బెల్లూబ్రేకుల్లేని అవినీతి రవాణా!
- Prasad Satyam
- Sep 27, 2025
- 3 min read
పేరుకే ఆన్‌లైన్ విధానం.. ఏజెంట్లదే రాజ్యం
పని జరగాలన్నా.. పత్రం కావాలన్నా.. వారే శరణ్యం
నేరుగా దరఖాస్తు చేస్తే నిలుగాళ్ల నిరీక్షణే
ఆ శాఖ అధికారులు, సిబ్బందిపైనే లెక్కలేనన్ని అవినీతి కేసులు

(సత్యం న్యూస్, శ్రీకాకుళం)
వాహనాలు, వాటి డ్రైవర్ల ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తూ.. ప్రమాదాలకు బ్రేకులు వేయాల్సిన రవాణా శాఖే ఫిట్‌నెస్ కోల్పోతోంది. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల తర్వాత అత్యధిక ఆదాయం సమకూర్చి పెడుతున్న ఈ శాఖ అదేస్థాయిలో అధికారులు, ఉద్యోగులకు అక్రమార్జన వనరుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఈ శాఖ నిర్వహణ విధానంలో పారదర్శకత లోపించడమేనని అంటున్నారు. రవాణా శాఖలోనూ ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వచ్చిందని.. మీసేవ ద్వారానో, ఆన్‌లైన్‌లోనూ మనకు కావలసిన పత్రాలు, లైసెన్సుల కోసం ఒక్క దరఖాస్తూ సబ్‌మిట్ చేసేస్తే అన్నీ మన ఇంటికే వచ్చేస్తాయన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణకు నోచుకోవడంలేదు. ఈ శాఖలో కార్యకలాపాలపై అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. ఇక్కడి పని విధానం తెలిసినవారికి, ఈ కార్యాలయాల్లో పనిచేసే వారితో సన్నిహిత సంబంధాలు నెరిపే వారికి మాత్రమే పనులు జరుగుతాయి. వెబ్ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చాక ఈ విధానంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ, ఫీజుల చెల్లింపు విషయంలో మాత్రం మార్పు రాలేదు పైగా.. వెబ్ ఆధారిత సేవల పేరుతో ఛార్జీలు పెరిగాయని అంటున్నారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా పాలనాధికారిగా ఉప రవాణా కమిషనర్(డీటీసీ) ఉండేవారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా రవాణా అధికారి(డీటీవో) పర్యవేక్షిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ పరిపాలన కార్యాలయం జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న తండ్యాంవలసలో ఉంటే డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్, వాహనాలకు సంబంధించిన ఇతర ధ్రువపత్రాల జారీకి నిర్వహించే పరీక్షలను ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ వెనుక కొండపై జరుపుతున్నారు. ఆ విధంగా రెండు జిల్లా కార్యాలయాలు కలిగిన ఏకైక శాఖగా పేరొందింది.
లైసెన్స్ ప్రక్రియ అపహాస్యం
వెబ్ ఆధారిత లైసెన్స్ ప్రక్రియలో మొదట ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకుని ఈ రసీదు తీసుకుని ఎచ్చెర్ల కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ద్వారా అభ్యర్ధికి వాహనం నడపటంలో, ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్‌పైన ఉన్న కనీస అవగాహన పరిశీలించి వెంటనే ఎల్‌ఎల్‌ఆర్ జారీచేయాలి. కానీ ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తు మొదలుకొని శాశ్వత లైసెన్స్ జారీ వరకు అన్నీ ఆ శాఖాధికారులతో నిత్యం టచ్‌లో ఉండే కొందరు ఏజెంట్ల ద్వారా వెళ్తే నే పని జరుగుతుంది. నేరుగా వెళ్లే అభ్యర్థులు సీబీటీ పరీక్షలో కచ్చితంగా విఫలమవుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఏజెంట్లు దరఖాస్తుదారుల నుంచి ‘అన్నింటికీ కలిపి వసూలు చేసే ధర’ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని నెలల క్రితం వరకు రవాణా శాఖాధికారులే వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ జారీ చేసేవారు. తద్వారా కాసుల వర్షం కురిపించుకునేవారు. కానీ ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పటం రవాణా అధికారులకు మింగుడుపడని అంశం. ఒకప్పుడు కార్యాలయంలో కూర్చుని సంపాదించే రవాణా అధికారులు ఇప్పుడు రోడ్లపైన కూడా కాసులు దండుకుంటున్నారు. రోడ్లపై తిరిగే ఏ వాహనాన్ని ఆపినా ధ్రువపత్రాలు లేకపోవడమే, వాహనాల్లో లోపమో కచ్చితంగా కనిపిస్తాయి. ఇవేవీ లేకపోతే వాహన నిర్మాణంలో లేదా తరలిస్తున్న సరకు విషయంలో చిన్న లోపం కనిపిస్తే చాలు.. దాన్ని చూపించి కాసులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లాలో లేదా రాష్ట్రంలో విస్తృతంగా వాణిజ్య వాహనాలు నిర్వహించే సంస్థల వారు అడగకుండానే అందించే బహుమతులు, మామూళ్లను లెక్క కట్టలేమని అంటున్నారు.
