బీజేపీ అఖండ స్వరూపం
- DV RAMANA

- 5 hours ago
- 2 min read

సువిశాల ప్రజాస్వామ్య దేశంలో భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు కలిగిన కోట్లాది ఓటర్ల మనసులను చురగొని.. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం ఎంతమాత్రం చిన్న విషయం కాదు. అధికారంలోకి రావడానికి అవసరమైన భారీ ఓటు బ్యాంకు సాధించడం చాలా కష్టం. ఆ ఓటుబ్యాంకు చేజారకుండా ఏళ్ల తరబడి కాపాడుకోవడం అంతకంటే కష్టం. అది కూడా ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ముద్ర పడిన పార్టీ ఈ ఫీట్ సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆ అద్భుతాన్నే భారతీయ జనతా పార్టీ సాధించింది. ఒకప్పుడు జనసంఫ్‌ుగా కార్యకలాపాలు సాగించి బీజేపీగా రూపాంతరం చెందిన ఈ పార్టీ ఒకప్పుడు రెండే రెండు ఎంపీ సీట్లతో మిణుకు మిణుకుమంటుండేది. అప్పట్లో ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి దీన్నే ప్రస్తావిస్తూ ‘ఇప్పుడు రెండు సీట్లు ఉన్న ఈ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలను శాసిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఆయన వాక్కు ఇప్పుడు నిజమైంది. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రికార్డుస్థాయిలో 202 సీట్లు సాధించి రెట్టించిన బలంతో అధికారాన్ని నిలబెట్టుకుంది. బీహార్ అసెంబ్లీలో తొలిసారి 89 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం కూడా బీజేపీ ఘనతే. బీహార్ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం 1654కి పెరిగింది. ఇది ఆ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు కావడం గమనార్హం. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న కమలదళం 1990 దశకం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా రూపాంతరం చెందడం విశేషం. అదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి(మహాఘటబంధన్)కు అతిపెద్ద దెబ్బగా పరిణమించాయి. ఆ కూటమి ప్రత్యేకించి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాల్లో మాత్రమే గెలిచి మైనారిటీ ప్రభుత్వం అన్న విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఘన విజయాలు సాధిస్తూ వస్తోంది. 1950 దశకంలో జనసంఫ్‌ుగా ఉంటూ 1977లో జనతా పార్టీతో కలిసిన అనంతరం 1980లో భారతీయ జనతాపార్టీగా మారింది. కాంగ్రెస్ వంటి అతిపెద్ద, పురాతన పార్టీని ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా ఆ సమయంలో కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలవడానికే బీజేపీ నానాకష్టాలు కష్టపడిరది. హిందుత్వ అజెండా కూడా బీజేపీ ఎదుగుదలకు సవాల్‌గా మారింది. అయితే ఆ అజెండాను, పార్టీని కూడా సమాంతరంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో నాయకత్వం విజయం సాధించడం వల్లే నేడు బీజేపీ దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ‘ఈ రోజు పార్లమెంటులో మేం ఇద్దరమే ఉండొచ్చు.. కానీ కొన్ని సంవత్సరాలలో మేమే అధిక సంఖ్యలో ఉంటాం’ అన్న నాటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఆశాభావాన్ని, జోస్యాన్ని నిజం చేస్తూ బీజేపీ అమిత వేగంతో అభివృద్ధి సాధించింది. దేశంలో అతిపెద్ద పార్టీగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు(ఎమ్మెల్యేలు, ఎంపీలు) కలిగిన పార్టీ కూడా తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్‌సభలో 240 మంది, రాజ్యసభలో 103 మంది.. మొత్తం 343 మంది ఎంపీలు ఉన్నారు. అయితే దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా 126 ఎంపీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక భౌగోళికంగా చూసుకుంటే జమ్మూకాశ్మీర్ నుండి తమిళనాడు వరకు అనేక రాష్ట్రాల అసెంబ్లీలో బీజేపీకి 1654 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత దేశంలో 1035గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 2015లో 997కి తగ్గింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 50 నుంచి 100 వరకు పెరుగుతూ వస్తోంది. 2023లో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 1441 కాగా 2024లో అది 1588కి, ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 1654కి పెరిగింది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 258 మంది, మధ్యప్రదేశ్‌లో 165 మంది, గుజరాత్‌లో 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్‌లో 29, ఢల్లీిలో 48, పుదుచ్చేరిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, అసోం, గోవా, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సోలో పాలక పార్టీగా, బీహార్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలలో కూటమిగా ప్రభుత్వాల్లో భాగస్వామ్యం వహిస్తోంది. మరో పెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఇందులో సగం కూడా ఎమ్మెల్యేలు లేకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 640 ఎమ్మెల్యేలు, 126 మంది ఎంపీలే ఉన్నారు. కాగా కాషాయదళానికి దేశవ్యాప్తంగా 170 శాసనమండలి సభ్యులు కూడా ఉన్నారు. జిల్లాల స్థాయిలో మున్సిపాలిటీలు ఇతర స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జిల్లాపరిషత్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు వంటి వారితో అత్యధిక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఇంత ఘనత సాధించినా ఒకలోటు మాత్రం బీజేపీని వెక్కిరిస్తోంది. దక్షిణ భారతంలో పాగా వేయాలన్న ఆ పార్టీ ఆశలు మాత్రం తీరడంలేదు. కర్ణాటకలో అప్పుడప్పుడూ అధికారం సాధించగలుగుతున్నా తమిళనాడు, కేరళలు మాత్రం కొరుకుడుపడనివిగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంలో చిన్న భాగస్వామిగా సరిపెట్టుకుంటోంది.










Comments