పోలీసుల ఉడుంపట్టు.. బెట్టింగు బాబుల ఆటకట్టు!
- NVS PRASAD

- May 27
- 3 min read
ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన లీల
విచారణలో విస్తుగొలిపే వివరాలు వెల్లడి
పేలనున్న బెట్టింగ్ బా(ం)బులు!
లాబీయింగ్ ద్వారా బయటపడేందుకు కొందరి యత్నాలు
మొత్తం సిండికేట్‌ను చిత్తు చేసేందుకు ఎస్పీ చర్యలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

చిన చేపను పెదచేప.. చిన మాయను పెనుమాయ మింగేస్తుంది’ అని వేదాంతంలో చెప్పినట్టు నగరంలో పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లను పరిచయం చేసిన వారే ఇప్పుడు పోటీ పెరిగి ఒకరినొకరు మింగేసుకునే పరిస్థితికి రావడం శుభపరిణామం. అయితే పోలీసులు క్లైమాక్స్‌లో ఎవర్ని ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని అంటారో.. ఎవర్ని తప్పిస్తారో తేలేవరకు నగరంలో బెట్టింగ్ మాఫియా వెన్నులో మాత్రం వణుకు పుడుతోంది. తీగ లాగితే డొంకంతా కదలడం వల్ల మూలన దాక్కున్న బుకీలు కూడా ఇప్పుడు సీసీఎస్ స్టేషన్ దగ్గర చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు. కేవలం ఎనిమిది మంది వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారని అటు మీడియా, ఇటు పోలీసులు భావిస్తూవచ్చారు. పోలీసులతో ఇన్నాళ్లూ సంబంధాలు నెరిపింది కూడా ఈ ఎనిమిది మంది టీమే. కానీ కేవలం ఇద్దర్ని అదుపులోకి తీసుకుంటే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూసాలు కదలడం ఈ కథలో కొసమెరుపు.

ఇంతవరకు క్లబ్ సంతు (న్యూకాలనీ), దేవి (మహాలక్ష్మీనగర్ కాలనీ), శ్రీకూర్మం శ్రీను (శ్రీకూర్మం), శేఖర్ (డీఎస్పీ ఆఫీస్ ఎదురు), లాలా, ఆటో నాగరాజు (ఇలిసిపురం), పాకాల కిశోర్ (పొన్నాడ), ధనుంజయ (ఒప్పంగి) వీరు మాత్రమే సిండికేట్‌గా ఏర్పడి బెట్టింగులు ఆడిస్తున్నారని పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే పాకాల కిశోర్, ధనుంజయలను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. తమపై పోలీసు నిఘా ఉందని వీరికి ముందే తెలియడం వల్ల జీతగాళ్లను పెట్టుకొని దందా నెరిపారు. ఇందులో భాగంగానే పాకాల కిశోర్ రవితేజ అనే వ్యక్తి ఫోన్ నెంబరు ద్వారా యాప్ ఐడీ పాస్‌వర్డ్‌లు ఇవ్వడం, వాడి ఫోన్ నెంబరు ద్వారానే చెల్లింపులు చేయడంతో కిశోర్, ధనుంజయతో పాటు రవితేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయట. ఒప్పంగి ధనుంజయకు జూదం, క్రికెట్ బెట్టింగే ప్రధాన వృత్తి. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న ధనుంజయను ఎట్టి పరిస్థితుల్లోను బయటకు తీసుకురావడానికి పెద్ద స్థాయిలో లాబీయింగ్ నడుస్తున్నట్టు భోగట్టా. పాకాల కిశోర్ దగ్గర పనిచేస్తున్న రవితేజ కాల్‌డేటా, ఫోన్‌పే చెల్లింపుల వివరాల మేరకు ఒక అవగాహనకు వచ్చిన సీసీఎస్ పోలీసులు కిశోర్‌కు, ఒడిశా బరంపురం శ్రీనుకు మధ్య క్రికెట్ బెట్టింగ్ విషయంలో లావాదేవీలు జరిగాయని గుర్తించారు. అందులో భాగంగానే సోమవారం నుంచి ఆయన్ను సీసీఎస్ స్టేషన్‌లో పెట్టి విచారిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో ఉంటూ విశాఖపట్నం ఆర్‌కే బీచ్ ఒడ్డున ఒక అపార్ట్‌మెంట్ తీసుకొని క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న తనూజ్ పేరు కూడా పోలీసు విచారణలో బయటపడినట్లు తెలిసింది. తనూజ్‌కు, పాకాల కిశోర్‌కు మధ్య కూడా లావాదేవీలు నడిచాయని పోలీసులు గుర్తించారని తెలిసింది. బరంపురం శ్రీను ఎవరెవరి దగ్గర బెట్టింగ్‌కు దిగారో చెబితే వారిని కూడా స్టేషన్‌కు తెస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు భోగట్టా.

