ సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవి విజయం సాధించి ఎమ్మెల్సీ అయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా పులివెందుల స్థానిక సంస్థల ఓటర్లు టీడీపీకి జై కొట్టారని చెబుతారు.
Comments