పోలీసుల అదుపులో సైబర్ క్రైం నిందితులు
- BAGADI NARAYANARAO
- Jun 14
- 1 min read
రూ.6 లక్షలు నగదు స్వాధీనం
వివరాలు వెల్లడిరచిన డీఎస్పీ వివేకానంద
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఆన్‌లైన్‌లో డాక్టర్‌లను, వ్యాపారస్తులను, స్థితిమంతులను టార్గెట్ చేసుకుని సైబర్ క్రైంకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చి వివరాలను ఆయన వెల్లడిరచారు. నగరం పరిధిలో నమోదైన పలు సైబర్ క్రైం కేసుల్లో కర్ణాటకకు చెందిన రుమన్ షరీఫ్, కేరళకు చెందిన నౌఫాలా షరీన్, నాజుముద్ధీన్ చాక్ల తొప్పును విశాఖ రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ.6 లక్షలు నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్‌లను సేకరించి సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా నమ్మించి డబ్బులు అకౌంట్‌లో జమ చేసుకోవడంలో ముగ్గురు అనేక నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. అందులో భాగంగానే కిమ్స్ రోడ్డులో ఉన్న క్రాంతి ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం డాక్టర్ పి.రేవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆమె నుంచి రూ.13.50 లక్షలు డిపాజిట్ చేయించుకొని మోసానికి పాల్పడ్డారని తెలిపారు. మైసూర్, కోజికోడ్ ప్రాంతాలు తిరిగి ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను అభినందించారు. సమావేశంలో సీఐలు పైడపునాయుడు, రాజేష్, ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, సిబ్బంది ఈశ్వరరావు, రమణ, ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.
Comments