top of page

పలాస కేంద్రంగా కొత్త జిల్లా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 7
  • 3 min read
  • మరోసారి జిల్లాల పునర్విభజనకు సర్కారు సిద్ధం

  • కేబినెట్‌ భేటీలో స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సబ్‌ కమిటీకి ఆదేశాలు

  • రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కు పెరిగే అవకాశం

  • పలు జిల్లాల కేంద్రాలు, పరిధులు కూడా మారే ఛాన్స్‌

ree
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. బుధవారం జరిగిన కేబినెట్‌ మీటింగులో ఈ అంశం ప్రస్తావనకు రాగా దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని గతంలోనే నియమించిన మంత్రివర్గ ఉప సంఘాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సబ్‌ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్‌, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధనరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడే వైకాపా హయాంలో జరిగిన జిల్లా విభజన ప్రక్రియలో మరికొన్ని మార్పులు చేయనున్నారని స్పష్టమైంది. కాగా తాజా కేబినెట్‌ భేటీలో చర్చించిన ప్రకారం.. ఆయా ప్రాంతాల్లో కొత్త జిల్లాల డిమాండ్లు, జిల్లా పరిధి మార్పు.. వాటికి అనుగుణంగా నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీల సరిహద్దుల విషయంలో కూడా ప్రజల నుంచి అందే డిమాండ్లకు అనుకూలంగా మార్పులు చేర్పులతో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాల్లోని పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కానున్నాయి. మళ్లీ వాటి పరిధిలోకి కొన్ని నియోజకవర్గాలు చేరనున్నాయి. గత వైకాపా ప్రభుత్వం ఒకటి రెండు చోట్ల మినహా లోక్‌సభ నియోజకవర్గాలనే జిల్లాలుగా మార్చింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా 26 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రాతిపదికను కాదని ప్రజల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32కు పెంచాలని స్థూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కొత్త జిల్లాలకు డిమాండ్లు

గత ప్రభుత్వం జిల్లాలను విభజించినప్పుడే పలు ప్రాంతాల్లో అభ్యంతరాలు, కొత్త డిమాండ్లు వ్యక్తమయ్యాయి. కానీ నాటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. వాటిని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు మళ్లీ తాజాగా విజ్ఞప్తులు స్వీకరించి, మార్పులు చేర్పులు సూచించడం కేబినెట్‌ సబ్‌ కమిటీ బాధ్యత.

  • అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించి, అనేక నిర్మాణాలు చేస్తున్నందున గుంటూరు, క్రిష్టా జిల్లాల మధ్యనున్న అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి వేగం పుంజుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు చేరనున్నాయి.

  • శ్రీకాకుళం జిల్లాలో మొన్నటి విభజనలో రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో, పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాలను శ్రీకాకుళం జిల్లాలో ఉంచారు. కాగా పలాస కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు రాజధానివర్గాల సమాచారం. పలాసతోపాటు పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం అసెంబ్లీ సెగ్మెంట్లను విడదీసి పలాస జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఐదేళ్ల నుంచీ ఉంది.

  • నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలను కలిపి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు చేశారు. కానీ తాజాగా గూడూరు కేంద్రంగా సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో ఒక జిల్లా, మదనపల్లె కేంద్రంగా పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలను కలుపుతూ మరో జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి.

    ree
జిల్లా కేంద్రాల మార్పు
  • ఉమ్మడి అనంతపురం జిల్లాను వైకాపా సర్కారు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలుగా విభజించింది. సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కేంద్రంగా చేసింది. అయితే ఆ జిల్లాకు హిందూపురాన్ని కేంద్రంగా మార్చాలన్న డిమాండ్లు అప్పట్లోనే వెల్లువెత్తాయి. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. అందువల్ల సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

  • ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట.. చిత్తూరు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి రాయచోటి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయగా.. ఆ జిల్లాకు రాజంపేటను కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ అప్పట్లో చాలా పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • ఉమ్మడి కర్నూలు జిల్లాను పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజించారు. కానీ వాటికి అదనంగా ప్రముఖ వాణిజ్య ప్రాంతమైన ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అది సాకారమైతే.. పత్తికొండ, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు ఆదోని జిల్లాలో చేరే అవకాశం ఉంది.

  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను విడదీసి ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు చేశారు. కానీ కొత్త పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం కాకుండా నరసాపురాన్ని కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌ ఉంది.

  • గతంలో కృష్ణా జిల్లాలో ఉండి.. ప్రస్తుతం ఏలూరు జిల్లాóలో చేరిన నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే కలపాలన్న డిమాండ్లు ఉన్నాయి.

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page