top of page

సామాన్యుడే ‘శర’మెత్తితే..!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 2 min read
ఎంపీ ‘రాఘవు’డి గళంలో ప్రజావాణి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

  • జననం నుంచి మరణం వరకు ప్రతి అడుగులోనూ పన్ను చెల్లించాల్సిన దుస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో అదే ప్రజలకు ఈ నిలువు దోపిడీ ఏమిటి?

  • ఫోను మనదే.. అందులోని సిమ్ కార్డూ మనదే.. కానీ దాన్ని రీఛార్జి చేయడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా కట్ చేసే అధికారాన్ని టెలికాం కంపెనీలకు ధారాదత్తం చేయడమేమిటి??

  • ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. కానీ పదవుల్లోకి వచ్చాక ఇక ఐదేళ్లూ తమనెవరూ ఏం చేయలేరన్న ధీమా తలకెక్కి హామీలను గాలికొదిలేస్తున్నారు. సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీనికి కారణం ఐదేళ్ల వరకు వారిని కదిలించే అధికారం ఓటేసిన ప్రజలకు లేకపోవడమే. తమకు నచ్చని ప్రజాప్రతినిధిని వెనక్కి పిలిపించే(రీకాల్) అధికారాన్ని గెలిపించిన ఓటర్లకే ఎందుకు ఇవ్వకూడదు.. ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు ఆలోచించడంలేదు???

ఇలా ఒకటేమిటి.. ఇటీవలి కాలంలో పార్లమెంటులో పెద్దల సభగా పేరుగాంచిన రాజ్యసభ ఇలాంటి అనేకానేక ప్రశ్నల శరాలు, నిలదీతలతో ప్రతిధ్వనిస్తున్నది. ప్రజలకు సంబంధించిన ఈ తరహా మౌలిక సమస్యలు, అంశాలపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు చాలా అరుదు. ఒకరో ఇద్దరో.. అప్పుడో ఇప్పుడో.. అన్నట్లు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఉండవచ్చు గానీ.. ఇంత తీవ్రంగా.. ముక్కుసూటిగా.. సమస్య పర్యవసానాలను పరిపూర్ణంగా వివరిస్తూ మొత్తం సభతోపాటు దేశం దష్టిని ఆకర్షించిన వారు బహుశా ఎవరూ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒకే ఒక్కడు ఆ పని చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిగ్గదీస్తున్నాడు. తాము ఇన్ని రకాలుగా బాధితులుగా మిగిలిపోతున్నామా? అని తన ప్రస్తావనలు విని ప్రజలే విస్మయం చెందే రీతిలో సామాన్యుడి ప్రతినిధిగా.. అసామాన్యంగా ప్రశ్నల జడి కురిపిస్తున్నాడు.

సామాన్యుడి ప్రతినిధి

ఇంతకూ ఆయన ఎవరంటే.. ఆయనే రాఘవ్ చద్దా. సామాన్యుడి గళం వినిపిస్తున్న ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా సామాన్యుల పార్టీనే.. అదేనండి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్). ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడు అని అర్థం. తమ పార్టీ పేరును సార్థకం చేస్తూ.. ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న చద్దా ఇటీవల కేంద్ర బడ్జెట్‌పై చర్చల సందర్భంగానూ, ఇతరత్రా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థల్లో చిక్కుకుని సామాన్యులు దోపిడీకి గురవుతున్న తీరును సోదాహరణంగా వివరిస్తూ ప్రభుత్వాన్నే నిరుత్తరురాలిగా చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఆయనేదో చాలా అనుభవజ్ఞుడనుకుంటే పొరపాటే. ఆయన వయసు 37 ఏళ్లే. పంజాబీ అయిన ఈయన ఢిల్లీలో పుట్టిపెరిగారు. చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) చేసి ఆ వత్తినే స్వీకరించారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున దక్షిణ ఢిల్లీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ మరుసటి ఏడాది 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2022 మార్చిలో పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఎంపీ అయిన తర్వాతే 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్నారు. సోనీ టీవీలో వచ్చే ‘ది కపిల్ శర్మ షో’ అనే కార్యక్రమంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ రాజకీయాలంటే తనకు పెద్ద ఆసక్తి ఉండేది కాదని, కానీ అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో భాగస్వామిని కావడం.. ఆ పోరాటం నుంచే అంకురించిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం అంతా అనుకోకుండా జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అవినీతిని ఎదుర్కొనే అజెండాతోనే రాజ్యసభలో సామాన్యుడి గళాన్ని చద్దా వినిపిస్తున్నారు. టోల్‌ట్యాక్స్, ఆదాయ పన్ను, విమానాశ్రయాల్లో స్నాక్స్ ధరల దోపిడీ, శానిటరీ ప్యాడ్స్ విషయంలో మహిళల ఇబ్బందులు, గిగ్ వర్కర్స్ మానసిక, శారీరక క్షోభ, రైట్ టు రీకాల్, ఛార్జీల పేరుతో బ్యాంకుల బాదుడు, దరఖాస్తు ఫీజుల పేరుతో నిరుద్యోగులను దోపిడీ చేస్తున్న తీరు.. ఇలా సర్వజనావళిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక ఇబ్బందులకు, వేదనకు గురిచేస్తున్న అంశాలను చద్దా గళం వినిపిస్తున్నది. వీటిలో కొన్ని అంశాలకు సర్కారు స్పందిస్తుండటం శుభపరిణామం.

ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు.. ప్రజలు బాధుతులవుతున్న తీరును వివరించే కథనాలు ‘సత్యం’ పాఠకుల కోసం రేపటి నుంచి..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page