top of page

బలి కోరుతున్నబహుముఖ ప్రేమ!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 13 hours ago
  • 3 min read
  • వరుసగా రెండు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం

  • సృజన్‌ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు

  • లోకేష్‌ది ఏకంగా హత్యేనన్న అనుమానాలు

  • `స్వాతి విషయంలోనూ ఏం జరిగిందో తెలియాలంటున్న కుటుంబ సభ్యులు


ree

కొద్దిరోజుల క్రితం ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో బీటెక్‌ విద్యార్థి పత్తిపాటి సృజన్‌ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్యాంపస్‌లో ప్రతి ఏటా ఒకరిద్దరు ఇదే పని చేస్తుండటంతో రొటీన్‌గానే ఈ కేసును ముగించేయాలని అటు యాజమాన్యం, ఇటు పోలీసులు భావించారు. కానీ గుంటూరు నుంచి వచ్చిన సృజన్‌ కుటుంబీకులు తమవాడిది ఆత్మహత్య కాదని, హత్యకు గురై ఉంటాడని, ఒకవేళ ఆత్మహత్య అయినా అందుకు కారకులు వేరే ఉంటారని ఆందోళన చేయడంతో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానందతో పాటు జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్సైలు వి.సందీప్‌కుమార్‌, జి.లక్ష్మణరావు, వై.మధుసూదనరావులు దర్యాప్తు చేసి ఎనిమిది మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వాస్తవానికి సృజన్‌ ఇంజినీరింగ్‌ ట్రిపుల్‌ ఈ బ్రాంచిలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసిన ఎనిమిది మందిలో ముగ్గురు రిమాండ్‌లో ఉన్నారు. మిగిలినవారి మీద విచారణ కొనసాగుతోంది.

...

విజయనగరం ఎంఆర్‌ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ పరిధి చినరావుపల్లి గ్రామానికి చెందిన అన్నెపు లోకేష్‌ (18) ఈ ఏడాది ఫిబ్రవరి 25న మృతి చెందాడు. తన రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు కాబట్టి ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లోకేష్‌ది ఆత్మహత్య కాదని కచ్చితంగా హత్యచేసి ఉంటారని మృతుడి సోదరుడు సంతోష్‌కుమార్‌ విజయనగరం పోలీసు యంత్రాంగంతో ఒక యుద్ధమే చేస్తున్నారు. రెండు రోజులకోసారి శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్తూ.. కేసు దర్యాప్తు కోసం, తన సోదరుడి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు.

...

తాజాగా గార మండలం తోణంగి గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని విజయనగరం ఎంఆర్‌ కాలేజీలో డిగ్రీ చదువుతూ బీసీ హాస్టల్‌లో ఉంటోంది. మంగళవారం ఆమె తన హాస్టల్‌ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ నోట్‌లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పేర్కొంది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో చనిపోయిన సృజన్‌ది హత్యా, ఆత్మహత్యా అన్న విషయం పక్కన పెడితే ఆయన మరణానికి ప్రధాన కారణం ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీనే. తనతో ప్రేమలో ఉన్నానంటూ ఇన్నాళ్లూ బాసలు చేసిన ఇదే ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఒక విద్యార్థిని సమాంతరంగా మరికొందరితో ఇటువంటి ప్రేమ వ్యవహారమే నడుపుతున్న వ్యవహారంలోనే సృజన్‌ హింసకు, మనస్తాపానికి గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారంటున్నారు. పోలీసులు ఎనిమిది మంది సీనియర్లను విచారణకు తీసుకుని వారిలో ముగ్గుర్ని రిమాండ్‌కు పంపారంటే.. ప్రాథమికంగా సృజన్‌ మరణంతో వారి పాత్ర ఉండి ఉంటుందని పోలీసులు భావించే ఉంటారు. ట్రిపుల్‌ ఐటీ మేనేజ్‌మెంట్‌ కూడా ఈ ఎనిమిది మందిని టీసీలు ఇచ్చి పంపించేసిందంటే ఈ ఘటనపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చే ఉంటారని రూఢీ అవుతోంది. విశ్వసనీయ సమచారం ప్రకారం.. అనుమానితులైన ఎనిమిది మంది విద్యార్థులు ఈ ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే సృజన్‌ను ఒకరోజు రాత్రి చితకబాదారు. ఆ మరుసటి రోజు వారు పరీక్షకు వెళ్తూ పరీక్ష నుంచి తిరిగి వస్తే మరో రౌండ్‌ వేస్తామని సృజన్‌ను హెచ్చరించారని తెలిసింది. ఆ భయంతోనూ, మనస్తాపంతోనూ అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిసింది. అందుకే సృజన్‌ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మరణాన్ని సాధారణంగా తీసుకోలేదు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయడంతో కొద్దిరోజుల క్రితం జిల్లాకు చెందిన పోలీసు అధికారులు కమిషన్‌ ముందు హాజరైనట్లు తెలుస్తుంది.

