top of page

బెట్టింగుల్లో కూటమి వైపే మొగ్గు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 12, 2024
  • 2 min read
  • `టీడీపీ గెలిస్తే అర్థరూపాయి..

  • `వైకాపా గెలిస్తే రూపాయికి రెండు రూపాయలు

  • `మారిన రాజకీయ పరిణామాలకు ఇదే నిదర్శనం

  • (సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగులు జోరందుకున్నాయి. ఈసారి తెలుగుదేశం కూటమి గెలుపుపై రాష్ట్రవ్యాప్తంగా భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. వైకాపా గెలిస్తే రూపాయికి రెండు రూపాయలు, టీడీపీ గెలిస్తే రూపాయకి అర్థరూపాయి నిష్పత్తిలో బెట్టింగులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమికి వేవ్‌ ఉందని తెలుసుకున్న బెట్టింగ్‌రాయుళ్లు టీడీపీ మీదే పందెం కాయడానికి మొగ్గు చూపుతున్నారు. గత వారం రోజుల్లో రాజకీయ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పు చోటుచేసుకుంది. వైకాపా గెలుస్తుంది లేదా ఎడ్జ్‌లో ఉందనుకున్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ బలపడటంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైనే ఇప్పుడు బెట్టింగులు నడుస్తున్నాయి. క్రికెట్‌తో పాటు ఎన్నికల సీజన్‌లో కూడా రాష్ట్రంలో బెట్టింగులు సర్వసాధారణం. అయితే విచిత్రంగా గతసారి వైకాపా గెలుస్తుందని పందెం కాసిన అనేకమంది ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని డబ్బులు పెట్టారని భోగట్టా.

ఆన్‌లైన్‌లోనూ జోరుగా

రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న అనధికార సమాచారాన్ని బట్టి చూస్తే టీడీపీకి అనుకూలంగా అనుకూలంగా మెజారిటీ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారంలోకి రావడం, అధికారం కోల్పోవడం వంటి వాటితో సంబంధం లేకుండా ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇందులో వైకాపాకు 70 నుంచి 75 సీట్ల మధ్యలో వస్తాయని కొందరు కోట్లాది రూపాయలు పందెం కాసినట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ, జనసేనలకు కలిపి 15 నుంచి 18 లోపు సీట్లు వస్తాయని పందాలు ఉన్నాయి. టీడీపీ సింబల్‌ సైకిల్‌పై గెలిచేవారు 85 నుంచి 90 లోపు ఉంటారన్న కోణంలో భారీ ఎత్తున బెట్టింగులు జరిగాయి. అంటే.. కూటమికి అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లు వస్తాయన్న భావన ఈ బెట్టింగుల ద్వారా అర్థమవుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్యనో, రెండు గ్రూపుల మధ్యనో బెట్టింగు సొమ్ములు మధ్యవర్తి దగ్గర పెట్టి పందెం గెలిచిన తర్వాత సొమ్ములు సర్దుకోవడం ఎప్పట్నుంచో జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ ఎన్నికల కోసం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు కూడా సోమవారం నుంచి రంగంలోకి దిగుతున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రతి రూపాయిని బెట్టింగ్‌ రూపంలో ఆన్‌లైన్‌లో పెట్టవచ్చని ఇప్పటికే అనధికారిక సమాచారాలు వచ్చాయి. వాస్తవానికి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ అంటేనే అన్ని అనుమతులు తీసుకున్నట్టు లెక్క. కానీ మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మిగిలిన యాప్‌లు ఎన్నికల ఫలితాల బెట్టింగ్‌పై బహిరంగంగా ప్రకటనలు ఇవ్వడం మానేశాయి. కాకపోతే ఇప్పటికే ఈ ఆన్‌లైన్‌ యాప్‌లకు ప్రతి ఊళ్లోనూ ఏజెంట్లు ఉండటంతో వారి ద్వారా బెట్టింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీడీపీ వైపే ఎక్కువ మంది బెట్‌ వేసినట్లు తెలుస్తోంది. పాతపట్నం, పలాస నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్ల ఇప్పటికే స్థానిక బెట్టింగ్‌లు పూర్తయిపోయాయి. పోలింగ్‌ తర్వాత కూడా బెట్టింగుల కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయి.

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page