పదేపదే ఓటీపీ గంట.. రిజిస్ట్రేషన్లలో కొత్త తంటా..
- BAGADI NARAYANARAO

- Sep 26
- 2 min read
సంస్కరణల తర్వాత ప్రక్రియ మరింత సంక్లిష్టం
ఆన్‌లైన్ విధానం వల్ల పెరిగిన వ్యయప్రయాసలు
మార్పుచేర్పులకు అవకాశం లేక మొత్తం తిరస్కరణ ముప్పు
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కనిపించని స్పందన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
చదివేస్తే ఉన్న మతి పోయిందట.. వెనకటికొకడికి!. అదే రీతిలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త విధానం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసిందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. దాంతోపాటు దస్తావేజు లేఖర్లు, వినియోగదారుల మధ్య అపోహలు సృష్టించేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో ఆధార్ ఆధారిత ఓటీపీ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సివస్తోంది. అయితే కొత్త విధానంలో అనేక సాంకేతక సమస్యలు తలెత్తుతుండటమే కాకుండా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అనవసర వ్యయప్రయాసలు తప్పడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటీవల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండు రోజులు పాటు పెన్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు దస్తావేజు లేఖర్లు ప్రయత్నించారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు.
సైబర్ నేరాలు జరుగుతాయనే భయం
రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో స్టాంప్ పేపర్ కొనుగోలు నుంచి దస్తావేజును తయారు చేసి ఆన్‌లైన్ చేయడం వరకు ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియలో వినియోగదారులు మొత్తం మూడుసార్లు తమ ఫోన్లకు వచ్చే ఓటీపీ నెంబర్లను దస్తావేజు లేఖరులకు చెప్పాల్సి ఉంటుంది. ఇదే వినియోగదారులను అనేక అపోహలకు, అనవసర భయాలకు గురిచేస్తోంది. గతంలో తయారుచేసిన దస్తావేజ్‌ను తీసుకువెళ్లి సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించేవారు. కొత్త విధానంలో మొదట దస్తావేజును ఆన్‌లైన్ చేసి, రిజిస్ట్రేషన్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ వ్యవహారమంతా ఆధార్ ఆధారిత ఓటీపీల ద్వారానే చేయాల్సి ఉంటుంది. అయితే మాటిమాటికీ ఓటీపీ రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వినియోగదారులు వాటిని లేఖరులకు చెప్పడానికి సంకోచిస్తున్నారు. పైగా పదే పదే ఓటీపీలు ఎందుకు పంపిస్తున్నారని దస్తావేజు లేఖరులను ప్రశ్నిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఓటీపీలతోనే ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు జరుగుతుండడంతో ఓటీపీలను లేఖరులకు ఇవ్వడానికి వినియోగదారులు వెనుకాడుతున్నారు. ఓటీపీలతో దస్తావేజులే కాకుండా ఇంకా ఏవైనా మాయలు చేస్తారేమోనన్న అనుమానాలే వారి ఆందోళనకు కారణం.
చిన్న తప్పు వస్తే మొత్తం తిరస్కరణ
కాగా ఓటీపీల ఆధారంగా దస్తావేజు తయారుచేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే ఇక దాన్ని మార్చే అవకాశం సబ్ రిజిస్ట్రార్‌కు లేదు. దస్తావేజును పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో అప్‌లోడ్ చేసిన తర్వాత చిన్న పొరపాటు జరిగితే చాలు.. ముందు బుక్ చేసుకున్న స్లాట్ కోల్పోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్ చేసిన తర్వాత దస్తావేజులో ఉన్న సమాచారాన్ని చూడటం, చదవడమే తప్ప షెడ్యూల్‌లో ఇచ్చే పబ్లిక్ సమాచారాన్ని సరిచేయించే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు లేదు. దానికంటే అదే కారణంతో మొత్తం డాక్యుమెంటునే తిరస్కరించే అవకాశం మాత్రం ఉంటుంది. దాంతో అప్‌లోడ్ చేసిన దస్తావేజులో పేర్కొన్న అంశాల్లో తప్పులు ఉంటే సబ్ రిజిస్ట్రార్ వాటిని తిరస్కరిస్తున్నారు. దాంతో తీసుకున్న టైమ్ స్లాట్ వృథా అయిపోతోంది. ఇలా జరిగిన సందర్భాల్లో వినియోగదారుల దస్తావేజు లేఖరులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎప్పుడూ లేనన్ని అవరోధాలు ఎందుకన్న ప్రశ్నలను చాలామంది లేవనెత్తుతున్నారు. ఇదే కాకుండా రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బక్ చేసుకున్న సమయానికి ఠంచను సబ్ రిజిస్ట్రార్ ముందు నిల్చోవాలి. అలా హాజరు కాలేకపోతే స్లాట్‌ను రీషెడ్యూల్ చేయాలి. దానికి మళ్లీ రూ.200 చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాస్తవంగా రిజిస్ట్రేషన్ కోసం చలానా తీసుకున్న తర్వాత ఆ చలానా నెంబర్‌తో నే స్లాట్ బుక్ అవుతుంది. ఈ స్లాట్‌ను సబ్ రిజిస్ట్రార్ సవరించే అవకాశం లేదు. దీంతో వినియోగదారులతో పాటు దస్తావేజు లేఖరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం 2.0 పేరుతో తీసుకువచ్చిన సంస్కరణల్లో అనేక సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ ఇష్యూలు ఉన్నాయని లేఖరులు చెబుతున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.










Comments