top of page

ఫిర్యాదిస్తావా.. అంతు తేలుస్తాం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 16, 2024
  • 2 min read
ree
  • రాగోలు ఇసుక ఫిర్యాదుదారుడిపై దాడి

  • కారును ధ్వంసం చేసి.. కాలువలో పడేసి

  • అడ్డుకున్నవారిని ఢీకొట్టి పారిపోయిన సురేష్‌

  • వెంబడిరచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రగడ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్థానిక రాగోలు నుంచి దూసి రోడ్డు, జెమ్స్‌ ఆసుపత్రి వెనుక అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నాయని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌కు ఫిర్యాదు చేసిన ఆమదాలవలస నియోజకవర్గం గుత్తావిల్లికి చెందిన సనపల సురేష్‌ మీద అక్రమ ఇసుకను దందా చేస్తున్నవారు బుధవారం సాయంత్రం మూకుమ్మడి దాడి చేశారు. ఈ నెల 15న రాగోలు పరిధిలో అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నాయని సనపల సురేష్‌ ఫిర్యాదు చేశారు. ఎప్పట్నుంచో ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇసుక అక్రమ దందాలపై సనపల సురేష్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తునే ఉన్నారు. అందులో భాగంగా గత నెల 27న కూడా సురేష్‌ మీద దాడి జరిగిందని స్వయంగా బాధితుడే పోలీసులకు తెలిపారు. అయితే అప్పుడు దీని మీద పోలీసులు చర్యలు తీసుకోపోవడం వల్ల తాజాగా బుధవారం ఆయనపై మూకుమ్మడి దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.. రాగోలు, జెమ్స్‌ ఆసుపత్రి వెనుక ఇసుక నిల్వలు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు నిర్వహించి, దాన్ని సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఫిర్యాదు చేసిన సురేష్‌ బైట్‌ కావాలని ఒక ఛానల్‌ కోరడంతో ఆయన బుధవారం ఆయన కారు మీద కొందరు మీడియా ప్రతినిధులతో రాగోలు చేరుకున్నారు. ఈలోగా అక్కడే ఉన్న ఇసుకను అక్రమంగా తరలించిన బ్యాచ్‌ సురేష్‌ కారును అడ్డగించి దాడి చేయబోయారు. పెద్ద ఎత్తున మూక రావడంతో భయపడిపోయిన సురేష్‌ వారి మీదుగా వాహనాన్ని పోనిచ్చారు. ఇందులో పురుషోత్తపురానికి చెందిన సాయి, సరుబుజ్జిలికి చెందిన ధనుంజయ, తుంగపేటకు చెందిన అశోక్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన అక్రమ ఇసుక వాటాదారులు సురేష్‌ను వెంబడిరచి బలగ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర ఆయన వాహనాన్ని అడ్డగించి పెద్ద ఎత్తున దాడి చేశారు. పక్కనే ఉన్న కాలువలో పడేసి ఆయనపై ఇష్టానుసారం చెయ్యి చేసుకున్నారు. దగ్గరలో ఉన్న పోలీసులు సురేష్‌ను కాపాడి టూటౌన్‌కు తరలించగా, ఎమ్మెల్సీ కోసం రిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదిలా ఉండగా, శ్రీకాకుళం నియోజకవర్గ పరిధి రాగోలు వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వర ఇండస్ట్రీస్‌ షెడ్‌ ఆవరణలో సర్వే నెంబరు 45/1పిలో 378.582 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇదే ప్రాంతంలో ఉన్న జేఎన్‌టీ వెడ్డింగ్‌ ఈవెంట్స్‌ షెడ్‌ ఆవరణలో 53.20 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను సీజ్‌ చేశారు. ఈ రెండూ కాకుండా జెమ్స్‌ ఆసుపత్రి వెనుక జగనన్న కాలనీకి దగ్గరలో సర్వే నెంబరు 173లో 21 క్యూబిక్‌ మీటర్లు, సర్వే నెంబరు 195/1లో 15.27 క్యూబిక్‌ మీటర్లు, 19.84 క్యూబిక్‌ మీటర్లు, సర్వే నెంబరు 155లో 54 క్యూబిక్‌ మీటర్లు కలిపి 541.892 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఈ మూడుచోట్లా సీజ్‌ చేశారు. వీటిని తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను కూడా రూరల్‌ ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page