top of page

కొత్తగా ‘రెక్క’లొచ్చెనా!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jan 5
  • 3 min read
  • భోగాపురం విమానాశ్రయం ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

  • పనులు ఎంతవరకు పూర్తయ్యాయి?

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తలమానికం కానున్న భోగాపురం ఎయిర్‌పోర్టు మత్స్య ఆకారంలో నిర్మించడం ఒక ఎత్తయితే, ఎయిర్‌పోర్టుకు గుర్తుగా, ఆ చేపకు రెక్కలు పెట్టడం మరో విశేషం. ఈ కొత్త ఎయిర్‌పోర్టులో రెక్కల విమానం ఆదివారం సురక్షితంగా దిగింది. ఇది తమ క్రెడిటేనని పార్టీలు చెప్పుకుంటున్న అంశాన్ని పక్కన పెడితే ఈ పనులు పనులు ఎంతమేరకు పూర్తయ్యాయి, దీని ప్రత్యేకతలేమిటనే దానిపై చేస్తున్న విశ్లేషణ ఇది.

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై ఆదివారం ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. న్యూఢల్లీి నుంచి బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం ఇక్కడ దిగిన తర్వాత అగ్నిమాపక వాహనాలు విమానం రెండు వైపుల నుంచి నీటిని ఎగచిమ్ముతూ చేసిన ‘వాటర్‌ సెల్యూట్‌’ను అందుకుంటూ విమానం ముందుకు కదిలింది. నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.

దాదాపు పదేళ్ల క్రితం మొదలైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. నిర్మాణంలో ఎదురైన ఆలస్యాలు, భూసేకరణ సమస్యలు, ప్రభుత్వాల మార్పుల మధ్య ముందుకు సాగిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 96 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధాన ట్రయల్‌ రన్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కమర్షియల్‌ ఆపరేషన్లకు మరో అడుగు దగ్గరైంది. ఈ ఎయిర్‌ పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.

96 శాతం పనులు పూర్తి

భోగాపురం విమానాశ్రయాన్ని ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బిల్డింగ్‌ను ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంలో కీలకమైన రన్‌ వే, ట్యాక్సీ వే, ఎర్త్‌వర్క్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. టెర్మినల్‌ భవనం, ప్రధాన బిల్డింగ్‌లు, అప్రోచ్‌ రోడ్లు, లోకలైజర్‌, జీపీఎస్‌ నావిగేషన్‌, రాడార్‌, ఏటీసీ వ్యవస్థలు తుది దశలో ఉన్నాయి దాదాపు 96 శాతం పనులు పూర్తయ్యాయి. వాతావరణ పరికరాలు, నావిగేషన్‌ సిస్టమ్స్‌పై టెస్టింగ్‌ పూర్తయింది.

పదేళ్లకు అందుబాటులోకి

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 2015 మే 20న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారిగా ఆమోదం తెలిపింది. 2016 అక్టోబర్‌ 7న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదట 2023 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, భూసేకరణలో జాప్యం, పరిహార వివాదాలు, ప్రభుత్వాల మార్పులతో ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి భూమి పూజ నిర్వహించారు. దీంతో రెండుసార్లు శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్ట్‌గా ఇది గుర్తింపు పొందింది. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా 2024లో బాధ్యతలు చేపట్టడంవల్ల ప్రాజెక్ట్‌ వేగం పెరగిందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. తమ హయాంలోనే పనులన్నీ చేశామని వైకాపా కూడా చెబుతోంది. 2026 డిసెంబరు నాటికి ఎయిర్‌పోర్ట్‌ పూర్తవ్వాల్సి ఉంది. అయితే ఆరు నెలలు ముందే, అంటే 2026 జూన్‌లోనే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రత్యేకతలు

మొత్తం విస్తీర్ణం: 2,700 ఎకరాలు (ఇందులో 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌ పోర్టు నిర్మాణం, మరో 500 ఎకరాలు భవిష్యత్‌ విస్తరణ కోసం)

నిర్మాణ సంస్థ: జీఎంఆర్‌ గ్రూప్‌

టెర్మినల్‌ విస్తీర్ణం: 81వేల చదరపు మీటర్లు (78వేల చదరపు మీటర్ల పనులు పూర్తి)

