పడిపోతున్న సంతానోత్పత్తి రేటు
- DV RAMANA

- Jun 11, 2025
- 2 min read

భారతదేశ జనాభా విషయంలో చిత్రమైన గణాంకాలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకవైపు ప్రపంచ జనాభాలో మనమే అగ్రస్థానంలో ఉన్నామని చెబుతున్న ఐక్యరాజ్యసమితి.. మరోవైపు దేశంలో జనాభా సర్దుబాటు రేటు తగ్గుతోందని హెచ్చరిస్తోంది. ఇక జనాభాను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం జనాభా పెరుగుదలకు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిణామాలను విశ్లేషిస్తే వేర్వేరు కారణాలు ఈ పరిస్థితులకు దోహదం చేస్తున్నాయని అర్థమవుతోంది. ఈ ఏడాది మనదేశ జనాభా 146 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వార్షిక జనాభా నివేదిక పేర్కొంది. అయితే దేశంలో రీప్లేస్‌మెంట్ రేటు కంటే సంతానోత్పత్తి రేటు తగ్గిపోతున్నట్లు వెల్లడిరచింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (ఎస్‌ఓడబ్ల్యూపీ) నివేదిక సంతానోత్పత్తి తగ్గడం వల్ల కలిగే భయాందోళనల నుంచి పునరుత్పత్తి లక్ష్యాలు సాధించడం వైపు దృష్టి మరల్చాలని పిలుపునిచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని నివేదిక పేర్కొంది. తక్కువ జనాభా లేదా అధిక జనాభా.. అనేది నిజమైన సంక్షోభం కాదని, సంతానోత్పత్తి తగ్గడమే అసలైన సంక్షోభమని యూఎన్ రిపోర్టు వివరించింది. దేశంలో సంతానోత్పత్తి రేటు సగటున 1.9 జననాలకు తగ్గిందని.. ఇది వాస్తవ సగటు 2.1 కంటే తక్కువని పేర్కొంది. జననాల రేటు మందగించినప్పటికీ దేశంలో యువ జనాభా గణనీయంగానే ఉంది. 0-14 ఏళ్ల వయస్కులు 24 శాతం, 10-19 మధ్య వయస్కులు 17 శాతం, 24 ఏళ్లలోపు వయస్కులు 26 శాతం మంది ఉన్నారు. 68 శాతం దేశ జనాభా (15`64 మధ్య వయస్కులు) పని చేసే సామర్థ్యం కలిగి ఉంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా ఏడు శాతమే ఉంది. అయితే ప్రజల ఆయుఃప్రమాణం మెరుగుపడటంతో రానున్న రోజుల్లో జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం దేశ జనాభా 170 కోట్లకు చేరిన తర్వాతే తగ్గుముఖం పడుతుందని, 40 ఏళ్ల తర్వాతే ఇది సాధ్యమవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ జనాభా నియంత్రణకు అనేక చర్యలు చేపడుతోంది. అయితే దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇది ఐక్యరాజ్య సమితి నివేదికకు అనుగుణంగా కనిపిస్తోంది. సంతానోత్పత్తి రేటు తగ్గి రాష్ట్ర జనాభా తగ్గుతుండటంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాంతో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి దీన్ని సూచనప్రాయంగా ప్రస్తావించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ గతంలో చట్టాన్ని సవరించారు. ఇప్పుడు దాన్ని మళ్లీ సవరించే అవకాశం ఉంది. సంతానోత్పత్తి రేటు పెంచడానికి వీలుగా పెద్ద కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి ఆర్థిక సహాయం అందించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాల జనాభా దృష్ట్యా విధానాల్లో మార్పు అవసరమని అన్నారు. ప్రస్తుత సంతానోత్పత్తి రేటు ఇలాగే కొనసాగితే రాష్ట్రం తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన జరిగే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా జాతీయ కార్యక్రమంగా అమలు చేస్తున్న జనాభా నియంత్రణను ఉత్తరాది రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ రాష్ట్రాల్లో జనాభా రేటు పెరుగుతూ పోతోంది. అదే కు.ని. కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. ఇది ఉత్తర, దక్షిణ భారతాల మధ్య పథకాల నిర్వహణ, నిధుల మంజూరు, మౌలిక సౌకర్యాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కొన్ని రాష్ట్రాలు జనాభా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సిక్కిం ప్రభుత్వం 2023 నుంచి ఈ చర్యలు చేపట్టింది. అధిక సంతానానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. మిజోరం కూడా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని గిరిజనులను ప్రోత్సహిస్తోంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు, నిధులు మంజూరు చేస్తే.. తమిళనాడు ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు.










Comments