పరిష్కారం పేరుతో మోళీ..అవే అర్జీలు మళ్లీ మళ్లీ!
- BAGADI NARAYANARAO

- Sep 3, 2025
- 3 min read
గ్రీవెన్స్ వినతుల్లో అధికారవర్గాల మాయాజాలం
పరిష్కరించకుండానే ఒత్తిడి చేసి అర్జీదారులతో సంతకాలు
వాటినే ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్న వైనం
అవే సమస్యలతో మాటిమాటికీ వస్తున్న ప్రజలు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
సమస్యలపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, వాటిని నిర్ణీత గడువులో పరిష్కరించడానికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ప్రతి సోమవారం ‘మీ కోసం’ పేరుతో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే ఇదొక ప్రహసనంగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మీ కోసం’తోపాటు ప్రజాదర్బార్ పేరుతో సీఎంవో, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల కేంద్ర కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. వీటిని కూడా మండల అధికారులకే పంపించి పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. ఇలా అందే వినతులు, ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఫిర్యాదుదారుల నుంచి స్వీయ అంగీకారపత్రంపై సంతకం చేయించి, దాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడే సమస్య పరిష్కారమైనట్లు ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రతి ఆర్జీ పరిష్కారానికి గడువును నిర్దేశించడంతో జిల్లా ఉన్నతాధికారులు మండల అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో వారు దరఖాస్తుదారులను బతిమాలో, భయపెట్టో, మభ్యపెట్టో సమస్య పరిష్కారమైనట్లు అంగీకారపత్రం తీసుకుని గ్రీవెన్స్‌ను క్లోజ్ చేసేస్తున్నారు. వాస్తవానికి పరిష్కారం కాని ఆ సమస్యల కోసం ప్రజలు మళ్లీ మళ్లీ అవే ఆర్జీలతో గ్రీవెన్స్‌కు తరలివస్తున్నారనడానికి తార్కాణంగా నిలిచే కొన్ని ఉదంతాలు చూద్దాం.
ఎందరికి అర్జీలు ఇచ్చినా..
శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామానికి చెందిన శీర కోటేశ్వరరావు వారసత్వంగా తనకు దక్కిన భూమిని రీసర్వేలో లేఅవుట్‌గా నమోదు చేశారని, దాన్ని సరిదిద్దాలంటూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే నిర్వహించే ప్రజాదర్బార్, సీఎంవో, టీడీపీ కేంద్ర కార్యాలయం, రెవెన్యూ మంత్రి ప్రజాదర్బార్, సీఎంవోలో ప్రభుత్వ కార్యదర్శికి ఒక్కోసారి.. జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు రెండుసార్లు అర్జీలు సమర్పించి వారి చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో భార్యభర్తలిద్దరూ సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటికీ సమస్యకు పరిష్కారం కాలేదు. గ్రీవెన్స్ స్టేటస్‌ను తెలియజేసే పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో మాత్రం ఈ సమస్యను పరిష్కరించినట్టు చూపించేసి అర్జీని క్లోజ్ చేశారు. అర్జీదారుడైన కోటేశ్వరరావు టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. వైకాపా హయాంలో అప్పటి మంత్రి పేషీలో ఉన్న ఒక వీఆర్వో, స్థానిక వైకాపా సర్పంచ్ వెనుకుండి మాయ చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైకాపా నాయకుల జోక్యంతోనే జిరాయితీ భూమిని రీ సర్వేలో లేఅవుట్‌గా రెవెన్యూ అధికారులు నమోదు చేశారని కూటమి ప్రభుత్వ పెద్దలకు కోటేశ్వరరావు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పరిష్కరించలేదు. మ్యుటేషన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించే నాయకుడు, అధికారి కానరావడం లేదు. దీంతో ఈ నెల ఒకటో తేదీన మరోమారు గ్రీవెన్స్‌ను ఆశ్రయించి సమస్యకు పరిష్కారం చూపించాలని లిఖితపూర్వకంగా మొర పెట్టుకున్నాడు.