ఏరో బ్రిడ్జీలు: 22

ప్రారంభ సామర్థ్యం: ఏడాదికి 60 లక్షలమంది ప్రయాణికులు

రెండో దశలో: కోటీ20లక్షల మంది ప్రయాణికులు

తొలి దశ వ్యయం: రూ.4,750 కోట్లు

రన్‌ వే పొడవు: 3.8 కిలోమీటర్లు

భారీ విమానాలు, ఎయిర్‌బస్‌ ఎ380 వంటి లాంగ్‌ హాల్ట్‌ ఫ్లైట్లకు అనుకూలంగా ఈ రన్‌వే రూపొందించారు. దేశంలోనే పొడవైన రన్‌ వేల్లో ఒకటి. భోగాపురం ఎయిర్‌పోర్టు విశాఖపట్నం నుంచి 55 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కనెక్టివిటీ సవాళ్లు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తయితే తూర్పు నౌకాదళ నిర్వహణలో ఉన్న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు బంద్‌ అవుతాయి. ఈ ఎయిర్‌పోర్టు విశాఖ నగరానికి 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నైట్‌ ల్యాండిరగ్‌ సమస్యలు ఉండటంతో.. మరో ఎయిర్‌పోర్టుని నిర్మించాలంటూ నేవీ కేంద్రాన్ని కోరింది. అక్కడ మొదలైన కథే ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు వరకు సాగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అధునాతనంగా, భారీఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలుత 15వేల ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత, వివిధ దశల్లో నిర్వాసిత గ్రామస్తుల ఆందోళనలతో ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ 2,700 ఎకరాలకు పరిమితమైంది.

ఎయిర్‌పోర్టు అవసరాల దృష్ట్యా ప్రయాణ సమయం, ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించేందుకు విశాఖ నుంచి 12 ప్రధాన రహదారులు కనెక్ట్‌ చేయాల్సి ఉంది. అయితే వీటి అభివృద్ధిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనెక్టివీటి లేకుండా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే ఎయిర్‌ ప్యాసింజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. ఒంగోలుకు చెందిన సామాజికవేత్త, అభ్యుదయ రచయిత నూకతోటి రవికుమార్‌ మాత్రం భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారం విమానం ట్రయల్‌రన్‌ విజయవంతమైందనగానే తన సామాజికమాధ్యమంలో నాణానికి ఉన్న మరో కోణాన్ని ప్రస్తావించారు.

భోగాపురంలో విమానం దిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వలసలు ఆగిపోయాయి. వలస వెళ్లినవారు తిరిగి వచ్చేశారు. వారి చేతుల నిండా పని. నదుల కింద వ్యవసాయానికి డబ్బులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయ్‌.

భోగాపురంలో విమానం ఆగింది. ఎక్కడా గ్రామాల్లో ఎటువంటి అనారోగ్యాలూ లేవు. ప్రభుత్వాసుపత్రులు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ఏ పనులూ లేక గోళ్లు గిల్లుకుంటున్నాయి. సిక్కోలు నుంచి ఆసుపత్రులన్నీ సర్దేసుకుంటున్నాయి.

భోగాపురంలో విమానం దిగింది. ఈ విమానం మావల్లనే అంటే మావల్లనే అని పాలకులు ఒకరికొకరు పోటీ పడుతుంటే, రేపోమాపో విమాన ప్రయాణం కూడా ఫ్రీ అంటారేమోనని పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోవడానికి సిద్ధంగా ఉన్న జనం చిరిగిపోయిన సంచులు సర్దుకొని ఎదురుచూస్తున్నారు.

భోగాపురంలో విమానం దిగింది. పొలాలన్నీ రియల్‌ ఎస్టేట్‌ అయిపోయాయి. అక్కడ ఎవరూ తిండిగింజల కోసం ఇప్పుడు ఎదురు చూడటంలేదు. భోగాపురం ఏరియా అంతా మాడ్రన్‌ కాలనీ అయిపోయింది. సాఫ్ట్‌వేర్‌ భూమ్‌ వచ్చేసింది. ఎంసీఏ, ఎంబీయే కోర్సులు చదివిన పిల్లలందరికీ డబ్బులు లెక్కలేసుకోలేని ఉద్యోగాలు వచ్చేశాయి.

..అంటూ ఉత్తరాంధ్రలో వలసలు, నేలమట్టమైన గ్రామాల మధ్యలో శిథిలమైపోయిన పురాతన ఆనవాలు, ఆకలితో నకనకలాడే కడుపుల కోసం ప్రస్తావించారు. ఆయన ఫేస్‌బుక్‌లో భోగాపురం విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల బతుకులు మారవన్న మరో కోణం కూడా ఆలోచింపజేసేదిగానే ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page