top of page

పప్పులుడకని చేప!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 16
  • 1 min read
  • తక్షణమే కిరాణా వ్యాపారం ఆపాలని నోటీసులు

  • సత్యం’ కథనం, గ్రీవెన్స్‌లో ఫిర్యాదుపై అధికారుల చర్యలు

  • వారిపై కూడా ఒత్తిడి తెచ్చేందుకు లీజుదారుడి విఫలయత్నం

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘చేపా.. చేపా.. ఎందుకు పప్పులమ్ముతున్నావ్‌?’.. శీర్షికతో ‘సత్యం’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి రైతుబజార్‌ ప్రాంగణంలో లీజు నిబంధనలకు విరుద్ధంగా చేపలకు బదులు పప్పులు అమ్ముతున్న షాపును మూసేశారు. ఫిష్‌ ఆంధ్రాలో భాగంగా రైతుబజారులో ప్రభుత్వం రూ.10 లక్షలతో నిర్మించిన చేపల విక్రయ అవుట్‌లెట్‌ను మత్స్యకారులకు కేటాయించి, అందులో చేపలు మాత్రమే విక్రయించేలా చూడాలి. అయితే అవుట్‌లెట్‌ను లీజుకు తీసుకున్న సహకార సంఘం ప్రతినిధులు దాన్ని రిటైల్‌ కిరాణా షాపుగా మార్చేశారు. దీనిపై రైతుబజారులో వ్యాపారాలు చేస్తున్న రిటైల్‌ కిరాణా వ్యాపారులు, రైతులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన మార్కెటింగ్‌, మత్స్యశాఖల అధికారులు లీజుదారులకు నోటీసులు ఇచ్చి అవుట్‌లెట్‌ను పరిశీలించారు. అనంతరం షాపును ఖాళీ చేయాలని లీజుదారుడు మైలిపిల్లి నరసింహులును ఆదేశించారు. చేపలు విక్రయించాల్సిన చోట రిటైల్‌ కిరాణా వ్యాపారం చేస్తే లీజు రద్దు చేస్తామని హెచ్చరించడంతో లీజుదారుడు సోమవారం షాపును ఖాళీ చేశారు.

అధికారులపై ఒత్తిడికి యత్నం

ఫిష్‌ అవుట్‌లెట్‌లో కిరాణా వ్యాపారం ప్రారంభిస్తున్న సమయంలోనే అధికారులు హెచ్చరించారు. కానీ తనకు అధికార పార్టీ నాయకుల అండ ఉందని, చేపలకు బదులు పప్పులు విక్రయించినా ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయలేదు. అభ్యంతరం చెప్పిన రైతు బజార్‌లోని ఇతర వ్యాపారులతోనూ లీజుదారుడు తలబిరుసుగా వ్యవహరించాడు. దీంతో వారంతా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా వారికి పోటీగా లీజుదారుడు ఉన్నతాధికారులకు ఒక వినతిపత్రం అందించారు. లీజుకు తీసుకున్న అవుట్‌లెట్‌లో చేపల వ్యాపారమే చేస్తున్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన మత్స్య, మార్కెటింగ్‌ శాఖల అధికారులకు మాత్రం అందుబాటులో లేకుండా షాపులను మూసేసి వెళ్లిపోయాడు. అధికారులు ఫోన్‌ చేసినా సరైన సమాచారం ఇవ్వలేదు. పైగా గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చానని, వారు సానుకూలంగా స్పందించారని మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడు. ద్వితీయశ్రేణి టీడీపీ నాయకుల ద్వారానూ అధికారులపై ఒత్తిడి తెచ్చే ందుకు ప్రయత్నించాడు. దీంతో లీజుదారుడు షాపును ఎప్పుడు తెరుస్తాడా అని అధికారులు వేచిచూశారు. చివరికి రెండు రోజుల క్రితం సాయంత్రం వేళ షాపు తెరిచినట్టు సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి నోటీసులు అందించి తక్షణమే కిరాణా వ్యాపారం మూసేయాలని, లేదంటే లీజును రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో సోమవారం కిరాణా షాపును లీజుదారుడు ఖాళీ చేశాడు. దాంతో రైతుబజార్‌లోని కిరాణా వ్యాపారులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.

` రెండు ఫోటోలు

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page