ఒక్కోసారి ఒక్కో కథ
అదేవిధంగా గార మండలం కె.మత్స్యలేశం గ్రామం సర్వే నెంబర్ 211/6లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బొండి రామారావు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మండల, సచివాలయ సర్వేయర్లు, వీఆర్‌వో కలిసి సర్వే చేసి ప్రభుత్వ భూమిగా నిర్ణయించి హద్దులు ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఫిర్యాదు పరిష్కారమైనట్లు ఆర్జీదారుడు రామారావుతో రెవెన్యూ అధికారులు అంగీకారపత్రంపై సంతకం చేయించుకుని పీజీఆర్‌ఎస్‌లో అప్‌లోడ్ చేశారు. అర్జీని పరిష్కరించినట్లు ఒక ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. అయితే ప్రభుత్వ భూమిగా నిర్ధారించి హద్దులు ఏర్పాటుచేసిన తర్వాత మళ్లీ రెవెన్యూ ఉద్యోగులు ఆక్రమణదారులతో చేతులు కలిపి సదరు భూమి జిరాయితీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. వారం రోజుల క్రితమే ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన వారే ఇప్పుడు జిరాయితీ అని ఎలా చెబుతున్నారని ఫిర్యాది బొండ రామారావు ప్రశ్నించగా ఎస్‌ఎల్‌ఆర్‌లో జిరాయితీగా నమోదై ఉందని కొత్త కథ చెబుతున్నారు. వివాదాస్పద భూమిలో కొలతలు తీసే ముందు ఎందుకు దీన్ని పరిగణనలోకి తీసుకోలేదంటే మాత్రం గార రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పడంలేదు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు మాట మార్చారని ఫిర్యాదుదారుడు రామారావు ఆరోపిస్తున్నారు. గార రెవెన్యూ అధికారుల తీరుపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన ఆయన జిల్లా ఉన్నతాధికారులు స్పందించే తీరును బట్టి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాడు.
సర్వే నెంబరునే మార్చేసి..
ఈ రెండు ఉదంతాలను తలదన్నే రీతిలో నగరంలోని బలగ ప్రాంతంలో చోటుచేసుకుంది. బలగ రెవెన్యూ సర్వే నెంబర్ 1/4లో ఉన్న 1.05 ఎకరాల నాగావళి వరదగట్టును ఆక్రమించిన వారిని వీఆర్వో వెనకేసుకు వస్తున్నారని బోనెల చిరంజీవి అనే వ్యక్తి రెండోసారి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో ఆక్రమణలు తొలగించాలని కోరితే.. సమస్యకు పరిష్కారం చూపించామంటూ ఎండార్స్‌మెంట్ ఇచ్చి అంగీకారపత్రంపై సంతకం చేయాలని వీఆర్‌వో ఫిర్యాదుడారుడిపై ఒత్తిడి చేశారు. వరదగట్టు హద్దులు నిర్ణయించి ఆక్రమణలను గుర్తిస్తే తప్ప అంగీకార పత్రంపై సంతకం చేయనని ఫిర్యాదుదారుడు తేల్చి చెప్పాడు. దీంతో వీఆర్వో సచివాలయ సర్వేయర్‌ను వెంటబెట్టుకొని ఆక్రమిత భూమి 1/4 సర్వే నెంబర్‌లో కాకుండా 1/5 సర్వే నెంబర్‌లో ఉన్నట్టు చూపించి సంతకం చేయాలని మళ్లీ ఒత్తిడి చేశారు. 1/5లో రికార్డుల్లో 74 సెంట్లు భూమి మాత్రమే ఉండగా గ్రౌండ్‌లో 2.10 ఎకరాలకు పైగా ఉంది. అర్జీదారుడు ఆక్రమించినదంతా వరదగట్టుకు చెందిన 1.05 ఎకరాలుగా చూపిస్తున్నా.. వీఆర్వో రెవెన్యూ అధికారులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. వరదగట్టు ఉన్న 1/4 సర్వే నెంబరులో ఉన్న భూమిని సర్వేచేసి హద్దులు నిర్ణయించాలని తహసీల్దారు ఆదేశించినా వీఆర్వో స్పందించడం లేదు. గ్రీవెన్స్‌లో అందే అర్జీలకు ఏమేరకు పరిష్కారం చూపిస్తున్నారో ఈ మూడు ఉదంతాలే నిదర్శనం. సమస్యల పరిష్కారానికి సరైన వేదిక గ్రీవెన్స్ అని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. అర్జీలకు పరిష్కారం లభించకపోవడంతో పదే పదే సమస్యల పరిష్కారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజాదర్బార్‌కు, గ్రీవెన్స్‌కు క్యూ కడుతున్నారు.










Comments