top of page

పరపతి, ఫోర్జరీల పోటు.. చెరువు ఉనికికే చేటు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 10, 2025
  • 3 min read
  • రూపురేఖలు కోల్పోయిన సానివాడ బరాటం చెరువు

  • కలెక్టర్‌ ఆదేశాలతో విచారణకు కదిలిన యంత్రాంగం

  • నకిలీ పట్టాలతో నమ్మించే ప్రయత్నంలో కొందరు

  • ఇళ్లు కట్టేశాం.. ఇప్పుడేలా తొలగిస్తారని ఇంకొందరి రుబాబు

  • రెండు కుటుంబాల చేతుల్లోనే భూములు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఉపాధి హామీ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో పాటు వాటి విస్తీర్ణాన్ని క్రమబద్ధీకరించే విధంగా గట్లు పటిష్టపర్చడంతో జిల్లాలో కొన్నేళ్ల క్రితం ఆక్రమణలకు గురైన చెరువుల వాస్తవ రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. రాజుల కాలంలో సాగు, తాగు నీటి కోసం ప్రతి గ్రామంలో రెండు చెరువులు ఉండేవి. గ్రామం ప్రారంభంలో ఒకటి, శివారులో ఒక చెరువు కామన్‌గా ఉంటాయి. తర్వాత కాలంలో లిఫ్ట్‌ ఇరిగేషన్లు, నీటిపారుదల పథకాలు రావడంతో చెరువుల కింద వ్యవసాయం తగ్గిపోయింది. దాంతో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. అంతకంటే విచారకరమైన విషయమేమిటంటే.. ఆక్రమించిన చెరువుల్లో అదే చెరువు నుంచి తవ్విన మట్టిని నింపి వ్యవసాయం చేసుకుంటున్నవారికి ప్రభుత్వాలు పట్టాలిచ్చేశాయి. చెరువు గర్భాల్లో పట్టాలు ఇవ్వడానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. కొత్త ఆక్రమణలకు దీన్ని వర్తింపజేశారు గానీ, పాత ఆక్రమణల జోలికి పోలేదు. ఎందుకంటే రాజకీయ ప్రాపకంతో రెవెన్యూ యంత్రాంగమే పట్టాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి పనుల్లో చెరువుల తవ్వకాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. దీనివల్ల లాభనష్టాల మాటెలా ఉన్నా ప్రస్తుతానికి రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన మేరకు చెరువులను చదును చేయాలని స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణే ఆదేశించడంతో ఆక్రమణల తొలగింపునకు పూనుకొన్నారు. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చిపడిరది. దశాబ్దాల క్రితం తమకు పట్టాలిచ్చేశారని, తమ సాగులోనే ఉందని కొందరు వాదిస్తుంటే, మరికొందరు చెరువుగట్టు మీద ఎప్పుడో ఇళ్లు కట్టుకున్నాం.. ఇప్పుడు ఎలా తొలగిస్తారంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కలెక్టర్‌ దినకర్‌ పుండ్కర్‌ మాత్రం చెరువులను ఆక్రమించినవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎవరైనా ఖాళీ చేయకపోతే సంబంధిత స్థలాన్ని 22ఏ లో పెట్టి క్రయవిక్రయాలకు వీల్లేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా రెండు చోట్ల చెరువు గట్ల మీద ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణాలు కూడా ప్రారంభించారు.

