top of page

మహాకుట్ర..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Nov 24, 2025
  • 2 min read
  • గార బ్రాంచిలో ఉద్యోగి సస్పెన్షన్‌

  • గుట్టుగా ఉంచిన అప్పటి ఆర్‌ఎం

  • తప్పించుకోడానికి ప్రత్యేక సమావేశం

  • బజారు బ్రాంచిపై కొనసాగుతున్న సీ‘ఐ’డీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొన్ని బ్రాంచిల్లో వెలుగుచూసిన కుంభకోణాలకు సంబంధించి దర్యాప్తు వేగవంతం కావడంతో వీటితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలున్న బ్యాంకు అధికారులు ఈ కేసు నుంచి బయటపడేందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. ఇప్పటికీ అదే బ్యాంకులో ఉద్యోగాలు వెలగబెడుతుండటంతో ప్రస్తుతం ఉన్న బ్యాంకు సిబ్బంది కూడా వీరికి సహకరించి బ్యాంకు వైపు నుంచి ఎటువంటి తప్పులూ జరగలేదని నిరూపించేందుకు లేదా ఈ కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. నరసన్నపేట బజారుబ్రాంచిలో మొత్తం 34 మంది పేరుతో నకిలీ రుణాలు జనరేట్‌ అయినట్టు తెలుస్తుంది. సీఐడీ ఎంక్వైరీలో ఈ విషయం బయటపడిరదని భోగట్టా. అయితే దీన్ని బ్యాంకు అధికారులు, లేదా సీఐడీ అధికారులు ధ్రువీకరించాలి. బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సంబంధిత అధికారులెవరూ నోరు విప్పడానికి ఇష్టపడటంలేదు. సీఐడీ అధికారులు కేసు పూర్తయ్యేవరకు మాట్లాడమని చెబుతుండటంతో ప్రస్తుతానికి ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి. నరసన్నపేటలో ఒక పిడియాట్రిషియన్‌ పేరుతో రూ.60 లక్షల రుణం అప్పటి బ్యాంకు అధికారులు సొంత ఖాతాలోకి మళ్లించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ వైద్యుడు రూ.10 లక్షలు మాత్రమే రుణం తీసుకోగా, మిగిలిన రూ.50 లక్షలు ఆయన ఖాతాలో కలిపేసి వీరి సొంతానికి వాడుకున్నారని తెలుస్తుంది. అయితే సీఐడీ విచారణలో ఇటువంటి 34 ఖాతాలు బయటపడటంతో వారిని ప్రసన్నం చేసుకోడానికి అప్పటి రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజు ఇటీవల నరసన్నపేట తరచుగా వస్తున్నట్టు చెబుతున్నారు. బ్రాంచి మేనేజర్‌గా పని చేసిన శ్రీకర్‌ను ఇంతకు ముందే టెర్మినల్‌ చేసినందువల్ల ఈ కేసు తరఫున టీఆర్‌ఎం రాజే ఇప్పుడు సీఐడీ ముందున్న ప్రధాన నిందితుడు. అయితే ఈ కేసులో ఆయన పాత్ర ఏమేరకు సీఐడీ ఎస్టాబ్లిష్‌ చేస్తుందో తెలియదు. ఇక గార బ్రాంచి విషయానికి వస్తే, అప్పటి ఆర్‌ఎం ఉద్దేశపూర్వకంగానే అనేక తప్పులు చేసినట్లు కనిపిస్తుంది. బంగారు నగలు ప్రైవేట్‌ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన కేసులో స్వప్నప్రియ మీద అప్పటి రీజనల్‌ మేనేజర్‌ టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో స్వప్నప్రియతో పాటు లాకర్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న ముంజు సురేష్‌ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో తేరుకున్న పోలీసులు సురేష్‌ను కూడా నిందితుడిగా చేర్చారు తప్ప, టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించలేదు. మరీ విచిత్రమైన విషయమేమిటంటే.. స్వప్నప్రియ లేదా ముంజు సురేష్‌లలో ఎవరో ఒకరు సెలవు పెట్టినప్పుడు