పదే పదే అదే మోసం..
- NVS PRASAD

- 4 days ago
- 1 min read
నకిలీ పత్రాలతో ఉద్యోగాలు సృష్టి
పోలీసుల అదుపులో విశాఖ-ఎ కాలనీవాసి
కేసు నమోదు చేసిన పాతపట్నం పోలీసులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్థానిక విశాఖ`ఎ కాలనీకి చెందిన కొండల లోకేశ్వరరావు ఉద్యోగాలిప్పిస్తామని జిల్లా వ్యాప్తంగా పలువురి నుంచి సొమ్ములు వసూలుచేసి, అందులో కొందరికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన కేసులో పాతపట్నం పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ వేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. అయితే దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన లోకేశ్వరరావు గతంలో పూతి తిరుపతిరావు అనే వ్యక్తి నుంచి రూ.6.5 లక్షలు వసూలుచేసి, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడంతో 2024కు ముందు ఫిర్యాదు అందింది. అప్పట్లో పోలీసులు రిమాండ్‌కు పంపితే, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు కాబట్టి అక్కడే తేల్చుకోవాలని కోర్టు ఆదేశించడంతో లోకేశ్వరరావుకు 41ఎ నోటీసులిచ్చి వదిలేశారు. దీంతో మోసం చేస్తే ఇంతకు మించి ఏమీ జరగదని భావించిన కొండల లోకేశ్వరరావు పాతపట్నంలో ఇద్దరు అన్నదమ్ముల నుంచి మరో రూ.6.50 లక్షలు వసూలుచేసి, వారికి దొంగ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఐపీసీలో ఇది బెయిలబుల్ సెక్షన్ కావడం వల్ల తప్పించుకు తిరిగిన లోకేశ్వరరావుకు ఇప్పుడు బీఎంఎస్ చట్టం రావడంతో అరెస్టు తప్పలేదు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో బీటెక్ చదివినవారికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గాను, ఇంటర్ చదివిన వ్యక్తికి సబార్డినేట్‌గాను ఉద్యోగాలు వచ్చినట్టు నకిలీ పత్రం సృష్టించి, దాని మీద స్టాంపు వేసి ఇచ్చాడు. వీరికి నమ్మకం కలగడానికి వర్క్ ఫ్రమ్ హోం అని చెప్పి ఒక నెల జీతాలు వీరి అకౌంట్‌లో వేశాడు. రెండో నెల జీతాలు ఇంకా రాలేదని ప్రశ్నిస్తే, ఈ ఉద్యోగాలకు రూ.8 లక్షలకు ఒప్పందం కుదిరిందని, రూ.6.50 లక్షలు మాత్రమే ఇచ్చినందున జీతాలు ఆగాయని చెప్పడంతో, వీరిద్దరూ ఆ మిగిలిన మొత్తం కూడా లోకేశ్వరరావుకు చెల్లించేశారు. ఆ తర్వాత అసలు ఇటువంటి సంస్థే లేదని తేలడంతో పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. 2024 అక్టోబర్ నుంచి నలుగుతున్న ఈ కేసులో నిందితుడ్ని పాతపట్నం పోలీసులు అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి రెండు రబ్బర్ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.










Comments