ఆత్మహత్య వాదనను తిరస్కరిస్తున ఆధారాలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయనగరం ఎంఆర్‌ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతూ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్న లోకేష్‌ది అసలు ఆత్మహత్యే కాదన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈమేరకు పోస్టుమార్టం రిపోర్టు కూడా లోకేష్‌ను ముందే హత్య చేసి ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడదీశారని నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే పోస్టుమార్టం నివేదిక పోలీసుల వద్దకు చేరడంతో ఈ కేసును ఎలా డీల్‌ చేయాలా? అని చూస్తున్నట్లు భోగట్టా. నరేష్‌ మృతదేహాన్ని చినరావుపల్లికి తీసుకువచ్చినప్పుడే ఆయన మెడ మీద వైర్‌ బిగించి ఊపిరాడకుండా చేసినట్లున్న ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. అదే సమయంలో అబ్బాయిల హాస్టల్‌లో ఉరి పోసుకోడానికి చీర ఎలా వచ్చిందన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీశారు. ఇక్కడ కూడా బహుముఖ ప్రేమ కోణమే లోకేష్‌ మరణానికి కారణమని తెలుస్తోంది. లోకేష్‌తో ప్రేమాయణం సాగించిన ఒక అమ్మాయి అదే సమయంలో అతని రూమ్‌ మేట్లతోనూ, తనతో పదో తరగతి చదువుకున్న అబ్బాయితోనూ ఇదే నాటకం నడిపినట్లు వాట్సప్‌ చాట్‌లలో లభించిన ఆధారాలతో లోకేష్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్‌ లవర్‌గా చెబుతున్న అమ్మాయి ఒక షాపింగ్‌మాల్‌లో వేరే అబ్బాయితో కలిసి తిరగడాన్ని కూడా కొందరు ఫొటో తీసి లోకేష్‌కు పంపారట. అదే సమయంలో ఈ విద్యార్థిని లోకేష్‌ రూమ్‌మేట్‌లతో కూడా ఇదే ప్రేమ వ్యవహారాన్ని నడిపినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రెండు మూడు ఫోన్లు మెయింటెయిన్‌ చేసేదని, వాటిలో చాలామంది అబ్బాయిలతో చేసిన చాటింగ్‌లు ఉండేవని, అందుకే వేరే ప్రేమికులు హత్య చేయించినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మొన్నటి వరకు ఇది హత్యేనన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు, ఇప్పుడు దర్యాప్తు అధికారి మారడంతో పోస్టుమార్టం రిపోర్టు మీద అనుమానాలు వ్యక్తం చేసి కేసును క్లోజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది లోకేష్‌ బంధుమిత్రుల ఆవేదన.

ఆమె మరణంపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్‌

తాజాగా ఇదే ఎంఆర్‌ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలానికి చెందిన కల్లి స్వాతి అనే విద్యార్థిని బీసీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. లోకేష్‌ వ్యవహారంలాగే పోలీసులు వచ్చేసరికే ఆమె బాడీని ఫ్యాన్‌ నుంచి కిందికి దించేశారు. అయితే సూసైడ్‌ లెటర్‌లో మాత్రం తన చావుకు ఎవరూ కారణం కాదని మృతురాలు పేర్కొనడం కొంత ఊరట. వైరల్‌ ఫీవర్‌తో కొద్ది రోజులుగా బాధపడుతోందని, ఇంటి నుంచి వచ్చి మూడు రోజులే అయిందని సీఐ శ్రీనివాసరావు మీడియాకు చెప్పినా, దర్యాప్తు చేస్తే ఈ విద్యార్థిని ఆత్మహత్య వెనుక మరేదైన బలమైన కారణం దొరక్కపోదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీకాకుళం ట్రిపులే ఐటీలో ఆమధ్య ఒక విద్యార్థిని బయటి నుంచి ఒకబ్బాయిని తీసుకువచ్చి తన అన్నగా హాస్టల్‌ సిబ్బందికి పరిచయం చేసి తనతో ఉంటాడంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈయన్ను ఆ రాత్రి బాయ్స్‌ హాస్టల్‌లో ఉంచి, ఉదయాన్నే వాట్సాప్‌ కాల్‌ ద్వారా విద్యార్థిని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయడంతో అసలు ఆ వ్యక్తితో తమకు సంబంధమే లేదని వారు తేల్చిచెప్పారట.

ఇటీవల ట్రిపుల్‌ ఐటీలో కొందరు విద్యార్థులు, విద్యార్థినులు కలిసి అరుకు వంటి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఔటింగ్‌ చేసుకువచ్చారు. సిబ్బంది తక్కువ, విద్యార్థులు ఎక్కువ కావడంతో ఎవరు ఎటు పోతున్నారో, ఏ ఫ్యాన్‌కు ఎవరు వేలాడుతున్నారో కనుక్కోవడం కష్టమైపోతుంది. ఈమధ్య అమ్మాయిలు కూడా టాక్సిక్‌గా తయారవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థినులు, ముఖ్యంగా మహిళల కోణంలో అనేక కేసుల నుంచి వీరికి మినహాయింపు లభిస్తున్నా, ఇంకా దేవదాసు కాలం నాటి మైండ్‌సెట్‌తో అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్వారా కుటుంబానికి కడుపుకోత మిగులుస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page