పదవి నుంచి విశ్రాంతి.. అయినా అయ్యవారే గతి!
- NVS PRASAD
- Aug 9
- 2 min read
పదిరోజులైన నియామకం కాని రెగ్యులర్ డీఈవో
ఎవరికీ ఎఫ్‌ఏసీ కూడా అప్పగించని అధికారులు
కార్యాలయంలో పేరుకుపోతున్న కీలక ఫైళ్లు
రిటైరైన తిరుమల చైతన్యతోనే పాత తేదీలతో సంతకాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ఉద్యోగ విరమణ చేసి పదిరోజులు కావస్తున్నా ఇంకా రెగ్యులర్ డీఈవోను నియమించలేదు. దాంతో ఇప్పటికీ తిరుమల చైతన్యే తెరవెనుక అనధికార డీఈవోగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కీలకమైన విద్యాశాఖకు పది రోజులుగా జిల్లా స్థాయి అధికారి లేకపోవడంతో ఆర్థికపరమైన ఫైల్స్ ఆమోదం పొందలేక నిలిచిపోయాయి. ఫలితంగా పలువురు ఉపాధ్యాయులకు జీతాలు కూడా అందని పరిస్థితి నెలకొందంటున్నారు. ఇదే అదనుగా పాత తేదీ (బ్యాక్‌డేట్) లతో ఫైళ్లు రన్ చేసి తిరుమల చైతన్యతో సంతకాలు చేయిస్తున్నట్టు తెలిసింది. కొన్నాళ్ల క్రితం ఉపాధ్యాయ బదిలీలు జరిగాయి. కొత్త స్థానాల్లో చేరిన వారికి అక్కడే జీతాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలి. ఈ తరుణంలో తిరుమల చైతన్య రిటైర్ కావడంతో ఆ ఫైల్ నిలిచిపోయింది. ఫలితంగా చాలామంది టీచర్లకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాక్‌డేట్ వేసి తిరుమల చైతన్యతో సంతకాలు చేయించాల్సి వస్తోందని వినికిడి. వాస్తవానికి డీఈవో రిటైర్ కావాల్సి ఉంటే.. దానికి పది రోజుల ముందే కొత్త డీఈవోను నియమించాలి లేదా ఎవరికైనా ఎఫ్‌ఏసీ(పూర్తి అదనపు బాధ్యతలు) ఇవ్వాలి. ఈ రెండూ జరక్కపోవడంతో డీఈవో కార్యాలయంలో ఫైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఆ పోస్టుకు పలువురి పైరవీలు
పక్కనున్న పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. మూడు నెలల నుంచి ఇక్కడ డీఈవో పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ ఎవర్నీ నియమించకపోవడంతో అక్కడ జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ధైర్యంగా ఒకడుగు ముందుకేసి రాజ్‌కుమార్ అనే ఒక ఉపాధ్యాయుడికి డీఈవో బాధ్యతలు అప్పగించి, పరిపాలన స్తంభించిపోకుండా చూశారు. శ్రీకాకుళంలో మాత్రం ఇప్పటి వరకు ఎవర్నీ నియమించలేదు సరికదా.. సంతకాలు పెట్టే పవరున్న పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే.. శ్రీకాకుళం డీఈవో పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉంది. తిరుమల చైతన్య డీఈవోగా చేసినప్పుడే ఆయన ఆ పోస్టుకు అనర్హుడు కాబట్టి తమకివ్వాలంటూ అనేకమంది అనేక రకాలుగా పైరవీలు చేశారు. మంత్రి పేషీ మాత్రం ఈయన వైపే మొగ్గు చూపడంతో పదవీ విరమణ వరకు తిరుమల చైతన్యే కొనసాగారు. ఎట్టకేలకు ఇక్కడ డీఈవో పోస్టు ఖాళీ కావడంతో దాన్ని అందిపుచ్చుకోవడానికి పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. సుధాకర్ అనే ఒక లెక్చరర్‌ను డీఈవోగా తీసుకురావడానికి శ్రీకాకుళం, పలాస ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వడంతోపాటు ఈయనకు మంత్రి అచ్చెన్నాయుడు అండదండలు ఉన్నాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అలాగే పాడేరులో డీఎస్‌ఈవోగా పని చేస్తున్న బ్రహ్మాజీకి కూడా మంత్రి పేషీ అండదండలు ఉన్నాయని, ఆయన్ను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ డీఈవోగా కొద్దికాలం పనిచేసి, ప్రస్తుతం ఆర్‌జేడీ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వహిస్తున్న డీవీఏ నర్సింగరావు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న రవిబాబు సైతం డీఈవో పోస్టుపై కన్నేశారు. ఆ మేరకు ఇటీవలే ఆయన డిపార్ట్‌మెంటల్ టెస్ట్ రాశారు. అయితే దాని ఫలితాలు ఇంకా వెలువడలేదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టు మంత్రులు తలచుకుంటే ఎవర్నయినా డీఈవోగా తేవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాకు మాత్రం గున్ను రామ్మోహనరావు అనే ఉపాధ్యాయుడ్ని డీఈవోగా నియమించడానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సిఫార్స్ చేసినట్లు తెలిసింది.
Comments