పట్టా ఉందని చెబుదాం.. రిజర్వ్ సైట్లను పట్టేద్దాం!
- NVS PRASAD

- Nov 10, 2025
- 2 min read
పట్టణంలో అన్యక్రాంతమవుతున్న ఖాళీ స్థలాలు
చేష్టలుడిగి చోద్యం చూస్తున్న యంత్రాంగం
ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు
తాజాగా గూనపాలెంలో ప్రహరీ పగులగొట్టి చొరబాటు
స్థానికులు నిలదీయడంతో పలాయనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అప్పారావ్ ఆరెకరాలు ఆక్రమించాడు.. ఏమీ పీకలేకపోయారు.
సుబ్బారావ్ మూడెకరాలు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కట్టేసినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేకపోయారు.
ఫలితం.. ‘ఇప్పుడు నేనూ అదే చేస్తా.. ఎవడడుగుతాడో చూస్తా’ అని పెచ్చరిల్లే వారి ఆగడాలు నగరంలో పెరిగిపోయాయి.
ఏం జరిగినా కచ్చితంగా రాజకీయ నాయకుల దృష్టిలో ఉంటుందని, వారు కన్ను చేరేయడం వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఈ దందాలను నిస్సహాయంగా చూస్తున్న నగర ప్రజలు భావిస్తుంటే.. స్థానిక ఎమ్మెల్యేకు తెలిసినా ఏమీ చేయలేరన్న ధీమాతో అక్రమార్కులు బరి తెగించేస్తున్నారు. బలగ ఆదివారంపేట దగ్గర్నుంచి కొత్తరోడ్డు వరకు ఉన్న నాగావళి నది వరదగట్టును ఆక్రమించేసి కంచె కట్టినవారిని ఇంతవరకు రెవెన్యూ యంత్రాంగం ఏమీ చేయలేకపోయింది. రికార్డులు ట్యాంపర్ చేసి, జిరాయితీ భూమి మాదిరిగా ప్రభుత్వ చెరువును పంచేసుకున్నా అడిగేవాడు లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా మున్సిపల్ రిజర్వ్ సైట్‌లనే కబ్జా చేయడానికి అక్రమార్కులు రంగంలోకి దిగిపోయారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ స్పష్టంగా ఉన్నా నగరపాలక సంస్థ నుంచి లీజుకు తీసుకున్నామని చెప్పుకుంటూ రిజర్వ్ సైట్లను చదును చేస్తున్నా అధికార యంత్రాంగానికి తెలియడంలేదు. స్థానిక కిమ్స్ ఆస్పత్రి ఎదురుగా సర్వే నెంబరు 80లో ప్రభుత్వ చెరువు ఉంటే.. అందులో పట్టా ఇచ్చారని చెప్పుకొంటూ మూడు భవనాలు కట్టేస్తున్నా నగరపాలక సంస్థ స్పందించలేదు.
రిజర్వ్ సైట్‌లో ప్రైవేట్ పొక్లెయిన్
ఇలాంటివన్నీ పేపర్లలో చదివి తెలివిమీరిపోయిన మరికొందరు ఖాళీగా కనిపిస్తున్న రిజర్వు సైట్లు కొట్టేసినా అడిగేవారుండరన్న ధైర్యంతో తెగిస్తున్నారు. గూనపాలెం శాంతినికేతన్ జూనియర్ కళాశాల వెనుక నగరపాలక సంస్థకు చెందిన రిజర్వ్ సైట్ ఉంది. ఇది కాకివీధి ఎ`బ్లాక్ కిందకు వస్తుంది. అప్పట్లో రిజర్వ్ స్థలాలను సంరక్షించాలని సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇవ్వడంతో అన్యాక్రాంతమైన రిజర్వ్ సైట్లను వదిలేసి మిగిలిన స్థలాలకు నగరపాలక సంస్థ ప్రహరీలు కట్టించింది. అందులో భాగంగానే గూనపాలెంలో ఉన్న రిజర్వ్ సైట్‌కు కూడా ప్రహరీ వచ్చింది. అయితే తాజాగా ఒక వ్యక్తి తాను నగరపాలక సంస్థ నుంచి రిజర్వ్ సైట్‌ను లీజుకు తీసుకున్నానంటూ ఏకంగా పొక్లెయిన్ పెట్టి ఆదివారం చదును చేయడం కనిపించింది. రిజర్వ్ సైట్ లీజుకు ఇవ్వడం కుదరదని, అటువంటి పత్రం కమిషనర్ ఇచ్చి ఉంటే చూపించాలని స్థానికులు గట్టిగా అడగడంతో సదరు వ్యక్తి పొక్లెయిన్‌తో అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే ఈలోగానే ప్రహరీలో కొంత భాగాన్ని తొలగించి పొక్లెయిన్‌ను లోపలికి తీసుకువెళ్లారు. ఇంత జరిగినా మున్సిపల్ అధికారులు మాత్రం దీని మీద చర్యలు తీసుకోడానికి వెనుకాడుతున్నారు. రిజర్వ్ సైట్ ఎవరికీ లీజుకు ఇవ్వలేదని చెప్పడం మినహా ప్రహరీని పడగొట్టి పొక్లెయిన్‌తో స్థలంలోకి చొరబడిరది ఎవరని విచారణకు పూనుకోకపోవడం విచారకరం.










Comments