క్యాష్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన లోకనాధం అనే బ్యాంకు ఉద్యోగిని ఆ సమయంలో సస్పెండ్‌ చేశారు. ఆయన ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు కూడా బంగారు నగలు కనపడలేదని సస్పెన్షన్‌లో పేర్కొన్నారు. కానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఎక్కడా ఈ లోకనాధం పేరు గాని, ఆయనపై తీసుకునే చర్యలు గానీ తెలివిగా ప్రస్తావించలేదు. ఎప్పుడైతే స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుందో మొత్తం కేసును ఆ కుటుంబం మీదకు నెట్టేసి, బయట తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి, యధావిధిగా బ్యాంకు లాకర్‌లో పెట్టేద్దామని అప్పటి ఆర్‌ఎం రాజు భావించినట్లు కనిపిస్తుంది. అందుకే స్వప్నప్రియ సోదరుడి నుంచి డబ్బులు తీసుకొని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న నగదును రాజే విడిపించారు. వీటన్నింటిపైనా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక కథ క్లైమాక్స్‌కు వచ్చిందని వీరికి తెలిసిపోవడంతో రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో బ్యాంకు ప్రతిష్ఠను ముంచేసినవారంతా ఒక కూటమిగా ఏర్పడి ఈ కేసు నుంచి బయటపడేందుకు పథకం రచించినట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎం రాజు రీజనల్‌ మేనేజర్‌గా ఇక్కడ పని చేసినప్పుడు ఆయనకు డ్రైవర్‌గా పని చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు కూడా ఇక్కడ రీజనల్‌ ఆఫీసులోని విషయాలన్నీ అక్కడికి చేరవేస్తుండటంతో ఎటువైపు అడుగులు వేయాలన్న దానిపై వీరు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. గార బ్రాంచిలో మాయమైన బంగారం మొత్తం స్వప్నప్రియ తీసుకుపోయిందని టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత విచారిస్తే, దఫదఫాలుగా గార బ్రాంచి నుంచి బంగారం ప్రైవేటు బ్యాంకులకు వెళ్లిందని తేలింది. ఇందులో విధులకు సెలవు పెట్టిన సమయంలో కూడా బంగారు నగలు బయటకు వెళ్లడం గమనార్హం. ఇవన్నీ తెలిసినా కేవలం ఒక్కరోజులో ఒక్క వ్యక్తి వల్ల ఇవి మాయమయ్యాయని అప్పటి రీజనల్‌ మేనేజర్‌ ఫిర్యాదు ఇవ్వడం వెనుకే ఏదో లోతైన కుట్ర ఉంది. ఇది బయటపడకుండా ఆ కుటుంబాన్ని భయపెట్టడం కోసం స్వప్నప్రియ మొబైల్‌తో పాటు ఆమె వస్తువులు అప్పటి పోలీసులు స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఆమె సోదరుడ్ని రిమాండ్‌కు పంపారు. స్వప్నప్రియ చనిపోయిన తర్వాత కూడా బ్యాంకు అధికారులెవరూ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాకుండా అడ్డుకున్నారు. చివరకు 24 గంటల వ్యవధిలో ఇవ్వాల్సిన దహన సంస్కార ఖర్చులు సైతం అప్పట్లో ఇవ్వడానికి బ్యాంకు అధికారులు రాకపోవడం వెనుక అనేకమంది హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంకుల్లో జరుగుతున్న కుంభకోణాలు, లేదా అక్రమ లావాదేవీలు వంటివేవో స్వప్నప్రియకు తెలిసివుండాలి. లేదూ అంటే బంగారం నగల తాకట్టు రీజనల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల సహకారంతోనే జరిగివుండాలి. ఏదైనా ఇది ఒక కుట్రే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page