పవన్ సార్.. మీ మాట వినట్లేదు!
- Prasad Satyam
- Sep 20
- 1 min read
మువ్వల నగేష్ కేసు రీవోపెన్
విచారణాధికారిపై అసంతృప్తి
కోర్టు ఆదేశాలు ఖాతరుచేయడంలేదంటున్న బాధితులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సుగాలి ప్రీతి కేసు మాదిరిగానే జనసేన పార్టీకి, లేదా కూటమి ప్రభుత్వానికి మరో చిక్కుముడి మెడకు చుట్టుకోనుందా? అంటే.. అవుననే సమాధానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. సుగాలి ప్రీతి కేసులో అప్పటి ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపించిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ కేసులో తమకు న్యాయం చేయలేకపోయారని ప్రీతి తల్లి ఈమధ్య మీడియాకెక్కడం చూశాం. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి సమాధానాలు దొరకని కేసొకటి జనసేన పరిష్కరించాల్సి వుంది. వివరాల్లోకి వెళితే..
2021 జనవరి 26న మువ్వల నగేష్ అనే బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి రణస్థలం మామిడితోటల్లో శవమై కనిపించాడు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన నగేష్ ఎచ్చెర్ల శివానీ కాలేజీలో బీటెక్ చదువుతూ రిపబ్లిక్ దినోత్సవం సెలవుకు బయటకు వెళ్లి శవమైపోయాడు. దీనిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అప్పట్లో ఆందోళన చేశారు. పోలీస్ కేసు నమోదైంది. కానీ మిస్టేక్ ఆఫ్ ఫేక్ట్ అని జేఆర్ పురం పోలీసులు కేసు క్లోజ్ చేశారు. దీంతో మృతుడి సోదరుడు మేఘనాథ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని అప్పట్లో కోరారు. 2023లో పవన్ కళ్యాణ్ రణస్థలంలో యువశక్తి సభ నిర్వహించినప్పుడు మువ్వల నగేష్‌ను చంపినవారిని కఠినంగా శిక్షిస్తామని, నగేష్ తల్లి సుందరమ్మకు న్యాయం చేస్తామని సభలో ప్రకటించారు. ఆమేరకు సుందరమ్మకు రూ.లక్ష అందజేశారు. ప్రకటించిన మేరకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడపల్లి జ్యోతిర్మయి అనే న్యాయవాదిని పంపి కేసును స్టడీ చేయించారు. ఆమె శ్రీకాకుళం మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసును రీఓపెన్ చేయాలని పిటిషన్ వేయడంతో కోర్టు కూడా అందుకు అంగీకరించింది. ఆ మేరకు ఎస్పీ టెక్కలి సీఐని కేసును రీ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జిషీటు వేయాలని ఆదేశించారు. కోర్టు లెక్కల ప్రకారం వారానికి ఒక రిపోర్టును కోర్టుకు సబ్మిట్ చేయాల్సివుండగా, ఇప్పుడు రెండు నెలలకు రెండుసార్లు మాత్రమే కోర్టుకు నివేదిక ఇచ్చారని, తన తమ్ముడ్ని చంపినవారు ఇంకా కాలేజీలోనే ఉన్నారని, వారిని విచారించకుండా తాత్సారం చేస్తున్నారంటూ మేఘనాథ్ చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు సైతం పోలీసులు పట్టించుకోకపోవడంపై నగేష్ తల్లి సుందరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










Comments