top of page

పాలకులకే మళ్లీ పట్టం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 4 min read
  • తమిళనాట డీఎంకే మెడపై విజయ్ పార్టీ కత్తి

  • నాలుగోసారి మమతను సీఎం చేయనున్న బెంగాల్

  • అసోంలో మరోసారి కాంగ్రెస్‌కు శంగభంగం

  • కేరళంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య తేడా ఒక్క శాతమే

  • నాలుగు రాష్ట్రాల ఓటరు నాడిపై అంచనాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కేరళం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి.. అలాగే తూర్పు భారతంలో కీలకమైన పశ్చిమ బెంగాల్‌తోపాటు అసోం రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు నామినేషన్ల ఘట్టాలు, ప్రచారం ముమ్మరంగా సాగుతుంటే మరోవైపు ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న రాజకీయ చర్చలు, సంవాదాలు జోరందుకున్నాయి. పుదుచ్చేరి సంగతెలా ఉన్నా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్సుకత, ఉత్కంఠ రేపుతున్నాయి. సరిగ్గా ఇదే విషయంలో ఓటర్ల మనోభావాలను అంచనా వేసేందుకు అనేక సంస్థలు ముందస్తు సర్వే నిర్వహించి.. ఓటర్ల నాడిని తమ శక్తి మేరకు విశ్లేషించి ప్రజల్లోకి వదులుతున్నాయి. అదే క్రమంలో ఇటువంటి సర్వేల నిర్వహణల అపార అనుభవం కలిగిన హైదరాబాద్‌కు చెందిన శ్రీఆత్మసాక్షి సంస్థ ప్రముఖ ఐఐటీయన్లతో కలసి ఆ నాలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై విస్తత సర్వే నిర్వహించింది. ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా కాకుండా నేరుగా క్షేత్రాస్థాయిలోకి వెళ్లి వేలసంఖ్యలో సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం మార్చి 27నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే.. నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుత పాలకుల వైపే ఓటర్లు మొగ్గు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే తమిళనాడులో ప్రస్తుతానికి పాలక డీఎంకేకే అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త పార్టీ అయిన టీవీకే చీల్చే ఓట్లపై ఇది ఆధారపడి ఉంటుందని తేలింది. ఇక కేరళంలో రెండు ప్రధాన కూటముల మధ్య హోరా హారీ పోరు సాగుతున్నది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఒక్క శాతం మాత్రమేనని ఈ సర్వే అంచనా వేసింది. అసోంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీవైపే పూర్తి మొగ్గు ఉంది. ఈ ఎన్నికలు జాతీయస్థాయి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏమాత్రం మైలేజి ఇచ్చే సూచనలు కనిపించడంలేదు. రాష్ట్రాలవారీగా పరిస్థితి చూస్తే..

తమిళనాట ‘విజయ’ ఫ్యాక్టర్

ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల మధ్యే పోటీ కేంద్రీకతమై ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా వీటి పంచనే చేరి అదష్టాన్ని పరీక్షించుకుంటుంటాయి. కానీ ఈసారి ప్రముఖ నటుడు థళపతి విజయ్ నేతత్వంలో కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీ బరిలోకి దిగి ప్రధాన కూటములను సవాల్ చేస్తోంది. సినిమా ఛరిష్మా మెండుగా ఉన్న విజయ్ పార్టీ అధికారంలో వస్తుందన్న అంచనాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ అయితే కింగ్ మేకర్‌గా మారవచ్చు లేదా ఓట్ల చీలిక సష్టించి అధికార పార్టీ అవకాశాలనైనా దెబ్బతీయవచ్చని ఈ సర్వే అంచనాలను బట్టి అర్థమవుతోంది. మామూలుగా అయితే సీఎం స్టాలిన్ నేతత్వంలోని డీఎంకేకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ పార్టీ నేతత్వంలోని కూటమి 40 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా ఏఐఏడీఎంకే కూటమికి 38 శాతం, టీవీకేకు 14 శాతం, ఇతరులకు ఆరు శాతం ఓట్లు లభించవచ్చని అంచనా. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి 119-128, ఏఐఏడీఎంకే కూటమి 108-117, టీవీకే 5-9, ఇతరులు 1-3 సీట్లు సాధించవచ్చు. అయితే సినీనటుడు విజయ్ పార్టీ కనుక 14 శాతానికి మించి ఓట్లు సాధిస్తే మాత్రం డీఎంకేకు కష్టమే. 18 శాతం ఓట్లు సాధిస్తే మొగ్గు డీఎంకే నుంచి ఏఐఏడీఎంకే వైపు మారిపోతుందని ఈ సర్వే అంచనాలు వెల్లడిస్తున్నాయి.

