బీజేపీ పంజరంలో చిలకలా మారిన ఎన్నికల సంఘం.
- Guest Writer
- Aug 11
- 2 min read
బీజేపీ పంజరంలో చిలకలా మారిన ఎన్నికల సంఘం.
ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం.
కేంద్రానికి భయపడుతున్న వైకాపా
రాహుల్ గాంధీ విజ్ఞప్తిని సుప్రీం ‘సుమోటోగా స్వీకరించాలి
కేంద్రమాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
భారతదేశంలో ప్రజలు ఒకరికి ఓట్లేసి వేరొకరితో పరిపాలింపబడుతున్నారని, ప్రజులు ఈ విషయమై విస్తృతంగా చర్చిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ కిల్లి కృపారాణి ద్వజమెత్తారు. ఈమేరకు సోమవారం టెక్కలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారత ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల బెంగుళూరులో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్’’లో ఈ దిశగా ఆధారాలన్నీ చూపినా భారత ఎన్నికల సంఘం హేతుబద్దంగా స్పందించకుండా ప్రతిపక్షాలను బెదిరించే ధోరణిలో ప్రవరిస్తుందని ఆమె విమర్శించారు. రాహుల్‌గాంధీ 2024 ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై అన్ని ఆధారాలు చూపించారని, 4.75 కోట్ల ఓట్లు తారుమారయ్యాయని, 79పార్లమెంటు స్థానాల్లో ఈ ప్రభావం పడిరదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఇండియా కూటమి, నాలుగు నెలల కాలంలో అనూహ్యమైన ఫలితాన్ని చవిచూడటం వెనుక కోటి జోట్లు గల్లంతు కుంభకోణం దాగుందన్నారు. అన్ని విధాలా నిరూపించినా ఎన్నికల సంఘం బీజేపీ పంజరంలో చిలకలా మాట్లాడుతుందన్నారు. కర్నాటక రాష్ట్రంలో మహాదేవపూర్ సెగ్మెంట్‌లో లక్షకు పైగా ఓట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఒక ఇంటిపేరుతో వందలాది ఓట్లు, ఒకే వ్యక్తి పేరుతో దేశవ్యాప్తంగా వందలాది ‘ఎపిక్’ కార్డులు ఎలా పుట్టుకొస్తున్నాయో ఎన్నికల సంఘం చెప్పాల్సిన అవసరం లేదా అని ఆమె నిలదీశారు. భారత రాజ్యాంగంలో ఉన్న 324-329 అధికరణలు ఎన్నికల సంఘానికిచ్చిన అధికారులు నేడు దుర్వినియోగమవుతున్నాయన్నారు. బీహార్ రాష్ట్రంలో 326వ అధికారం దుర్వినియోగమవుతుందని, ఫలితంగా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కోరిన విధంగా డిజిటల్ ఓటర్ల జాబితాను అందజేయాలని, ఎన్నికల కమిష న్ ప్రతిష్ఠను దిగజార్చకుండా స్వతంత్రంగా, రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.
బీజేపీ అంటే వైకాపాకు ఎందుకంత భయం?
2024 సాధారణ ఎన్నికల్లో అవకతవకల ఫలితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్‌లో సుమారు 53 లక్షల ఓట్లు అధికంగా వచ్చినా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా కిమ్మనడం లేదని కృపారాణి వాపోయారు. ఈ దిశలో బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించి ఎన్నికల అవకతవకలపై పోరాడాల్సిన వైకాపా ఆ బాధ్యతనుండి తప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైకాపాతో సహా కమ్యూనిష్టు పార్టీలు, ప్రజాసంస్ధలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు రాహుల్ గాంధీతో కలసి రావాలని ఆమె కోరారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో కల్పించుకొని ఎన్నికల సంఘం తీరుపై విచారణకు కేసును ‘‘సుమోటో’’గా స్వీకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పీసీసీ పదవిపై కోరిక లేదు
మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ఒకప్రశ్నకు సమాధానమిస్తూ తాను పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకోవడం లేదన్నారు. తన ఢల్లీి పర్యటన సందర్భంగా కేంద్రంలో రాహుల్, ఖర్గే, సోనియా, కె.సి.వేణుగోపాల్ వంటి నేతల్ని కలవడం వాస్తవమేనని, అయితే రాష్ట్రలో పార్టీ పటిష్టతపై మాత్రమే తాను వారితో మాట్లాడానన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిపై వస్తున్న వార్తలు ఊహాజనితమేనన్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్ర పరిధిలో పార్టీ పటిష్టపరిచే దిశగా కృషి చేస్తున్నారని, జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కూడా ఆమె కసరత్తు చేస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comentários