top of page

పశువుల కోసం ప్రత్యేకమైన కాలనీ

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 2
  • 2 min read
  • చరిత్ర కలిగిన న్యూకాలనీలో ప్రయాణించడం అంత సులువు కాదు

  • ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీల సమస్యకు తోడు పశువులకొట్టంగా మారిన వైనం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

శ్రీకాకుళం న్యూకాలనీలో ఎవరుంటారు? ఈ ప్రశ్నకు ఒక దశాబ్దం క్రితమైతే బాగా పేరుమోసినవారు, డబ్బున్నవారు, అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారు అని ఠక్కున చెప్పేవారు. ఆ తర్వాత న్యూకాలనీలో ఎవరుంటారులే అనే నిర్లిప్తత కనిపించిందంటే.. అందుకు కారణం ఇక్కడ నివాస ప్రాంతాల్లో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీలు భవనాలను అద్దెకు తీసుకోవడమే. దీంతోనే అక్కడ ఉన్నవారు వేగలేకపోతున్నామని ఆమధ్య స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను పిలిచి ఓ శాలువ కప్పి మా మొర ఆలకించండి మహాప్రభో అంటూ ఓ సమావేశం పెట్టారు. అంతకు ముందు అనేకమార్లు కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. అప్పట్లో కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతులు ఏమేరకు పరిష్కారమయ్యాయో పక్కన పెడితే ఇప్పుడు న్యూకాలనీలో ఎవరుంటున్నారు? అన్న ప్రశ్న మరొకసారి వేసుకోవాలి. అదే న్యూకాలనీలో ఇప్పుడు ఆవులు, గేదెలు.. ఒక్క మాటలో చెప్పాలంటే పశువులు ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇక్కడ నివసించేవారు ఇళ్లకు వెళ్లాలంటే పగలు ట్రాన్స్‌పోర్ట్‌ లారీలు సైడివ్వాలి.. రాత్రులు పశువులు పక్కకు తప్పుకోవాలి. ఈ రెండూ జరిగితే కుక్కలు పిక్కలు పీకేయకుండా ఉంటే ఇంటికెళ్లగలరు. లేదూ అంటే దైవాదీనం. జిల్లాలోనే మొట్టమొదటి ప్లాన్‌ అప్రూవ్డ్‌ లేఅవుట్‌ ఇది. మిగతా ప్రాంతాల మాదిరిగా అంటే.. ఏపీహెచ్‌బీ కాలనీలో ఎంఐజీ, ఎల్‌ఐజీల మాదిరిగాకాకుండా 12 సెంట్లలో ఒక ప్లాట్‌ను ఏర్పాటుచేసిన సువిశాలమైన లేఅవుట్‌ ఇది. అటువంటిది ఇక్కడ ఇప్పుడు పశువులకు ఆవాసంగా మారిపోవడం కొసమెరుపు. న్యూకాలనీలో మెయిన్‌ రోడ్డులో చైతన్య విద్యాసంస్థ ఉంది. ఈ రోడ్డు మీద సాయంత్రం విద్యార్థులు వెళ్లిపోయిన తర్వాత పశువులొస్తాయి. ఆవులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు గానీ మొత్తం ఈ రోడ్డంతా విచ్చలవిడిగా వాడుకుంటాయి. వీటిని తప్పిస్తూ పక్కనే గుంపులుగా ఉన్న శునకరాజంల మీదకు వెళ్లి ఇంజక్షన్లు ఇప్పించుకున్న స్థానికులు కోకొల్లలు. పోనీ ఈ రోడ్డు నిండా గోవులున్నాయని ఉదయం వాటికి దండం పెడుతున్నాం కాబట్టి రాత్రులు గౌరవిద్దామని పక్క రోడ్డు నుంచి అంటే న్యూకాలనీ మెయిన్‌ రోడ్డు (సూర్యమహల్‌ రోడ్డుకు కనెక్టివిటీ వయా ఎక్సైజ్‌ సీఐ ఆఫీస్‌) మీదుగా వెళ్దామని భావించి టర్న్‌ తీసుకుంటే అక్కడ మరో గ్రూప్‌ ఆవులు తిష్టవేసి కనిపిస్తాయి. అసలు మీరు ఆవుల వరకు పోవాలంటే ముందు నన్ను దాటాలి కదా అని బాకర్‌సాహెబ్‌ పేట మీద నుంచి న్యూకాలనీకి టర్న్‌ తీసుకునే రోడ్డులో సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే చల్లా లక్ష్మీనారాయణ ఇంటి రోడ్డులో గేదెలు హఠం వేసుకొని రోడ్డు మొత్తాన్ని ఆక్రమించేస్తాయి. ఈ ప్రాంతంలో పాల వ్యాపారం చేసే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వీరంతా ఏమేరకు పాలమ్ముతున్నారో తెలియదు కానీ, గేదెలను మాత్రం రోడ్డుపైనే వదిలేస్తున్నారు. వీటిని తప్పించుకొని న్యూకాలనీ మీదుగా ప్రయాణించడం ఇప్పుడొక సాహసకృత్యమే. కొద్ది రోజుల క్రితం వరకు బాకర్‌సాహెబ్‌పేట 786 అపార్ట్‌మెంట్‌ ఎందురుగా గేదెలు ఇలాగే రోడ్డు మీదే ఉండేవి. రాత్రింబవళ్లు ఈ రోడ్డు మీద ట్రాఫిక్‌జామ్‌ కనిపించేది. అప్పట్లో మున్సిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య గేదెలను ఇంటిలో కట్టకపోతే ఎత్తుకుపోయి బజారులో అమ్మేస్తామంటూ వార్నింగ్‌ ఇవ్వడంతో వీటిని ఇప్పుడు రోడ్డు మీదకు విడిచిపెట్టడంలేదు. ఈ సమస్య తీరిందనేసరికి చల్లా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర గేదెల మీటింగ్‌ నిత్యకృత్యమైపోయింది. 2019`24 మధ్య మున్సిపల్‌ వ్యవహారాలు లక్ష్మీనారాయణ తనయుడు చల్లా శ్రీను చూసినన్నాళ్లూ ఈ సమస్య తలెత్తలేదు. ఇప్పుడు ఆ కుటుంబం కూడా అక్కడ ఉండకపోవడంతో రోడ్డును ఈ పశుపోషకులు తమ సొంతానికి వాడుకుంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page