పథకాలపై ప్రజా సంతృప్తి సగమే!
- BAGADI NARAYANARAO

- Nov 7, 2025
- 3 min read
ఐవీఆర్‌ఎస్ విధానంలో ప్రతినెలా అభిప్రాయ సేకరణ
పెన్షన్లపై 50 శాతం, రేషన్‌పై 60 శాతం అసంతృప్తి
రిజిస్ట్రేషన్లు, గ్యాస్ డెలివరీల్లో అవినీతి ఉందన్న ప్రజలు
పనితీరు అంచనాకు ఈ విధానం సరికాదన్న వాదనలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
హలో.. మేం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాం.
మీకు ఈ నెల పింఛను అందిందా? మీ ఇంటి వద్దే ఇచ్చారా?..
మీకు రేషన్ అందిందా? సరుకుల నాణ్యత ఎలా ఉంది?..
ఇటువంటి ఫోన్‌కాల్స్‌ను సామాన్య ప్రజలు ఇటీవల తరచూ అందుకుంటున్నారు. ఇలాంటి కాల్స్ సహజంగా విసుగెత్తించవచ్చు కానీ.. ప్రభుత్వ పథకాల అమలుతీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన మార్పుచేర్పులు చేసే వెసులుబాటు కలుగుతుంది. అధికార యంత్రాంగం ద్వారా అందే సమాచారం కంటే నేరుగా ప్రజలు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ నిక్కచ్చిగా ఉంటుందని, వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రజల నుంచే నేరుగా అభిప్రాయాలు సేకరించడానికి ఐవీఆర్‌ఎస్ విధానాన్ని అనుసరిస్తోంది. పౌరసేవలు, వివిధ పధకాల్లో లోపాలను గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం. ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయా శాఖలు, సిబ్బంది పనితీరును కూడా ప్రభుత్వం అంచనా వేయగలుగుతుంది. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా అందే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రతి నెలా అన్ని శాఖల అధికారులతో ఆయా శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి జిల్లా యంత్రాంగాలకు పలు సూచనలు చేస్తున్నారు.
ఇళ్ల వద్ద అందని పింఛను
జిల్లాకు సంబంధించి గత నెల ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ పథకాలపై ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా మిశ్రమ స్పందన లభించింది. సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి పింఛన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశారా? అంటూ ఐవీఆర్‌ఎస్ కాల్స్ రూపంలో ఎదురైన ప్రశ్నకు 30 శాతం గ్రామీణ, పట్టణ ప్రాంత లబ్ధిదారులు అవుననే సమాధానం ఇచ్చారు. ఈ నెల పింఛను మీ ఇంటి వద్దనే ఇచ్చారా అన్న ప్రశ్నకు సగటున 50 శాతం మంది లేదని సమాధానం ఇచ్చారు. పింఛను పంపిణీ చేసే అధికారి ప్రవర్తన ఎలా ఉందన్న ప్రశ్నకు 40 శాతం మంది బాగా లేదన్నట్లు స్పందించారు. పింఛన్లకు సంబంధించి ప్రధానంగా అడిగిన ఈ మూడు ప్రశ్నల ద్వారా జిల్లాలో దాదాపు సగం మంది లబ్ధిదారులు అసంతృప్తినే వ్యక్తం చేసినట్లు తేలింది. గత రెండు నెలలుగా ఇళ్ల వద్ద పింఛను పంపిణీ అంత సవ్యంగా సాగడం లేదన్నది లబ్ధిదారుల ఆరోపణ. కార్యాలయాలకు వెళ్లి లేదా వీధి కూడళ్లకు వెళ్లి తీసుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వానికి భిన్నంగా పింఛన్ల పంపిణీలో అధికార కూటమి నాయకులు, కార్యకర్తలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి సమక్షంలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి రెండు నెలలు ఏ కారణాలతోనైనా పింఛన్ తీసుకోలేకపోయినవారు మూడు నెలల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకొనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒకేసారి పెద్ద మొత్తం చేతికందుతున్న పరిస్థితుల్లో ఆ తరహా లబ్ధిదారుల నుంచి వసూళ్ల పర్వం ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అత్తెసరు రేషన్
పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యం, పంచదార, ఇతర సరకుల నాణ్యత బాగులేదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అంటూ వచ్చిన ఐవీఆర్‌ఎస్ కాల్‌కు లేదని 60 శాతం మంది సమాధానం చెప్పారు. వాస్తవంగా బియ్యం, పంచదార మినహా ఇతర నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణాల్లో పంపిణీ చేయడం లేదు. దీంతో ఈ అంశంపై భిన్నంగా స్పందించిన లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకోలేదని చెప్పడం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్సిడీ గ్యాస్ సిలెండర్ల విషయంలోనూ ఇదే స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. గ్యాస్ డెలివరీ బాయ్‌ల ప్రవర్తన బాగులేదని 25 శాతం మంది చెప్పారు. రశీదులో ఉన్న ధర కంటే ఎక్కవ డబ్బులు డిమాండ్ చేశారా అన్న ప్రశ్నకు 60 శాతం మంది అవును అనే సమాధానం చెప్పారు. గ్యాస్ డెలివరీలో ఇతరత్రా లోపాలపై 7 శాతం నుంచి 44 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవినీతి రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఉందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. జిల్లాలోని 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో అవినీతిని గమనించారా అన్న ప్రశ్నకు 45 శాతం మంది అవును అని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ సులభంగా ఉందా? అంటే లేదని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు. వివాహ ప్రక్రియను రిజిస్టర్ చేసే సమయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అన్న ప్రశ్నకు అవును అని 40 శాతం మంది సమాధానం ఇచ్చారు. అవినీతి, స్లాట్ బుకింగ్‌పై 24 శాతం నుంచి 39 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల పనితీరుపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రాజధాని నుంచి ఐవీఆర్‌ఎస్ విధానంలో సేకరిస్తున్న ఈ అభిప్రాయాలను ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపించి వివరణ కోరుతున్నారు. వాస్తవంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు ప్రజలు ఇచ్చే అభిప్రాయాన్ని వందశాతం ప్రామాణికంగా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఐవీఆర్‌ఎస్ ద్వారా కాల్స్ వచ్చే సమయం, సందర్భం లబ్ధిదారులను ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు బాగుందని, వ్యతిరేకులైతే బాగులేదని చెప్పడం సహజం. అలాగే ఐవీఆర్‌ఎస్ విధానంలో పొడి పొడి సమాధానాలే తప్ప సమస్యను పూర్తిగా వివరించే అవకాశం లేదు. దానివల్ల అనుకూలత లేదా వ్యతిరేకతలకు సరైన కారణాలు వెల్లడి కాకపోవచ్చు. అందువల్లే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ను ఆన్సర్ చేయడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.










Comments