పట్టాలిచ్చారు.. మళ్లీ వెనక్కు తీసుకున్నారు!
- BAGADI NARAYANARAO

- Oct 9, 2024
- 2 min read
లేఅవుట్ లేనిచోట అర్హులకు స్థలాలు
వైకాపా నాయకులకు బినామీ పేర్లతో పట్టాలు
ప్రభుత్వ స్థలమున్నా ప్రైవేటుకు లబ్ధి
అమ్మేసుకుంటున్న వైకాపా నాయకులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పథకాలు ప్రారంభించి అమలుచేస్తుందో వాటి ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. స్థానిక నాయకుల జోక్యం వల్ల వాస్తవ లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. వైకాపా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా జగనన్న కాలనీల పేరుతో అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు కొనుగోలు చేసింది. తీరా ప్రక్రియ పూర్తిచేసి ఇళ్ల స్థలాలు కేటాయించే సమయానికి లబ్ధిదారుల జాబితాలను స్థానిక నాయకులు మార్పులు చేసి అనర్హుల చేతిలో పెట్టేశారు. ఇది కొన్నిచోట్ల పరిధి దాటిపోయింది.
పొందూరు మండలం తోలాపి గ్రామంలో నిరుపేదల కోసం అప్పటి ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకుల సూచనలతో సర్వే నెంబర్ 174/5, 6లో 1.73 ఎకరాల భూమిని ఇద్దరు రైతుల నుంచి కొనుగోలు చేశారు. గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 101లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కాదని చెరువు గర్భంలో జిరాయితీ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైన 1.73 ఎకరాల భూమిని ఇద్దరు రైతుల నుంచి కొనుగోలు చేయించారని ఆరోపణలు వినిపించాయి. గ్రామంలో దీన్ని కొందరు వ్యతిరేకించినా స్థానిక వైకాపా నాయకుల సూచనలతో రెవెన్యూ అధికారులు కొనుగోలు చేశారని విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా రెవెన్యూ అధికారులు కొనుగోలు చేసిన 1.73 సెంట్ల భూమి కూనవాని చెరువు గర్భంలో ఉంది. వైకాపాలో మరో వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో తహసీల్దారు రామకృష్ణతో పాటు వీఆర్వో రంగారావుతో కలిసి వైకాపా నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రభుత్వం భూమి కొనుగోలుకు విడుదల చేసిన డబ్బులను నొక్కేశారని గ్రామంలో ఇప్పటికీ చర్చ నడుస్తుంది. అధికారులు అప్రూవల్ ఇచ్చిన తర్వాత లే`అవుట్ వేసి స్థానిక నాయకులు సూచించిన వారికి పట్టాలు ఇచ్చేశారు.
పట్టాలు చేతిలో పెట్టి స్థలం ఇవ్వలేదు
ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులను ఎంపిక చేసినా కొందరికి పట్టాలు ఇచ్చి స్థలం చూపించలేదని ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు కొందరిని తొలగించి వైకాపా నాయకులు కుటుంబ సభ్యుల పేరుతో పాటు గ్రామంలో పక్కా ఇళ్లు కలిగి ఉన్నవారిని జాబితాలో చొప్పించి కొత్తగా పట్టాలు మంజూరు చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్ 174/5, 6కి ఆనించి ఉన్న 30 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని జగనన్న కాలనీ కోసం అధికారులు సేకరించినా లే`అవుట్ వేయలేదు. లే`అవుట్ వేయని ప్రాంతాన్ని చూపించి పట్టాలు ఇచ్చినవారికి అక్కడ ఇంటి స్థలం కేటాయిస్తామని మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు. అనర్హులకు జగనన్న పట్టాలు చేతిలో పెట్టి లే`అవుట్ వేసిన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. వాస్తవంగా గ్రామంలో వైకాపాలో రెండు వర్గాల ఆధిపత్యం కారణంగా అర్హులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువు గర్భాన్ని ఆక్రమించి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చొప్పించిన వారి నుంచి జగనన్న లే`అవుట్ కోసం భూమి కొనుగోలు చేసి కొందరు వైకాపా నాయకులు లబ్ధి పొందారు. గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, దాన్ని విస్మరించి చెరువు గర్భంలో ఉన్న జిరాయితీని కొనుగోలు చేసి దానికి చట్టబద్ధత కల్పించారు. దీనికి ఆనుకొని భూములున్నవారికి ధర పెంచుకోవడానికి వైకాపాలో ఒక వర్గం చేసిన ప్రయత్నాలు ఫలించాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అనర్హులంతా ఇళ్లపట్టాలను విక్రయించి సొమ్ములు చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. వైకాపా నాయకులు కూడా వారి కుటుంబం పేరుతో కేటాయించుకున్న స్థలాలను అమ్మేశారని ఆరోపణలున్నాయి.
చెరువు గర్భాన్ని ఆక్రమించి

తోలాపి రెవెన్యూ పరిధిలో 174/1లో కూనవాని చెరువు ఉంది. ఈ చెరువు క్రమేపీ కుదించుకుపోవడంతో గ్రామానికి చెందిన రైతులు ఆక్రమించుకొని సబ్ డివిజన్ చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. చెరువు గర్భంలో రెండు ఎకరాలు గ్రామానికి చెందిన ఒక పెద్ద రైతు ఆయన భార్య పేరుతో రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత స్వాధీన హక్కులు పొందారు. అందులో భాగంగానే కూనవాని చెరువుకు తూర్పు భాగాన సర్వే నెంబర్ 174/27లో రెండు ఎకరాల చెరువు గర్భాన్ని 15 ఏళ్ల క్రితం దళితుల కోసం ఇందిరమ్మ కాలనీకి సేకరించారు. ప్రస్తుతం ఇది ముళ్లపొదలతో నిండివుంది. ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లడానికి అంగీకరించకపోవడంతో దీన్ని జగనన్న కాలనీ కోసం వినియోగించాలని వైకాపాలో ఒక వర్గం ఒత్తిడి చేసినా దాన్ని తప్పించారు. దీనికి కారణం ఈ భూమి పెనుబర్తి గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారని విశ్వసనీయ సమాచారం. గ్రామంలో నాయకులుగా చలామణి అవుతున్నవారంతా ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారితో కలిసి నడవడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామంలో అన్ని ప్రధాన పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం మొదటి నుంచి అలవాటే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొందరు నాయకులు కండువాలు మార్చుతుంటారు. ఆయా పార్టీల్లో వీరే గ్రామాల్లో చక్రం తిప్పుతుంటారు. అందులో భాగంగానే జగనన్న కాలనీలో నాయకులు చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.










Comments