పోస్టుమార్టం పేరుతో తప్పులకు సమాధి
- Prasad Satyam
- 3 hours ago
- 2 min read
నలుగురు చనిపోయారని ఊరు కోడై కూస్తున్న పట్టని సర్కారు
ఆ మేరకు తప్పుడు రిపోర్టులు రాయించుకునే ఎత్తుగడ
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణలు
సీదిరి, కష్ణదాస్లతో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘ప్రభుత్వం ఆలోచన ఏంటంటే.. డయేరియాతో ఒక్కడే చనిపోయాడు.. మిగిలినవారు వేరే కారణాలతో చనిపోయారని చెప్పడం. కానీ చనిపోయిన వ్యక్తి భార్యను అడిగితే చెబుతుంది. గత నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో గుమ్మం దాటుతూ చనిపోయాడని! ప్రభుత్వం తన యంత్రాంగానికి ఏం ఆదేశమిచ్చిందో గానీ పోస్టుమార్టం చేస్తామంటున్నారు. వందమంది ఈ ప్రాంతం నుంచి డయేరియాతో ఆస్పత్రిలో ఉండగా.. చనిపోయింది నలుగురైతే, ఇంట్లోవారు, వీధిలోవారు అందరూ వారి మరణించింది వాంతులు, విరేచనాలతోనేనని చెబుతుంటే.. వీరేమో పోస్టుమార్టమంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మీరేం చెబితే అదే రాస్తారు కదా! రిపోర్టులో ఏం వస్తుందో కూడా మాకు తెలుసు. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో చూడండి. ఇంతమంది చనిపోయారనే వార్తను ప్రజలకు తెలియకుండా ఉంచాలనే తాపత్రయంతో ప్రభుత్వం ఉంది తప్ప, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూద్దామనే బాధ్యత, బాధితులను ఆదుకుంటామనే భరోసా ఇవ్వలేకపోతోంది.’
.. ఇవి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు దమ్మలవీధిలో డయేరియా లక్షణాలతో మతిచెందిన లక్ష్మణరావు ఇంటిముందు చేసిన వ్యాఖ్యలు. వైకాపా జిల్లా అధ్యక్షుడు కష్ణదాస్, మాజీమంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి ఆయన బుధవారం గోల్కొండరేవు రోడ్డు, దమ్మలవీధి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఇద్దామని గతంలో జగన్మోహన్‌రెడ్డి సంకల్పిస్తే.. దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం భావించడం చూస్తే వారి ఆలోచనా ధోరణి ఏంటనేది ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఇలాంటి దుర్ఘటన ఇక్కడ మాత్రమే జరగలేదని, రాజమండ్రిలో కూడా ఇలానే ప్రాణాలు కోల్పోయారని మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్లి వచ్చారన్నారు.
రాజధాని తప్ప ఇంకేమీ అక్కర్లేదా?
డిసెంబరులో ఇదే నగరంలోని బలగ ప్రాంతంలో డయేరియా వ్యాప్తిచెంది వందమంది రోగులు ఆస్పత్రి పాలైతే.. వారంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఎవరి బాధలు వారు అనుభవిస్తున్నారని ధర్మాన ఆరోపించారు. వీటి మీద దష్టి సారించకుండా తమది మంచి ప్రభుత్వమంటూ స్టిక్కర్లు అంటించడానికి మాత్రం ఇంటికొకర్ని పంపుతున్నారని విమర్శించారు. ఎంతసేపూ రాజధాని పేరుతో డబ్బంతా అక్కడే పెట్టి మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ అన్ని రంగాలను వదిలేశారని ధర్మాన అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి వెళితే.. రోగులకు మందు బిళ్ల ఇచ్చే దిక్కు లేకుండాపోయిందని, వాస్తవానికి శ్రీకాకుళంలో ఉన్నది మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్న విషయం ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. పేషెంట్లు చేరుతామంటే పని చేయడానికి ప్రభుత్వాస్పత్రులు లేకుండా చేసి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. నదిలో మేజర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్న ప్రాంతాల్లో ఒక్కోదాని పరిధిలో 15 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయడానికి వీలుగా పూడిక తీయడం మానేసి వేరేచోట ఇసుక బెడ్స్ తవ్వుకుపోతున్నారని ధర్మాన ఆరోపించారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, లోకేష్ సిఫార్సు చేసినవారికి ఈ పనులు కట్టబెడుతున్నారన్నారు. గార ప్రాంతంలో ఉన్న తాగునీటి పథకం నుంచి గత పది రోజులుగా ఎర్రటి నీరు వస్తున్నదని, రాబోయే రోజుల్లో అక్కడ కూడా డయేరియా కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదన్నారు. అనుమతులు లేని ఇసుక తవ్వకాలే దీనికి కారణమని ఆయన ఆరోపించారు.
కార్పొరేషన్‌ను ప్రైవేటు వ్యవస్థగా మార్చేశారు
కార్పొరేషన్‌ను ప్రైవేటు వ్యవస్థగా మార్చేశారని, వారు చెప్పిన వ్యక్తులే టెండర్లు వేయాలనే హుకుం జారీ చేస్తున్నారని, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇలా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మంచి ప్రభుత్వం అంటూ బలవంతంగా డోర్లకు స్టిక్కర్లు అంటించడం కాదని, ప్రజల గుండెల్లో ఉండాలని ధర్మాన అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే కిందిస్థాయి పరిపాలన వ్యవస్థను గాలికొదిలేశారని, సమస్యలేవీ లేనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. యూరియా బస్తా దగ్గర్నుంచి ఇంగ్లీష్ మీడియం చదువు వరకు రాష్ట్రంలో మధ్యతరగతికి చెందిన ప్రతిఒక్కరు బోరున ఏడుస్తున్నారని ధర్మాన అన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని, రెండు కిలోలు ఎక్కువ తీసుకున్నా పట్టించుకోవడం లేదని, మున్సిపాలిటీ డబ్బంతా దొంగల చేతుల్లోకి వెళ్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు శ్రీకాకుళంలో కనీసం వెయ్యి కోట్లయినా ఖర్చు చేశారా? అని ధర్మాన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు వెంటబెట్టే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఎంవీ పద్మావతి, అంధవరపు సూరిబాబు, ఎంవీ స్వరూప్, మామిడి శ్రీకాంత్, గేదెల పురుషోత్తం, కోణార్క్ శ్రీను, చల్లా శ్రీను, మండవిల్లి రవి, షుఖుర్‌ఖాన్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయిక్, సర్పరాజ్ మొహమ్మద్, భైరి మురళీ, పొన్నాడ రుషి, వైశ్యరాజు మోహన్, రౌతు శంకర్‌రావు, గద్దెబోయిన శ్రీనివాసరావు, డాక్టర్ చింతాడ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.






Comments