పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా
- BAGADI NARAYANARAO

- 3 days ago
- 3 min read
కొలిక్కి వచ్చిన పలాస బంగారు ఆభరణాల కేసు
పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులు
243 గ్రాముల అభరణాలు రికవరీ
2 పిస్టల్స్, నాలుగు కార్లు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని నిత్యానందనగర్ శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాప్‌లో జరిగిన బంగారు ఆభరణాల దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన రామంద్ర సాహు, కున బారిక్, బానోజ్ బెహరా పట్నాయక్, తపన్ మహారాణాతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న పొట్నూరు తిరుమల పాత్రో ఉన్నారు. షాపులో దోపిడీ చేసిన 800 గ్రాముల బంగారు ఆభరణాల్లో 243 గ్రాములు పోలీసులు రికవరీ చేశారు. రూ.3.41 లక్షలు నగదు, 9 ఎంఎం, 7.65 ఎంఎం రెండు పిస్టల్స్‌తో పాటు క్యారిడ్జ్స్‌ను, నాలుగు కార్లు, 12 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దోపిడీకి సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. నిందితులందరూ ఇదే తరహా నేరాలు, దోపిడిలకు పాల్పడిన అనుభవం కలిగివున్నట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. వీరందరిపై ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీ, పోలీసులపై ఫైరింగ్, చోరీ కేసులకు సంబంధించి 32 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసుల్లో కొంతమంది నిందితులు ఇప్పటికే జైల్‌కు వెళ్లి వచ్చినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నేరాలను ప్రణాళికాబద్ధంగా, సాంకేతిక పద్ధతులను వినియోగించడం, పట్టుబడకుండా తప్పించుకునేందుకు మార్గాలు అనుసరిస్తుంటారని, వీరి నేరచరిత్రపై మరింత సమాచారం సేకరించేందుకు ఒడిశా పోలీసులతో సమన్వయం చేస్తూ దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
దోపిడీ ఇలా చేశారు
గత నెల 7న దోపిడీ జరిగినట్టు శ్రీ వెంకటేశ్వర జువెలరీ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రామకృష్ణ ఒక్కరే షాప్‌లో ఉంటారని గుర్తించిన ఏడుగురు వ్యక్తులు నెంబర్ ప్లేట్లు లేని మూడు మోటార్ సైకిళ్లపై షాప్ వద్దకు వచ్చారు. వారు తమను జీఎస్టీ అధికారులుగా చెప్పుకుని షాప్ తనిఖీ చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. షాప్ లోపలికి వెళ్లిన తర్వాత నిందితులంతా చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు ధరించి అక్కడ ఉన్న సీసీ కెమెరాలపై నల్ల స్ప్రే చేసి రికార్డు కాకుండా చూసుకున్నారు. అనంతరం యజమాని చేతులకు బేడీలు వేసి పిస్టల్స్‌తో బెదిరించి షాపులోని బంగారు ఆభరణాలను దోచుకుని వాహనాల్లో పరారయ్యారు.
ఇలా ప్లాన్ చేశారు
బంగారం దుకాణంలో దోపిడి చేయాలనే ఉద్దేశంతో కాశీబుగ్గకు చెందిన తిరుమల పాత్రోతో కలిసి ఏ2 నిందితుడు 2023 నుంచే పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మిగతా నిందితులను కాశీబుగ్గకు తీసుకువచ్చి గోల్డ్ షాప్‌పై మరోసారి రెక్కీ నిర్వహించారని, కాశీబుగ్గలో నివసిస్తున్న తిరుమల పాత్రో షాప్‌లో దోపిడి చేయడానికి అవసరమైన రూట్‌మ్యాప్‌ను, ఇతర వివరాలను నిందితులకు అందించి సహకరించాడన్నారు. నేరానికి ముందు, తర్వాత సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు టోల్ గేట్ల మార్గాలను తప్పించుకునేందుకు, నిందితులు భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఖుర్దా, ఆస్కా, దిగబండి, మహేంద్రగిరి, లావణ్యకోట, గండహాతి, గారబంద, గొప్పిలి, పెదంచల, చినంచల, కేదారిపురం మార్గంగా ప్రయాణించినట్లు తెలిపారు. మొత్తం మూడు మోటార్ సైకిళ్లతో పాటు ఒక కారులో ప్రయాణించినట్టు తెలిపారు. కారును కేదారిపురం గ్రామం సమీపంలోని లేఅవుట్‌లో నిలిపి, అక్కడి నుంచి మోటార్ సైకిళ్లపై కాశీబుగ్గ పట్టణానికి చేరుకున్నారు. రెక్కీ చేసిన గోల్డ్ షాపులోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారైనట్లు వివరించారు.
కేసును ఇలా ఛేదించారు
కేసును స్పెషల్ టీమ్‌లను నియమించి పూర్తిగా సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించినట్టు తెలిపారు. నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. ఆ వాహనాల్లో ఒక కారుకు సంబంధించిన వివరాలు సేకరించగా, ఆ కారు మొదట మహీంద్రా ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసినట్టు ఆధారం లభించిందని, రుణం చెల్లించకపోవడంతో మహీంద్రా ఫైనాన్స్ సంస్థ ఆ కారును స్వాధీనం చేసుకుని వేలం ద్వారా విక్రయించిందన్నారు. ఆ వేలంలో ప్రీతి రంజన్ దాస్ అనే వ్యక్తి కారును కొనుగోలు చేసి, తర్వాత నిందితుడు రామచంద్ర సాహుకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం రామచంద్ర సాహు సూచన మేరకు నిందితుడు బానోజీ బెహరా ఒడిశా రాష్ట్రం బలంగిరి గ్రామంలో ఉన్న మహీంద్రా డంపింగ్ యార్డ్ నుంచి ఆ కారును తీసుకువచ్చినట్టు తెలిపారు. కారును తీసుకువచ్చిన సందర్భంగా బానోజీ బెహరా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ వివరాలను మహీంద్రా డంపింగ్ యార్డ్ వద్ద నమోదు చేయించినట్టు తెలిపారు. వివరాల ఆధారంగా, సాంకేతిక సాక్ష్యాల ద్వారా మిగతా నిందితుల ఫోన్ నెంబర్లను గుర్తించి, కేసును పూర్తిగా ఛేదించినట్టు తెలిపారు.
ప్రతిభకు ప్రశంస
ఈ కేసును అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సబ్ డివిజనల్ అధికారి టి.భవాని సూచనల మేరకు ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో పోలీసు అధికారులు, సిబ్బంది క్రియాశీలంగా పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసును పరిష్కరించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం సీఐలు వై.రామకృష్ణ, ఎం.చిన్నన్నాయుడు, కాశీబుగ్గ ఎసఐలు ఆర్.నరసింహమూర్తి, ఎన్.సునీల్, పాతపట్నం ఎసఐ కె.మధుసూదనరావు, రాజేష్, సీసీఎస్ ఎసఐ, కంచిలి ఎసఐ పారినాయుడు, గార ఎసఐ సీహెచ్ గంగరాజ, హెచ్‌సీ గవరయ్య, కానిస్టేబుల్స్ ఉషాకిరణ్, ఎం.నీలకంఠం, మాధవ్, అలీ, శణ్ముఖరావు, భాసీర్, లోకనాథం, రాధాకృష్ణ, హరీష్. ఐటి కోరే సిబ్బంది హెచ్సీ యం.శ్రీధర్‌కుమార్, పీసీలు డి.కె.జె.భరత్‌రెడ్డి, యస్.నరేష్ పాల్గొన్నారు.






Comments