బెంగాల్ మళ్లీ దీదీదే..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ఈసారి పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి 2019 పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వా 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బెంగాల్‌ను టార్గెట్ చేసిన కాషాయసేన తణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెట్టింది. కానీ వాటన్నింటినీ తట్టుకుని మమత మళ్లీ ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మమతను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజల ఆలోచన మాత్రం వేరేగా ఉన్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి. కొద్దిగా సీట్లు తగ్గినా వరుసగా నాలుగుసారీ మమత పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని అంచనా. ఈసారి టీఎంసీకి 45.5 శాతం, ఓట్లు లభించవచ్చు. అదే సమయంలో బీజేపీ కూటమి 40.5 శాతం వద్దే ఆగిపోయే సూచనలు ఉన్నాయి. సీపీఎం, కాంగ్రెస్‌లో వరుసగా 3.5 శాతం, 3 శాతం ఓట్లు ఓటు షేర్ మాత్రమే సాధించవచ్చు. ఈ అంకెలనే సీట్లలోకి మారిస్తే 294 సీట్లకు గాను టీఎంసీ 178-198, బీజేపీ కూటమి 100-110, సీపీఎం 1-2, కాంగ్రెస్ 0-1, ఇతరులు 2-6 మధ్య సీట్లు మాత్రమే సాధించే సూచనలు ఉన్నాయి. బీజేపీకి ఛరిష్మా కలిగిన నాయకత్వం లేకపోవడానికి తోడు బెంగాల్‌లో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లిం, మహిళా ఓటర్లలో టీఎంసీకి తరగని ఆదరణ ఆ పార్టీని వరుసగా నాలుగోసారి అధికారంలోకి తీసుకురావచ్చని అర్థమవుతున్నది.

అసోంలో మళ్లీ కమల వికాసమే

ఈశాన్య భారతంలో కీలకమైన అసోం రాష్ట్రంలో బీజేపీ(ఎన్డీయే కూటమి) తన అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా పురోగమిస్తున్నది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో సానుకూలత కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు నగదు బదిలీ పథకాలు మహిళల్లో ఎన్డీయే సర్కారు పట్ల ఆదరణ పెంచాయి. దీనికితోడు కాస్త వీక్‌గా ఉన్న ఎగువ అసోం ప్రాంతంలో బీజేపీ సంస్థాగతంగా పటిష్టపడటం ఎన్డీయే విజయానికి దోహదం చేస్తాయి. మరీ ముఖ్యంగా అనధికార వలసలను నియంత్రించడం, శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటం వంటి అంశాలు ఎన్డీయేకు కలిసి వస్తున్న అంశాలు. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 45 శాతం ఓటు షేర్ పొందనుండగా కాంగ్రెస్ కూటమి 40 శాతం, ఇతరులు 7.5 శాతం ఓట్లు పొందనున్నారు. కాగా ఎవరికి ఓటు వేయాలన్నది ఇప్పటికీ తేల్చుకోని ఓటర్లు మరో 7.5 శాతం వరకు ఉండటం విశేషం. వీరిలో మెజారిటీ ఓటర్ల మొగ్గును బట్టి ఫలితం అంచనాలు మారే అవకాశం ఉంది. అసోం అసెంబ్లీలో 126 సీట్లు ఉండగా వాటిలో ఎన్డీయే 76-81, కాంగ్రెస్ కూ{మి 45-50, ఇతరులు 5`9 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా.

లెఫ్ట్, రైట్ హోరా హారీ

దక్షిణాదిలో చివరి రాష్ట్రమైన కేరళంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ఎప్పటిలాగే హోరా హారీ పోరు సాగుతోంది. సాధారణంగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఎన్నికల్లో తమ తీర్పును మార్చుకుంటుంటారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో కూటమికి అధికారం కట్టబెట్టడానికి కషి చేస్తుంటారు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఇది ఒక సంప్రదాయంగా వస్తున్నది. ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష కూటమే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని అంచనా. అయితే అధికారాన్ని కాపాడే విషయంలో ఆ కూటమికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ రెండు కూటముల మధ్య ఓట్లలో ఒక్క శాతం తేడాయే కనిపిస్తున్నది. ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉన్నందున ఈ కాలంలో ఏమాత్రం పరిస్థితులు మారినా ప్రజాతీర్పు కూడా మారిపోవచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం అధికార ఎల్‌డీఎఫ్(లెఫ్ట్ ఫ్రంట్)కు 39 శాతం, యూడీఎఫ్ (కాంగ్రెస్ కూటమి)కు 38 శాతం, బీజేపీకి 14 శాతం, ఇతరులకు ఆరు శాతం ఓటు షేర్ లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్‌డీఎఫ్ 69-73, యూడీఎఫ్ 67-72, బీజేపీ 3-4, ఇతరులు 1-2 మధ్య సీట్లు సాధించవచ్చని తాజా సర్వే అంచనా వేసింది. అయితే ఇవన్నీ సర్వే చేసిన సమయంలో ఉన్న పరిస్థితులు, ప్రజలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే పోలింగ్ జరిగే నాటికి పరిస్థితులు, ప్రజల మనోగతంలో మార్పులు రావచ్చు.. తదనుగుణంగా ఓటరు తీర్పు కూడా మారిపోయే అవకాశం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page