top of page

ఫస్ట్‌ అమెరికాకే నష్టం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 28, 2025
  • 2 min read

అగ్రరాజ్యం అమెరికా ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఆ దేశ పాలకుడి పెత్తందారీ ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వివాదాస్పద మైన డోనాల్డ్‌ ట్రంప్‌.. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నారు. ‘అమెరికా ఫస్ట్‌’ అన్న నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ తన హామీలు నిలబెట్టుకునే క్రమంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు ఎదురుతిరిగి అమెరికాకే నష్టదాయకంగా పరిణ మించనున్నాయి. ఇప్పటికే పలు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసిన ట్రంప్‌.. తాజాగా భారతీయ ఐటీ నిపుణులపై అక్కసు వెళ్లగక్కారు. వారికి ఉద్యోగాలు ఇవ్వవద్దని గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ ఐటీ సంస్థలకు హుకుం జారీ చేశారు. ఆ ఉద్యోగాలేవో అమెరికన్లకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై అమెరికన్‌ ఐటీ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విధంగా హెచ్చరించడమే కాకుండా.. అమెరికా బయట పెట్టుబడులు పెట్టవద్దని కూడా ఐటీ సంస్థలకు సూచించారు. ఈ నిర్ణయంతో అమెరికాలోని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అమెరికా వెళ్లాలనుకున్నవారు ఇప్పుడు కెనడా, యూకే, ఆస్ట్రే లియా వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు చూసుకుంటున్నారు. అయితే ఐటీ రంగం విషయంలో ట్రంప్‌ ఆలోచనలు, నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే భారత్‌ కంటే అమెరికాకే ఎక్కువ చేటు జరుగుతుందని ఆ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో 30 శాతానికిపైగా ఐటీ ఉద్యోగులు భారతీయులే. పలు టాప్‌ ఐటీ సంస్థలను నడిపిస్తున్నవారు భారతీయ సంతతి వారే కాగా.. వెయ్యికిపైగా భారత సంసతి నిపుణులు సిలికాన్‌ వ్యాలీలో 40 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన స్టార్టప్‌లను స్థాపించారు. ఎక్కువ గంటలు పనిచేయడం, టీమ్‌ వర్క్‌లో నైపుణ్యం, పనిని ఓన్‌ చేసుకోవడం వంటి లక్షణాలతో భారతీయ టెకీలు ఐటీ కంపెనీలకు తిరుగులేని ఛాయిస్‌గా మారారు. అమెరికన్లతో పోలిస్తే భారతీయులు తక్కువ వేతనం.. అధిక నైపుణ్యంతో పని చేస్తారన్న పేరుంది. దీనివల్ల ఒక అమెరికన్‌ వేతనంతో ముగ్గురు భారతీయులను నియమించుకునే అవకాశం కంపెనీలకు లభిస్తోంది. ట్రంప్‌ విధానాలు అమలైతే భారతీయ ఐటీ నిపుణులు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది. ఈ దేశాలు వీసా విధానాలు, దీర్ఘకాలిక స్థిరత్వం వంటి వాటితో భారతీయ టాలెంట్‌ను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలోనూ ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చాలామంది నిపుణులు స్వదేశంలోనే కొత్త అవకాశాలు అందుకోగలుగుతారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి భారత్‌ లోని బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ట్రంప్‌ హెచ్చరిక ఈ కంపెనీల దీర్ఘకాలిక లక్ష్యాలకు సవాలుగా మారుతుంది. ఇప్పటికే యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌తో జరిగిన ప్రైవేట్‌ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్‌ చెప్పేశారు. ఇప్పుడు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు తమ ఆర్‌ అండ్‌ డీ, ఇంజినీరింగ్‌ ఉద్యోగులను తిరిగి యూఎస్‌కు రప్పించాలని కూడా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్‌ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా ఉంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్‌ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలామంది అభిప్రాయపడుతు న్నారు. ముఖ్యంగా గ్లోబల్‌ టెక్‌ ఎకోసిస్టమ్‌లో భారత్‌ది కీలక పాత్ర. ప్రముఖ టెక్‌ సంస్థల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రా అంశాల్లో భారతీయ ఇంజినీర్లు, డెవలపర్లు, పరిశోధకుల పాత్రే కీలకం. అందువల్ల భారత్‌ నుంచి నియామకా లను నిలిపివేస్తే అమెరికా-భారత్‌ సంబంధాలు దెబ్బతింటాయన్న ఒక ఆందోళన కాగా.. అమెరికా లో సాంకేతిక పురోగతి మందగించవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రంప్‌ ఆదే శాలు ప్రభుత్వ ఒప్పందాలు, ఏఐ గ్రాంట్లపై ఆధారపడే కంపెనీలనే ప్రభావితం చేస్తుందన్న మరో వాదన కూడా ఉంది. ఒకవేళ ప్రైవేట్‌ సంస్థలకు వర్తించినా పాటించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page