సోంపేటలో భారీ చోరీ
- Prasad Satyam
- 2 days ago
- 2 min read
30 తులాల బంగార0 బీరువా నుంచి మాయం

(సత్యంన్యూస్, సోంపేట)
సోంపేట కోర్టుపేటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న తంగుడు మనోజ్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి దొంగలు పడి 30 తులాల బంగారాన్ని, లక్ష రూపాయలు పైగా నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..
సోంపేటలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ ఆదివారం సోంపేటలో ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భార్యతో కలిసి బరంపురంలో మరో ఫంక్షన్‌కు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం హైవే వద్ద మరో వ్యక్తి వేగంగా ద్విచక్ర వాహనం మీద వచ్చి మనోజ్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనోజ్‌కు గాయాలయ్యాయి. ఇంటికి చేరుకున్న తర్వాత మనోజ్‌లో తత్తరపాటు, పరాకు మాటలు గమనించిన భార్య మనోజ్ స్నేహితుడికి ఫోన్‌లో ఈ విషయం తెలియపర్చడంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడొకరు మనోజ్‌కు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ విషయం పక్క వీధిలో ఉన్న మనోజ్ అన్నయ్య శ్రీనుకు తెలియడంతో ఆయన అక్కడకు చేరుకొని ఆందోళనలో ఉన్న మనోజ్ భార్య, పిల్లలతో పాటు మనోజ్‌ను కూడా రాత్రి తన ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. నిద్రలో అన్నీ కుదుటపడటంతో సోమవారం మనోజ్ కుటుంబం తమ ఇంటికి చేరుకుంది. అయితే గేటుకు వేసిన తాళం తమది కాదన్న విషయాన్ని గుర్తించారు. దీన్ని పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి చూసేసరికి బీరువాలో ఉండాల్సిన బంగారం మాయమైందని గ్రహించారు. ఇది 30 తులాల వరకు ఉంటుందని భోగట్టా. బీరువాలో భద్రపర్చిన బంగారంతో పాటు లక్ష రూపాయల పైగా నగదును కూడా దొంగిలించారు. బీరువాను బద్దలుకొట్టకుండా జాగ్రత్తగా తెరిచి దొంగతనానికి పాల్పడటం చూస్తే బీరువా తాళాలు ఎక్కడుండాయో తెలుసుకున్న వ్యక్తులే ఈ పనికి పూనుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. రోజూ బీరువా తాళం ఎక్కడ పెడతారో, దొంగతనం జరిగిన తర్వాత కూడా అదే ప్రదేశంలో దీన్ని భద్రంగా ఉంచడం చూస్తుంటే ఇదంతా తెలిసినవారి పనిగా భావిస్తున్నారు. పక్కనే వెండినగలు ఉన్నా వాటిని మాత్రం దొంగిలించకుండా కేవలం బంగారం, నగదు మాత్రమే తీసుకువెళ్లడం పోలీసులకు సవాల్‌గా మారింది. సోంపేట సీఐ మంగరాజు, ఎస్‌ఐ లవరాజుతో పాటు బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు, కంచిలి ఎస్‌ఐ పారినాయుడులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మరోవైపు క్లూస్‌టీమ్ ఆధారాల కోసం జల్లెడపట్టింది. గత నెల 9న మొగిలికొత్తూరు వీధిలో ఓ ఇంటిలో దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకోసం ఇంటి వెనుక గేటును పగలగొట్టడంతో పాటు ప్రధాన ద్వారానికి వేసివున్న తాళాన్ని కోసి దుండగులు పారిపోయారు. చీకటి బంగ్లావీధిలో కూడా నెల క్రితం ఓ ఇంటితాళాన్ని కట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నేరుగా సోంపేటలో వీఐపీలు ఉండే కోర్టుపేటలోనే భారీ చోరీ జరగడం గమనార్హం.










Comments