డబ్బులిచ్చి ఆడిరచడం.. వడ్డీలు దండుకోవడం..
కళ్లేపల్లిలో పేకాడుతుండగా పోలీసులు దాడులు చేస్తే, వారిని నెట్టేసి మరీ పారిపోయిన వైష్ణపువీధికి చెందిన బాక్సర్ హేమంత్‌కుమార్‌ది మరో కథ. చేయడానికి ఇతిమిద్దంగా ఇదీ అనే పని లేకపోయినా దాదాపు కోటిన్నర రూపాయలు విలువ కలిగిన ఆస్తులున్న హేమంత్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఆడిరచినోడుంటే అప్పు చేసైనా ఆడుతారనడానికి హేమంత్ కథే నిదర్శనం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ పేకాట జరుగుతున్నా హేమంత్‌కుమార్‌కు ముందే ఇన్ఫర్మేషన్ అందుతుంది. పేకాడటానికి వచ్చినవారికి ముందుగా రూ.10వేలు ఇస్తాడు. వెంటనే ఆట గెలిస్తే, దానికి రూ.500 కలిపి వసూలు చేస్తాడు. అలా ఎంతమంది వాడినా స్పాట్‌లోనే వడ్డీ, అసలు వసూలు చేస్తాడు. ఇక ఆటలో ఓడిపోతే చక్రవడ్డీ, బారువడ్డీ లాంటివి కలిపి ఇంటిమీదకు వెళ్తాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రావడంలో అనుభవం, కండలు తిరిగిన ఒళ్లు ఉండటంతో తంతాడనే భయంతో భార్యల పుస్తెలమ్మి మరీ కుమార్‌కు డబ్బులు చెల్లిస్తుంటారు. వీడిలాగే నానుబాలవీధికి చెందిన బంకు రాజు కూడా స్పాట్‌లో వడ్డీకి డబ్బులిస్తుంటారు. ఇది కాకుండా పేకాట శిబిరం పరిసర ప్రాంతాల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా కాపలా కాయడం కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.500 వసూలు చేస్తాడు. వీరిద్దరూ పేకాడిన వారి నుంచి దోచుకొని గట్టిగా సొమ్ము సంపాదించినట్లు పోలీసులకు తెలుసు.
ఇంటర్నెట్ సెంటర్ బాయ్ నుంచి సొంత యాప్ సృష్టి వరకు..
శ్రీకాకుళంలో గారవీధికి చెందిన అభినవ్ (చిన్నా) కొన్నాళ్ల క్రితం ఆ మెయిన్ రోడ్డులోనే ఓ ఇంటర్నెట్ సెంటర్‌లో బాయ్‌గా పని చేశాడు. ఆ తర్వాత గాబర శ్రీను దగ్గర బెట్టింగులు ఆడటం, అనంతరం అక్కడే కలెక్షన్ బాయ్‌గా చేరడం ద్వారా అనుభవం సంపాదించాడు. ఈలోగా ఇంటర్నెట్ సెంటర్‌లో నాలుగు ముక్కలు నేర్చుకొని ఎచ్చెర్లలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ విభాగంలో పనికి చేరాడు. ఆ తర్వాత నగరానికి చెందిన ఓ ప్రముఖుడి కూతుర్ని బుట్టలో వేసుకొని పెళ్లి వరకు కథ నడిపించడంతో అభినవ్‌కు సొమ్ములిచ్చి పిల్ల తండ్రి వదిలించుకున్నాడు. దీన్నే పెట్టుబడిగా ప్రారంభించి క్రికెట్ బెట్టింగ్‌లో మూడో కంటికి తెలీకుండా ఓ కొత్త సామ్రాజ్యాన్ని అభినవ్, వాడి బావ శివారెడ్డి కలిసి స్థాపించేశారు. శ్రీకాకుళం నగరంలో తమ మధ్య పోటీ ఎందుకని ఎనిమిది మంది సిండికేటైతే కనీసం వారికి కూడా తెలియకుండా వీరిద్దరూ కలిసి ఒక ప్రత్యేకమైన బెట్టింగ్ యాప్ సృష్టించి కోట్లు కొల్లగొట్టేశారు. అభినవ్ బావ శివారెడ్డి గతంలో డే అండ్ నైట్ జంక్షన్ వద్ద జ్యూస్ షాపు నడిపేవాడు. కానీ ఇప్పుడు వీరి ఆస్తులు తుమ్మావీధిలో విలువైన స్థలం, తుపాకుల బిల్డింగ్ వద్ద విలువైన స్థలం, ఎంపీడీవో కార్యాలయం వద్ద కోట్లు విలువ చేసే భవనం... ఇలా చెప్పుకుంటూపోతే సొంత యాప్‌ను సృష్టించి అందులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా వీరు సొమ్ములు కొట్టేశారు. ఆ మాటకొస్తే సిండికేట్‌గా ఏర్పడి బెట్టింగులకు యాప్‌లు రెంట్‌కు తెస్తున్న ఈ ఎనిమిది మందికంటే బావా బావమరిది సంపాదించిందే ఎక్కువ.










Comments