top of page

పెళ్లి ఓకే.. పిల్లలే వద్దు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 16, 2025
  • 2 min read

‘స్వప్నకుమార్‌ వయసు 35 ఏళ్లు. ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. జీతం ఏడాదికి రూ.30 లక్షలకు పైమాటే. ఎలాంటి దురలవాట్లు లేవు. అయినా తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ దాటేస్తున్నాడు. ఒకసారి నిలదీసి అడిగితే.. తనకు పిల్లలు వద్దనుకుంటున్నానని, అందుకు అంగీకరించే అమ్మాయి కావాలని చెప్పాడు!’ మరో యువకుడు తేజ విషయానికొస్తే.. వివాహమై ఐదేళ్లవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. ఎందుకు ప్రయత్నించడంలేదని అడిగితే తమకు పిల్లలు వద్దనుకుంటున్నామని చెప్పేశాడు. నగరాల్లో నివసిస్తున్న యువతరంలో ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదనలో పడినవారిలో ఇదే ట్రెండ్‌ పెరుగుతోంది. ‘పెళ్లికి ఓకే.. కానీ పిల్లలే వద్దు’ అనే ఈ కొత్త కల్చర్‌నే మరో రకంగా ‘డబుల్‌ ఇన్‌కమ్‌.. నో కిడ్స్‌ (డిరక్‌)’ అని అంటున్నారు. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఈ భావన పెరుగుతోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ కల్చర్‌ ఏటా 30 శాతం వరకు పెరుగుతున్నట్లు అంచనా. నగర జీవనంలో భారీగా పెరుగుతున్న ఖర్చులే దీనికి కారణమని పలువురు చెబుతుండగా.. ఉద్యోగం, ఇతరాత్ర ఒత్తిళ్లతో కూడిన జీవనశైలిలో తమకు నచ్చినట్లు బతికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఓ వైపు పిల్లల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న జంటలు పెరుగుతున్నాయి. మరోవైపు వారసుల కోసం నిరంతరం శ్రమిస్తూ ఆస్తులు కూడబెడుతున్నవారు కనిపిస్తున్నారు. వీటికి పూర్తి విరుద్ధంగా పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఒకప్పుడు అధిక సంతానం కావాలనుకునేవారు. తర్వాత ఒకరు లేదా ఇద్దరే ముద్దు అన్న భావన పెరిగింది. ఇప్పుడు అసలే వద్దు అనుకోవడం దేశ జనాభాపై పెను ప్రభావం చూపకమానదు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో అమల్లో ఉన్న ఈ డిరక్‌ విధానం వల్ల జనాభా రేటు గణనీయంగా పడిపోతోంది. ఇప్పుడిప్పుడే మనదేశంలో మొదలైన డిరక్‌ కల్చర్‌ ఇదే రీతిలో పెరుగుతూ పోతే భవిష్యత్తులో భారత జనాభా కూడా తిరోగమనంలో పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఖర్చులకు భయపడి కొందరు, కెరీర్‌లో ఎదుగుదల కోసం మరికొందరు, ఆర్థిక స్వేచ్ఛ, బాంధవ్యాలకు దూరంగా ఉండాలని ఇంకొందరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పెరిగిన జీవన ప్రమాణాలు, ఖరీదైన విద్య, కళాశాలల ఫీజులు పిల్లల పెంపకాన్ని భారంగా మార్చేసి ఆర్థిక కష్టాలు తెచ్చిపెడతాయని, ఇందుకోసం రాజీపడి బతకాల్సి వస్తుందంటున్నారు. నచ్చిన లైఫ్‌స్టైల్‌ అనుభవించడానికి పిల్లలు అడ్డంకిగా ఈ తరం యువతలో చాలామంది భావిస్తున్నారు. సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులతో కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను చూసి, భవిష్యత్తులో తమ పరిస్థితి కూడా ఇంతే కదా అనే భావన వారి ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. అలాగే పెళ్లిళ్లు చేసుకున్న సహచరులకు ఎదురవుతున్న సమస్యలు వీరిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెళ్లి చేసుకున్న స్వల్పకాలానికే చాలామంది దంపతులు విభేదాలతో విడాకుల వరకూ వెళుతున్నారు. అలాంటివారి పిల్లల పరిస్థితి చూసి కూడా కొందరు పిల్లలు వద్దనుకునే నిర్ణయానికి వస్తున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, నలభై ఏళ్ల వరకూ పిల్లలు కలగకపోవడం వల్ల.. లేటు వయసులో పిల్లలు కలిగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నవారూ ఉన్నారు. జీవన ప్రమాణాలు, ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో భర్త ఒక్కరి సంపాదన సరిపోదని చాలా కుటుంబాలు భావిస్తున్నాయి. దాంతో భార్యాభర్తలిద్దరూ ఏదోరకమైన సంపాదన మార్గంలోకి మరలిపోతున్నారు. పిల్లలు ఉంటే.. తాము ఉద్యోగ వ్యాపకాలకు వెళ్లిన తర్వాత వారి ఆలనపాలన ఎవరు చూస్తారన్న కోణంలోనూ పలువురు పిల్లలు వద్దనుకుంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇటువంటి జంటలనే ‘డిరక్‌ కపుల్‌’ అని వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా 90వ దశకంలో జన్మించిన వారిలోనే ఇలాంటి ధోరణి పెరుగుతోందని, వీరినే జనరేషన్‌ జెడ్‌ అని కూడా అంటారు. ఇద్దరూ ఉద్యోగం చేసుకునే జంటలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సూచిస్తున్నారు. డిరక్‌ కల్చర్‌ పెరగడం వల్ల జనాభా వృద్ధి రేటు పడిపోతుంది. కాలక్రమంలో వృద్ధుల సంఖ్య పెరిగి, యువత తగ్గిపోతుంది. ఇది ఉత్పత్తి సహా చాలా రంగాలను దెబ్బతీస్తుంది. తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముంది. పైగా పిల్లలు లేని దంపతులను వృద్ధాప్యంలో చూసుకునే వారు కరువవుతారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page