అడ్డొస్తారనుకుంటే.. వేటే
ఈ శాఖలో పనిచేసే అధికారులు ఎంత ప్రభావవంతులు అంటే.. తమ రోజువారీ కార్యకలాపాలకు అడ్డు వచ్చే, తమ మాట చెల్లుబాటు కానివ్వని ఉన్నతాధికారులను ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణంలో రాత్రికి రాత్రి బదిలీ చేయించగల సమర్ధులు. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిస్తే.. 2022 జులైలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖాధికారులకు సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆ సమయంలో ఆ శాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ ఉన్నారు. ఎవరి మాట వినని ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆయన కమిషనర్‌గా ఉంటే తాము కోరుకున్న స్థానాలకు బదిలీ జరగదనే ఉద్దేశంతో అతన్ని రాత్రికి రాత్రి బదిలీ చేయించేశారు. తమ కార్యాలయాలపైన, తమపైన నిఘా ఉంచి దాడులు చేసే అవకాశం ఉన్న విజిలెన్స్, ఏసీబీ వంటి నిఘా విభాగాల అధికారులను కూడా పలువురు రవాణా అధికారులు మేనేజ్ చేస్తున్నారని ప్రచారం బలంగా ఉంది. 2014-19 మధ్య కాలంలో ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో అధికశాతం రవాణా శాఖ అధికారులకు చెందినవే కావటం వారి అవినీతి స్థాయిని తెలియజేస్తుంది. ఆ ఐదేళ్లలోనే సుమారు 20 మంది రవాణా శాఖాధికారులు ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఇలా వరుసగా ఏసీబీ దాడులు జరగడం వెనుక అప్పటి రవాణా కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయన్ను బదిలీ చేయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఉప రవాణా కమిషనర్ నుంచి అటెండర్ స్థాయి వరకు యథాశక్తి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా ఉప రవాణా కమిషనర్ ఆదిమూలం మోహన్ మొదలుకొని నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే నరసింహారెడ్డి వరకు ఎవరిని ఏసీబీ వదలలేదు. అయితే ఏసీబీ నమోదు చేసిన కేసులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.
జిల్లాలో కేసులకు కొరత లేదు
ఇక జిల్లా విషయానికి వస్తే.. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన బాలనాయక్‌పై 2015 నవంబర్‌లో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అప్పట్లో గాజువాకలో పనిచేసిన ఈ జిల్లాకు చెందిన సంపతిరావు రమేష్‌పై కూడా అదే సమయంలో ఏసీబీ దాడులు చేసింది. ఇచ్ఛాపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన నేతల రమేష్ తన ఏజెంట్ నుంచి లంచం తీసుకుంటూ 2015 జులైలో ఏసీబీకి చిక్కటం జిల్లాలో సంచలనం సృష్టించింది. 2016 నవంబర్‌లో ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో పని చేసిన డి.పి.రంగారావుపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదైంది. 2017 మేలో జిల్లా రవాణా శాఖాధికారిగా ఉన్న హైమారావుపైనా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఇక 2024 మార్చి వరకు ఇచ్ఛాపురంలో నిర్వహించిన అంతర్ రాష్ట్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్ట్ మూతపడే వరకు ఆ శాఖ అధికారులకు ‘కాసుల’ వర్షం కురిపించింది. ఇంత అవినీతి జరుగుతున్నా సమగ్ర తనిఖీ ప్రాంగణంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు కూడా రవాణా శాఖాధికారులు దొరికేవారు కాదు. కారణం ‘కాసుల వర్షం’లో అందరూ తడిసినవారే. ప్రతినెలా అందే మంత్లీల్లో ఒక శాఖ అధికారుల మధ్య వాటాల పంపకంలో వచ్చిన తేడాలు చివరకు చెక్‌పోస్ట్‌పై దాడులకు దారితీసి రవాణా అధికారుల అరెస్ట్ వరకు వెళ్లాయి. అయినా రవాణా శాఖలో వీసమెత్తు మార్పు లేదు. వ్యవస్థతోపాటే అవినీతి కూడా అప్‌గ్రేడ్ అవుతూ వస్తోంది.










Comments