పలాసలో భూ ఆక్రమణలపై పవన్‌కు ఫిర్యాదు
- SATYAM DAILY
- Nov 25
- 1 min read
తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పలాసలో పదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హుద్ హుద్ తుపాన్ బాధితుల ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసైనికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రతినిధులను కలిసి ఆక్రమణలపై వివరించి ఫిర్యాదు అందించారు. హుద్‌హుద్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పక్కనే రెండుచోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణల పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. హుద్‌హుద్ బాధితుల కోసం పదేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను దశాబ్దం గడిచినా బాధితులకు పంపిణీ చేయలేదని ఫిర్యాదులో వివరించారు. బాధితులకు ఇళ్లు పంపిణీ చేయకపోవడంతో కొందరు ఆక్రమణదారులు హుద్‌హుద్ ఇళ్ల పరిసర ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. పదేళ్లుగా హుద్‌హుద్ బాధితులకు ఇళ్లు అందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పంపిణీ చేయకుండానే కొన్ని శిథిలావస్థకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్రమార్కులు ఖాళీ స్థలాలను ఆక్రమించి చదును చేస్తున్నారని, భూ ఆక్రమణలను పరిశీలించి, తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హుద్‌హుద్ ఇళ్ల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖను ఆదేశించాలని కోరారు. హుద్‌హుద్ బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుని అర్హులకు ఇళ్ల కేటాయింపులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని కోరారు.










Comments