top of page

ఫేట్‌ మార్చిన ఫోటో!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 23, 2025
  • 2 min read
  • వైరల్‌ అవుతున్న శ్రామిక మహిళ యోగాభ్యాస దృశ్యం

  • దాన్ని ఫోన్‌లోనే బంధించిన సృజనశీలి హేమచంద్ర

  • ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం.. కళారంగంలో ప్రవేశం

  • శిల్పిగా, ఫొటోగ్రాఫర్‌గా, కవిగా, గాయకుడిగా రాణింపు

వెయ్యి మాటల్లో చెప్పలేనిది ఒక్క పొటో చెప్పగలదు. దీన్ని మరో విధంగా చాటి చెబుతూ సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ వర్గాల్లో విపరీతంగా వైరల్‌ అవుతున్న ఒక ఫొటో కథ ఇది.

‘యోగాను సైన్స్‌ ఎందుకు అంగీకరించదు?’ అన్న శీర్షికతో ఈ నెల 21న సంచలన సాయంకాల పత్రిక సత్యంలో ప్రచురితమైన కథనానికి ఒక శ్రామిక మహిళ యోగా చేస్తున్న ఫొటోను ఉపయోగించిన విషయం పాఠకులు గమనించే ఉంటారు.

సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్‌ అయిన ఆ ఫొటో విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా వెళ్లింది. ఆయన దాన్ని మీడియా సమావేశంలో చూపుతూ తమ ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం మన సనాతన విద్య అయిన యోగాను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో విజయం సాధించిందనడానికి ఈ ఫొటోయే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఇంత సంచలనం సృష్టించిన సదరు ఫొటో తీసిన వ్యక్తి.. అందులో ఉన్న మహిళ.. ఎవరన్న ఆసక్తి ఇప్పుడు పెరిగింది. సృజనాత్మకత ఉట్టిపడుతున్న ఈ ఫొటోను తీసిన వ్యక్తి కాకలుతీరిన ఫొటోగ్రాఫరూ కాదు.. జర్నలిస్టిక్‌ వ్యూ కలిగిన కెమెరా జర్నలిస్టూ కాదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆయన పోలీస్‌ శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌. పేరు దివిలి హేమచంద్ర. స్వగ్రామం గార మండలం శ్రీకూర్మం. ఉద్యోగరీత్యా ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉంటున్నారు. ఆ ఫొటోకు ప్రేరణగా నిలిచిన మహిళ ఒక ఉపాధి హామీ పథకం కూలీ. పేరు కలగ దానమ్మ. గార మండలం సెగిడిపేట వాస్తవ్యురాలు. యోగాంధ్ర కార్యక్రమానికి సన్నాహకంగా ఈ నెల 16న శ్రీకూర్మంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న దానమ్మ యోగాభ్యాసం చేస్తున్న దృశ్యాన్ని ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ హేమచంద్ర తన మొబైల్‌ ఫోనులో బంధించారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌ అయ్యి.. ప్రశంసలు కురిపిస్తోంది.

పోలీసు కుటుంబం

ఒక్క ఫొటో కారణంగా రాత్రికి రాత్రే వార్తల్లో వ్యక్తిగా మారిన హేమచంద్రది పోలీసు కుటుంబం. ఆయన తండ్రి దివిలి అప్పారావు ప్రముఖ శిల్పకారుడు. రిటైర్డ్‌ డైట్‌ లెక్చరర్‌ అయిన ఆయన 2018లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న అవార్డు పొందిన ప్రతిభావంతుడు. 2011లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి ఉగాది పురస్కారం. 2009లో మద్రాస్‌ తెలుగు అకాడమీ పురస్కారం కూడా అందుకున్న ప్రతిభాశాలి. ఆయనకు ముగ్గురు కుమారులుండగా అందరూ పోలీసు శాఖలోనే పని చేస్తుండటం విశేషం. పెద్ద కుమారుడు ప్రస్తుతం సీఐడీ విభాగంలో సీఐగా, రెండో కుమారుడు విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా చిన్న పుత్రుడు హేమచంద్ర శ్రీకాకుళం ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంలో కానిస్టేబల్‌గా పని చేస్తున్నారు. 2004లో ఉద్యోగంలో చేరిన హేమచంద్ర ఫొటోగ్రఫీని హాబీగా చేసుకున్నారు. ఈ రంగంలో ఎటువంటి సాంకేతిక కోర్సులు చేయకుండా కేవలం ఉత్సాహంతో గతంలో తన వద్ద ఉన్న కెమెరాతో ఫొటోలు తీయడం ప్రారంభించి.. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోనుతోనే అద్భుతమైన ఫొటోలు తీస్తున్నారు.

బహుళ రంగాల్లో ప్రతిభ

హేమచంద్ర చేసేది పోలీసు ఉద్యోగమే అయినా కళల పట్ల అమితమైన అభిరచి, ఇష్టం ఉన్న వ్యక్తి. తండ్రి నుంచి వారసత్వంగా శిల్పకళను కూడా పుణికిపుచ్చుకున్నారు. ఖాళీ సమయాల్లో శిల్పాలు తయారు చేస్తుంటారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌ శ్రీకేష్‌ లాట్‌కర్‌ సూచన మేరకు ఒకటిన్నర అడుగుల అరసవల్లి సూర్యనారాయణస్వామి మినియేచర్‌ విగ్రహాన్ని తయారు చేశారు. దాన్ని 2023లో ఉగాది రోజు ఆవిష్కరించారు. అలాగే ఇటీవల బాపూజీ కళామందిర్‌లో ఆవిష్కరించిన ప్రముఖ గాయకుడు జి.ఆనంద్‌ విగ్రహాన్ని కూడా ఈయనే తయారుచేశారు. ఆర్డర్లపై కూడా విగ్రహాలు చేస్తుంటానని హేమచంద్ర చెప్పారు. దీంతోపాటు ఫొటోగ్రఫీపై కూడా చిన్నతనం నుంచీ అభిలాష పెరిగిందన్నారు. ఆ ఆసక్తితోనే ఎక్కడికి వెళ్లిన ఫొటోలు తీయడం అలవాటుగా మారింది. గతంలో తన వద్ద ఉన్న కెమెరాతో ఇప్పుడు అండ్రాయిడ్‌ ఫోన్‌తోనే సృజనాత్మకత ఉట్టిపడే ఫొటోలు తీస్తున్నారు. ఎక్కువగా ప్రకృతి అందాలను, చారిత్రక ప్రాంతాలను తన ఫొటోల్లో బంధిస్తుంటారు. ఈ జిజ్ఞాసే ఇప్పుడు రాష్ట్రస్థాయిలో అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా హేమచంద్ర కవితలు రాస్తుంటారు. గొంతు సవరించుకుని గాయకుడిగా కూడా రాణిస్తున్నారు. స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో పాటలు పాడి ఆహూతులను రంజింపజేస్తుంటారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page