సర్పంచ్‌ ఫిర్యాదుతో కదిలిన డొంక

ఈ క్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని సానివాడ చెరువులో ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈ గ్రామంలోని బరాటం చెరువు ఆక్రమణలకు గురైందని, రెండు మూడు కుటుంబాల చేతుల్లో చిక్కుకుందని స్వయంగా గ్రామ సర్పంచే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో తమ స్వాధీనంలో ఉన్న భూమిని తీసుకోవాలని కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చెబుతున్నారు. ఈ రెండిరటిలో ఏది వాస్తవమో తేల్చాల్సిన రెవెన్యూ యంత్రాంగం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోంది. ఎందుకంటే.. జిల్లాలో ఏ రెవెన్యూ కార్యాలయంలోనూ సరైన రికార్డులు లేవు. ఉన్నవి కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ట్యాంపర్‌ అయిపోయాయి. చివరకు జిల్లాలో ఫేక్‌ పట్టాలు కూడా వెలుగుచూసిన సందర్భాలున్నాయి. ఏది అసలో, ఏది నకిలీయో తేల్చలేని పరిస్థితుల్లో తహసీల్దార్లు ఉన్నారు. గతంలో గార తహసీల్దార్‌గా పని చేసినవారిలో ఎవరైనా పట్టాలిచ్చారా? లేదా? అని కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు. కలెక్టర్‌ దీనిపై సీరియస్‌గా ఉన్నందున బరాటం చెరువులో ఆక్రమణలను తొలగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే గార తహసీల్దారు బృందం నిర్వహించిన సర్వే ఆధారంగా ట్రెంచ్‌ తవ్వాలని ప్రతిపాదన పంపించారు. దీంతో డ్వామా అధికారులు అంచనాలు రూపొందించి తహసీల్దారుకు సమర్పించి అనుమతి కోరినట్టు తెలిసింది. తహసీల్దారు అనుమతి వచ్చిన వెంటనే ఉపాధి హమీ పధకం కింద పనులు చేపట్టి శాశ్వతంగా చెరువు గర్భంలో ఆక్రమణలు తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.

ఆక్రమణలో పదెకరాలు

అంపోలు రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 199లో ఉన్న బరాటం చెరువు పూర్తి విస్తీర్ణం 19.53 ఎకరాలు. కానీ ప్రస్తుతం 9.50 ఎకరాలు మాత్రమే మిగిలింది. సుమారు 9.76 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. చెరువు గర్భాన్ని గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ఆక్రమించినట్టు వారు చెబుతున్నారు. దీనివల్ల సుమారు 200 ఎకరాల చెరువు ఆయకట్టుకు నీరందడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బరాటం చెరువు తన ఎగువ ప్రాంతంలో ఉన్న 163 ఎకరాలతో పాటు వానవానిపేట, తంగివానిపేట, సానివాడ, ఒప్పంగి తదితర గ్రామాల పరిధిలో ఆరు చెరువులకు నీటిని సరఫరా చేసి 728 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఆక్రమణల వల్ల రిజర్వు ట్యాంకుగా పని చేయాల్సిన బరాటం చెరువు నిర్వీర్యం అయిపోయిందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులో ఆక్రమణలను తొలగించడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను కొందరు రైతులు అడ్డుకున్నారు. ఆక్రమణదారుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని, అతనే కొందరు రైతులను రెచ్చగొట్టి సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెబుతున్నారు. అంతకుముందే ఆక్రమణలపై సానివాడ సర్పంచ్‌ లక్ష్మి జిల్లా కలెక్టర్‌తోపాటు గార ఎంపీడీవో, శ్రీకాకుళం, గార తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ గార, శ్రీకాకుళం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేయడంతో బరాటం చెరువును సర్వే చేసి హద్దులు ఫిక్స్‌ చేశారు.

ఫోర్జరీ పత్రాలతో కొందరి వాగ్వాదం

నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని కొందరు రైతులు చెబుతున్నారు. అయితే వీటిని ప్రభుత్వం జారీ చేయలేదని, అవి నకిలీవని తేలడంతో పట్టాదారు పుస్తకాలను రెవెన్యూ అధికారులు రద్దు చేశారని తెలిసింది. ప్రస్తుతం చెరువు గర్భంలో సాగుచేస్తున్న ఒకరు 1980లో మంజూరు చేసిందిగా చెబుతూ ఒక పత్రాన్ని రెవెన్యూ అధికారులుకు చూపించగా అది రెవెన్యూ శాఖ జారీ చేసినది కాదని అధికారులు తేల్చారని తెలిసింది. రెవెన్యూ రికార్డులు, ఎస్‌ఎల్‌ఆర్‌ ప్రకారం చెరువుగా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం చెరువు, శ్మశానవాటిక, రస్తాలో ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. దీనికి కూడా ప్రభుత్వం టార్గెట్‌ ఇచ్చి నిత్యం సమీక్షిస్తోంది. అందులో భాగంగానే ఆక్రమణలు తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్టు గార రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page